వెరపు జుగుప్సా లేని రాజకీయం...నవ్విపోదురు గాక...!
ఇక వేదిక ఎక్కి స్పీచులు ఇచ్చిన వారు అంతా ఆకాశమే హద్దు అన్నట్లుగా మాట్లాడుతూంటారు. ఏపీ అప్పుల కుప్పలో ఉంది.
By: Tupaki Desk | 29 Feb 2024 2:22 PM GMTరాజకీయాల్లో హుందాతనం అంటే నేతి బీరకాయలో నేయిని వెతుక్కున్నట్లే. వర్తమానంలో అది మరింతగా అడుగంటింది. లేకపోతే ఈ తేడా రాజకీయాలేంటి. భాష ఎటూ చచ్చిపోతోంది రాజకీయ నేతల నోట్లో పడి. ఇపుడు వావీ వరసలు సమాజ సభ్యతలు అన్నీ మరచిపోయి జుగుప్సాకరమైన మాటలు ఏవగింపు కలిగే పిలుపులూ ఇవన్నీ ఏమిటి అంటే ప్రజలకు వచ్చిన అతి పెద్ద కష్టం అని చెప్పాలి.
అయిదు కోట్ల జనాలకు శత్రువు ఎక్కడో లేడు అన్నట్లుగా పరిస్థితి ఉంది. సత్తాలు సవాళ్ళూ దమ్ములూ ధైర్యాలు అన్నీ ఉన్న గడ్డ మీదనే ఎగిరి ఇంకిపోతూంటాయి. పదేళ్ళుగా ఏపీకి రావాల్సిన విభజన హామీలు గురించి మాట్లాడినది లేదు, అన్ని పార్టీలూ ఒక తానులో ముక్కలుగా మారాయి.
ఇక వేదిక ఎక్కి స్పీచులు ఇచ్చిన వారు అంతా ఆకాశమే హద్దు అన్నట్లుగా మాట్లాడుతూంటారు. ఏపీ అప్పుల కుప్పలో ఉంది. ఏపీకి రాజధాని లేదు, పోలవరం లేదు, ప్రత్యేక హోదా వల్ల వచ్చే పరిశ్రమలు ఉపాధి కూడా అది ఇవ్వకపోవడం వల్ల లేదు. కానీ ఎన్నికల ప్రచార సభలు చూస్తే అత్యంత దారుణంగా సాగుతున్నాయి.
ఒకరి మీద ఒకరు టన్నుల కొద్దీ అక్కసుతో రగిలిపోతూ విమర్శలు చేసుకుంటున్నారు. ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మీది తేడా రాజకీయం అంటే మీది మాడా రాజకీయం అని ఒకరిని ఒకరు దూషించుకుంటూంటే ఏపీకి ఏమి ఖర్మ పట్టిందిరా బాబూ అనుకుంటున్నారు జనాలు.
ఏపీలో సమస్యలు లేవా. ప్రజలకు ఇవ్వాల్సిన హామీలు లేవా. ఒక రాజకీయ నేత అంటాడూ టన్నుల కొద్దీ భయాన్ని ప్రత్యర్థికి ఇస్తానని, ఇది ప్రజలకు అవసరమా. మరో నేత ప్రత్యర్ధి వ్యక్తిగత విషయాలు బయట పెడతా అని అంటాడు. అవి జనాలకు ఇపుడు ముఖ్యమా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఆరు పదులకు చేరులో ఉన్న వారు ఏడు పదులు దాటిన వారు కూడా ఒక విధానం లేకుండా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. దీనిని చూసిన జనాలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇది వరకూ సామాజిక మాధ్యమాలో ఈ తరహా అసభ్యకరమైన కామెంట్స్ ఎవరైనా పెడితే తొలగించేవారు. ఇపుడు మాత్రం వాటిలోని సారాన్నే తీసుకుని ఏకంగా స్టేజీలు ఎక్కి మరీ పంచు డైలాగులుగా పేల్చేస్తున్నారు.
ఇది మహా గొప్ప అని చెప్పుకుంటున్నారు. అదేదో సినిమాలో ఒక పాత్ర మరో పాత్రలో అంటుంది. మీకు ఎంత డబ్బు కావాలీ అంటే కొంచెం సంస్కారం మీ నుంచి అని బదులిస్తుంది. అలా ఇపుడు ఓటర్లు రాజకీయ నేతల నుంచి కోరుకునేది సభ్యతతో కూడిన భాషను. ఈ తేడా మాటలను కాదు అని అంటున్నారు.
ఏపీలో యువత పెద్ద ఎత్తున ఉన్నారు, వారికి స్పూర్తిగా నిలవకపోయినా ఫరవాలేదు. వారిని దారి తప్పించేలా వ్యవహరించకుండా ఉంటే చాలు మేలు అని అంటున్నారు. అయినా ఇంకా తెర లేచింది అసలైన సినిమాలు ఎన్ని చూపిస్తారో అని జనాలు జడుసుకునే పరిస్థితి. ఏపీలో ఏప్రిల్ రెండవ వారంలో ఎన్నికలు జరుగుతాయి. అప్పటి వరకూ అంటే మరో నెలన్నర దాకా ఈ రకమైన విమర్శలు ప్రతి విమర్శలు దారుణమైన ఏహ్యమైన అతి జుగుప్సాకరమైన మాటలను ఈసారి ఎన్నికల్లో భరించాల్సి రావడం నిజంగా బాధాకరమే.
వారు అన్నారని వీరు ఇలా ఎవరూ తగ్గడంలేదు. మరి హుందాతో కూడిన రాజకీయం ఇపుడు సాగుతుందా అంటే ఏడారిలో ఎండమావినే చూసుకోవాలి. భావకవి దేవులపల్లి వారు అన్నట్లుగా నవ్వి పోదురుగాక నాకేమి సిగ్గు అన్నట్లుగా రాజకీయం మారుతోంది. ఇందులో ఎవరినీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అందరూ ఆ తానులో ముక్కలే.