జూన్ 2.. కొత్త సర్కారుకు ముందే.. రాజధానిపై హక్కు హుళక్కి.. ఇక అక్కడ చూసుకోవాల్సిందే
ఒకవేళ మరోసారి వైసీపీ గెలిస్తే విశాఖపట్నం కచ్చితంగా పాలనా రాజధాని కానుంది. అదే టీడీపీ కూటమి నెగ్గితే అంతకంటే కచ్చితంగా అమరావతి రాజధాని అవుతుంది.
By: Tupaki Desk | 13 May 2024 3:30 PM GMTతమిళనాడు నుంచి వేరుపడి.. ఆంధ్రాగా ఏర్పడి.. 'ఆంధ్రప్రదేశ్'లో భాగమై.. మళ్లీ విభజిత 'ఏపీ'గా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ కు తొలి నుంచి 'రాజధాని' ఒక చేదు అనుభవం. మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయే సమయంలో రాజధానిగా చెన్నై కోసం పట్టుబట్టిన ఆంధ్రా నేతలు అవమానానికి గురయ్యారని చెబుతారు. ఇక సొంత రాష్ట్రంగా ఏర్పడ్డాక కర్నూలును రాజధానిగా చేసుకుని కొన్నాళ్లు పరిపాలన సాగించారు. అనంతరం ఉమ్మడి ఏపీ ఆవిర్భావంతో హైదరాబాద్ స్టేట్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ అందరికీ రాజధాని అయిపోయింది. వందల ఏళ్ల చరిత్ర, అద్భుతమైన వాతావరణం, అవకాశాల నగరం కావడంతో హైదరాబాద్ రోజురోజుకు డెవలప్ అవుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలుగా పనిచేసినవారంతా హైదరాబాద్ ప్రతిష్ఠను పెంచుతూ వచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ ఒరవడి కొనసాగింది.
మరొక్క 20 రోజులే ఉమ్మడి రాజధాని 2014లో తెలంగాణ ఏర్పడిన సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా మారింది. కానీ, 2015లో ఏపీలో అమరావతి రాజధాని పనులు మొదలవడంతో కొన్నాళ్లకు అక్కడికి తరలిపోయింది. కాగా, విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగనుంది. అటు ఏపీ ఒకవేళ సొంత రాజధానిని నిర్మించుకున్నా సరే.. హైదరాబాద్ పై ఆ రాష్ట్రానికి ఈ హక్కు ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన గడువు 2014 జూన్ 2న మొదలైంది. ఆ రోజున తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. సాపేక్షంగా విభజిత ఏపీ కూడా మనుగడలోకి వచ్చినట్లైంది. 2024 జూన్ 2తో 'ఉమ్మడి రాజధాని హైదరాబాద్' అనేది కాలగర్భంలో కలిసిపోనుంది.
ఇక హైదరాబాద్ తెలంగాణదే వచ్చే నెల 2వ తేదీ తర్వాత హైదరాబాద్ నగరంపై పూర్తి హక్కులు తెలంగాణకే చెందుతాయి. ఇక ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి ఫలితాలు జూన్ 4 రానున్నాయి. అంటే.. హైదరాబాద్ పై హక్కులు కోల్పోయిన రెండు రోజులకు ఏపీలో కొత్త ప్రభుత్వం ఎవరిదో తేలుతుంది. ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పూర్తిగా అక్కడి రాజధానికే పరిమితం అన్నమాట. ఒకవేళ మరోసారి వైసీపీ గెలిస్తే విశాఖపట్నం కచ్చితంగా పాలనా రాజధాని కానుంది. అదే టీడీపీ కూటమి నెగ్గితే అంతకంటే కచ్చితంగా అమరావతి రాజధాని అవుతుంది.
కొసమెరుపు: హైదరాబాద్ ఎవరిది? అనే అంశంతో పాటు ఉమ్మడి ఏపీ విభజన గాయాలు, భావోద్వేగాలు ఐదేళ్ల పాటు కొనసాగాయి. 2018 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబును చూపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో గెలిచారు. కానీ, ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ప్రభావమేమీ లేకపోయింది. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు నేతలు హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. వాటికి పెద్దగా స్పందనే రాలేదు.