ఈ ఏపీ నేతలకు తటస్థ ముద్రే కొంప కొల్లేరు చేసిందా... ఫ్యూచర్ ఉందా ?
అయితే.. ఈ విషయంలో అటు వైసీపీలోను, ఇటు టీడీపీలోను.. చాలా మంది నాయకులు ఎక్కడో ఒక చోట తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు.
By: Tupaki Desk | 7 Aug 2023 11:15 AM GMTపార్టీలో ఉండడమే కాదు.. ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేసే నాయకులు అవసరం. ఎందుకంటే.. పార్టీ లో ఉండడానికి చాలా మంది నాయకులే ఉంటారు. కానీ, అధినేత మెప్పు పొందడం, ఆయన ఆశీస్సులు ఉండడం అనేది అత్యంత కీలకం.
అయితే.. ఈ విషయంలో అటు వైసీపీలోను, ఇటు టీడీపీలోను.. చాలా మంది నాయకులు ఎక్కడో ఒక చోట తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. దీంతో వీరికి ప్రాధాన్యం లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది.
వైసీపీని తీసుకుంటే.. ఎంతో మంది నాయకులు పార్టీ తరఫున పనిచేస్తున్నారు. కానీ, వీరిలో అందరినీ నమ్మే పరిస్థితి లేకుండా పోయిందనే వాదన పార్టీ అధినేత నుంచే వినిపిస్తోంది. ఏమో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎటు అడుగులు వేస్తారో.. అనే చర్చ పార్టీ అధినేత నుంచే మొదలు కావడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఉదాహరణకు గూడురు ఎమ్మెల్యే వరప్రసాద్, ఇక, ఇతర నేతల విషయానికి వస్తే.. గాదె వెంకట రెడ్డి తనయుడు వంటివారి విషయంలో అనుమానపు మేఘాలు ఉన్నాయి.
దీనికి కారణం..వారు పార్టీలోనే ఉన్నప్పటికీ.. పొరుగు పార్టీలతోనూ టచ్‌లోకి వెళ్తున్నారు. ఇక, టీడీపీ విషయానికి వస్తే.. పార్టీలోనే ఉన్నా.. టికెట్ వస్తుందో రాదో.. అనే వ్యూహంతో పొరుగు పార్టీలతో టచ్‌లోకి వెళ్తున్న నాయకుల సంఖ్య పెరుగుతోంది.
మరికొందరు సొంతగా అయినా.. సత్తా చాటాలని చూస్తున్నా రు. దీంతో వీరంతా కూడా పార్టీ అధినేతలకు ఏమీ కాకుండా పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తుండ డం గమనార్హం.
వాస్తవానికి ఏ నాయకుడు అయినా.. తన మానాన తను..పార్టీ కోసం ప్రయత్నం చేస్తే.. పనిచేస్తే.. ఎలాంటి ఢోకాలేదు. కానీ, గత నాలుగేళ్లుగా ఏమీ పట్టనట్టు వ్యవహరించి.. ఇప్పుడు.. ఎన్నికల సమయం వచ్చే సరికి టికెట్ల కోసం పోరాడుతుండడం.. కుదరకపోతే.. పార్టీలు మారుతామనే సంకేతాలు పంపిస్తుండడంతో అన్ని పార్టీల్లోనూ ఇలాంటి నాయకులపై తటస్థులనే ముద్ర పడుతోంది. ఇది అంతిమంగా ఓ వెలుగు వెలిగిన.. రాయపాటి, డీఎల్ రవీంద్రారెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి వంటివారికి కూడా ఇబ్బందిగానే పరిణమిస్తుండడం గమనార్హం.