కొంప ముంచబోతున్న లెఫ్ట్ రాజకీయం... దెబ్బ పడడం ఖాయం....?
టీడీపీ పార్లమెంట్ లో బీజేపీ మీద పెట్టిన అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసింది అని ఆయన మండిపడుతున్నారు
By: Tupaki Desk | 25 Sep 2023 3:57 AM GMTఏపీలో వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చబోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. అయితే అదంత సులువు కాదనే అంటున్నారు జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరితే కామ్రేడ్స్ దూరం అవుతాయి. ఒక వేళ బీజేపీ లేకపోతే సీపీఐ వస్తుందేమో కానీ సీపీఎం సొంత దారే అంటోంది. బీజేపీకి మద్దతుగా నిలిచిన పార్టీలతో చేతులు కలపమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అంటున్నారు.
తాము సొంతంగా పోటీ చేసి ఏపీలో ఎదుగుతామని చెబుతున్నారు. పాతిక దాకా అసెంబ్లీ సీట్లకు నాలుగు ఎంపీ సీట్లకు పోటీ చేయలని అనుకుంటున్నట్లుగా ఆయన ప్రకటిస్తున్నారు. ఏపీలో మూడు ప్రధాన పార్టీలు బీజేపీకి సలాం కొడుతున్నాయని ఆయన విమర్శిస్తున్నారు.
టీడీపీ పార్లమెంట్ లో బీజేపీ మీద పెట్టిన అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేసింది అని ఆయన మండిపడుతున్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి ఎలా మద్దతు టీడీపీ ఇస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా తమ దారి రహదారి అని ఆయన అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తామని అంటున్నారు. నిజానికి ఏపీ రాజకీయాల్లో సీపీఐ మొదటి నుంచి టీడీపీ వైపుగా ఉంటూ వస్తోంది. కానీ సీపీఎం మాత్రం ప్రజా సమస్యలను కొలమానంగా తీసుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వస్తోంది.
పొత్తుల విషయంలో కూడా ఇప్పటిదాకా సీపీఎం బయట పడలేదు. ఇపుడు సొంతంగా పోటీ అంటోంది. 2019 ఎన్నికల్లో జనసేన సీపీఐ సీపీఎం పోటీ చేశాయి. కానీ ఈ మూడు పార్టీలకు ఎక్కడా పెద్దగా డిపాజిట్లు రాలేదు. ఇక ఏడు శాతం కూటమికి ఓట్లు వచ్చినా అందులో ఆరు శాతం పైగా జనసేనవే ఓట్లు అని చెప్పాలంటారు.
మరి లెఫ్ట్ పార్టీల ధీమా ఏంటో తెలియదు కానీ సీపీఎం మాత్రం ఒంటరి పోరుకే మొగ్గు చూపుతోంది. మిత్రుడు సీపీఐ కలసివస్తే రెండు పార్టీలు కలసి యాభై సీట్లకు అసెంబ్లీకి పోటీ చేయవచ్చు. బీజేపీతో కనుక టీడీపీ పొత్తు ఉంటే మాత్రం సీపీఐ కూడా సీపీఎంతో కూడవచ్చు అని తెలుస్తోంది. ఆ మీదట కాంగ్రెస్ కూడా ఈ కూటమితో కలిస్తే ఆప్ లోక్ సత్తా వంటి ఇతర పార్టీలను కలుపుకుని ఏపీలో కొత్త కూటమిని కట్టే ఆలోచన ఉంది అంటున్నారు
అపుడు ఈ కూటమికి ఒకటి రెండు శాతం ఓట్లు వచ్చినా కూడా ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల జయాపజయాల మీద తీవ్ర ప్రభావం పడుతుంది అని విశ్లేషిస్తున్నారు. బీజేపీ చివరి నిముషంలో టీడీపీ జట్టులో కలుస్తుంది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఎర్రన్నల కూటమి మీద ఆసక్తి పెరుగుతోంది. ఆ విధంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో హోరా హోరీ పోరులో వంద ఓట్లు కూడా ప్రతీ నియోజకవర్గంలో కీలకం అవుతాయి. అపుడు లెఫ్ట్ పార్టీలు ఆయా చోట్ల ఓట్లను ఆ స్థాయిలో చీల్చినా దెబ్బ పడేది పెద్ద పార్టీలకే అంటున్నారు. సో లెఫ్ట్ రాజకీయం ఏపీలో ఎలా ఉండబోతోందో చూడాల్సి ఉంది.