నామినేటెడ్ పదవుల్లో కొత్త ఫార్ములా.. టీడీపీ - జనసేన - బీజేపీ.. ఎవరికి ఎలా..?
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయం ఆసక్తిగా మారింది. దాదాపు అన్ని నామినేటెడ్ పోస్టులను కలుపుకుంటే సుమారు 350 దాకా ఉంటాయని ఒక అంచనా
By: Tupaki Desk | 6 Aug 2024 4:11 AM GMTరాష్ట్రంలో నామినేటెడ్ పదవుల విషయం ఆసక్తిగా మారింది. దాదాపు అన్ని నామినేటెడ్ పోస్టులను కలుపుకుంటే సుమారు 350 దాకా ఉంటాయని ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఈ పదవులు ఎలా తీసుకోవాలి? ఎవరెవరు ఏ ఏ పదవులు పంచుకోవాలి? అనే వ్యవహారం నిన్న మొన్నటి వరకు వివాదంగా మారింది. అయితే తాజాగా దీనిపై ఒక క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 350 నామినేటెడ్ పదవుల్లో 60 శాతం అంటే 210 స్థానాలను టిడిపి తీసుకుంటుందని మిగిలిన 40% లో 25% జనసేన, 15% బిజెపిలు పంచుకునే అవకాశం ఉందని ఆయా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫార్ములాను తయారు చేశారని తెలుస్తోంది. వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో టిడిపి ఒంటరిగానే మ్యాజిక్ మార్కు తెచ్చుకుంది. అయినప్పటికీ కూటమి ధర్మానికి కట్టుబడి ఆయా పార్టీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వంలోనూ చోటు కల్పించింది. నామినేటెడ్ పదవుల వ్యవహారంలో తమకు కూడా న్యాయం చేయాలని జనసేన, బిజెపిలో కోరుతున్నా యి. జనసేన బహిరంగంగానే నామినేటెడ్ పదవుల వ్యవహారాన్ని ప్రస్తావిస్తుండగా బిజెపి మాత్రం కేంద్రంలోని బిజెపి నాయకులతో ఇక్కడ పావులు కదుపుతోంది.
దీంతో తొలిమాసంలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని అనుకున్నప్పటికీ సమీకరణలు, ఫార్ము లాలు కుదరకపోవడంతో రెండు నెలలు గడిచిపోయాయి. మరోవైపు తాము పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసినా ఇంతవరకు గుర్తించడం లేదన్న భావన టిడిపిలో కనిపిస్తోంది. కీలకమైన నాయకులు బహిరంగంగానే పదవుల విషయంలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు నాయకులు సైలెంట్ అయిపోయారు. పార్టీ తమను పట్టించుకోనప్పుడు తాము మాత్రం ఎందుకు బయటకు రావాలి అన్న విధంగా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మరింత జాప్యం చేయడం సమంజసం కాదని భావించిన ముఖ్య మంత్రి చంద్రబాబు 60:25:15 ఫార్ములాతో నామినేటెడ్ పదవులు పంచుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ నియమకాలు కూడా ఈనెల చివరిలో లేదా వచ్చేనెల తొలివారం నాటికి పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. టిడిపి విషయాన్ని తీసుకుంటే ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలో ఒక స్పష్టత వచ్చేసింది. క్షేత్రస్థాయిలో నాయకుల నుంచి అదే విధంగా కేడర్ నుంచి తీసుకున్న జాబితా ఇప్పటికే చంద్రబాబుకు చేరింది.
ఈ నేపథ్యంలో నాయకులను ఎంపిక చేసే ప్రక్రియను కూడా ఆయన ప్రారంభించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక వర్గాలపరంగా ఉన్న కార్పొరేషన్లకు ఆయా వర్గాలను నియమించనున్నారు. అయితే ఈసారి కొంత మార్పు దిశగా అడుగులు వేయాలని చూస్తున్నారు. అంటే కార్పొరేషన్ పరిధిలో ఉంటూ కేవలం ఆ కార్యక్రమాలకే పరిమితం కాకుండా పార్టీ తరఫున కూడా బలమైన వాయిస్ వినిపించే నేతలకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు వ్యూహంగా ఉంది.
ఇక ఇతర నామినేటెడ్ పదవులు విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని చూస్తున్నారు. ఇటీవల టికెట్లు కోల్పోయినవారు, టికెట్లు త్యాగం చేసిన వారికి ఈసారి ప్రాధాన్యం దక్కనుంది. ఇక జనసేన విషయాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ ఎంపిక చేసిన వారు మాత్రమే కనిపిస్తున్నారు. ఈ పార్టీలో ఎక్కడా సర్వేలు గానీ జాబితాలు రూపొందించే విషయంలో కానీ ఎలాంటి సమాచారం లేదు. బిజెపి విషయాన్ని తీసుకుంటే చాలామంది పాత కాపులకు ఈసారి టికెట్లు ఇవ్వలేదు.
ఉదాహరణకు టికెట్ల కోసం ప్రయత్నించిన రాజ్యసభ సభ్యుడు జీవీ ఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి వంటి వారు ఉన్నారు. ఇలా ఓ 15 నుంచి 30 మంది వరకు అవకాశం దక్కించుకునే చాన్స్ కనిపిస్తుందని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఉమ్మడిగా నామినేటెడ్ పదవులను పంచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముందు ముందు ఇబ్బందులు రాకుండా కూడా చూసుకునేలా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.