Begin typing your search above and press return to search.

ఏపీ ఎన్నికలు.. వారసులు గెలిచేనా?

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   18 April 2024 4:57 AM GMT
ఏపీ ఎన్నికలు.. వారసులు గెలిచేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో మే 13న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఆయా పార్టీల తరఫున నేతలకు బదులుగా వారి వారసులు పోటీ చేస్తున్నారు. కొన్ని స్థానాల్లో తమ భర్తలకు బదులుగా భార్యలు రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిలో గెలిచేవారు ఎంతమందనే దానిపై చర్చ జరుగుతోంది.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన అస్మిత్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ మరోసారి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్‌ ఓడిపోయారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా శ్రమిస్తున్నారు. పూర్తిగా మంగళగిరికే పరిమితమయ్యారు. ఆయనపైన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు, మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కోడలు అయిన మురుగుడు లావణ్య వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు వారసుల్లో గెలుపెవరిదో చూడాల్సిందే.

తెనాలిలో ఇద్దరు వారసులు బరిలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్‌ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి అన్నాబత్తుని సత్యనారాయణ కుమారుడు అన్నాబత్తుని శివకుమార్‌ వైసీపీ తరఫున రంగంలో ఉన్నారు. గత ఎన్నికల్లో అన్నాబత్తుని శివకుమార్‌ వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి ఆ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ తరఫున బరిలో ఉన్న నాదెండ్ల మనోహర్‌ విజయం తనదేననే ధీమాలో ఉన్నారు.

గుంటూరు తూర్పులో ప్రస్తుతం వైసీసీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా ఈసారి పోటీ చేయకుండా తన కుమార్తె ఫాతిమాకు సీటు ఇప్పించుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ముస్తఫా గెలిచారు. మూడోసారి తన కుమార్తె రూపంలో విజయం సాధించాలని చూస్తున్నారు. మరోవైపు ఇక్కడ టీడీపీ కూడా ముస్లిం అభ్యర్థికే సీటు ఇచ్చింది. దీంతో హోరాహోరీ పోరు జరుగుతోంది.

కడప జిల్లా కమలాపురంలో మాజీ ఎమ్మెల్యే పుత్తా నరసింహారెడ్డి కుమారుడు పుత్తా ప్రతాప్‌ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా హోరాహోరీ పోరు జరుగుతుందని చెబుతున్నారు.

కృష్ణా జిల్లా పెడనలో మాజీ మంత్రి కాగిత వెంకట్రావు కుమారుడు కాగిత కృష్ణప్రసాద్‌ టీడీపీ తరఫున, వైసీపీ దివంగత సీనియర్‌ నేత ఉప్పాల రామ్‌ ప్రసాద్‌ కుమారుడు ఉప్పాల రాము వైసీపీ తరఫున విజయమే లక్ష్యంగా పోటీ పడుతున్నారు.

బందరుగా పేరున్న మచిలీపట్నంలో ప్రస్తుత ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు వైసీపీ తరఫున బరిలో ఉండగా, టీడీపీ తరఫున మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు అల్లుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా బిగ్‌ ఫైట్‌ తప్పదని అంటున్నారు. పామర్రులో టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్‌ రాజా బరిలో ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ పై గెలవాలని తపిస్తున్నారు.

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య టీడీపీ తరఫున బరిలో ఉన్నారు.

ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ పోటీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ టీడీపీ తరఫున టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు పుట్టా మహేశ్‌ బరిలో ఉన్నారు. మరోవైపు సుధాకర్‌ యాదవ్‌ మైదుకూరు నుంచి పోటీ చేస్తున్నారు.

కర్నూలులో మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ కుమారుడు టీజీ భరత్‌ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ తరఫున మాజీ ఐఏఎస్‌ అధికారి ఇంతియాజ్‌ బరిలో ఉన్నారు. పత్తికొండలో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబు టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి కుమారుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. తన అన్న మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతితో రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన ఉప ఎన్నికలో గెలుపొందారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర శివాజీ కుమార్తె శిరీష టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజు చేతిలో ఓడిపోయారు. విజయనగరంలో మాజీ కేంద్ర మంతి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి టీడీపీ తరఫున బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి చేతిలో ఓడిపోయారు.

శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల సుధీర్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. చంద్రగిరిలో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్‌ రెడ్డి, తిరుపతిలో ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి కుమారుడు భూమన అభినయ్‌ రెడ్డి బరిలో ఉన్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీప్రియ టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాంకుమార్‌ రెడ్డి వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. సూళ్లూరుపేటలో మాజీ మంత్రి నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె విజయశ్రీ టీడీపీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి కోడలు పల్లె సింధూరరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నారు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్‌ రెడ్డి కుమారుడు శిల్పా రవి వైసీపీ తరఫున బరిలో ఉన్నారు. ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిలప్రియ పోటీ చేస్తున్నారు.

ఇలా వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున ఎంతో మంది వారసులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిలో గెలిచేది ఎందరో, ఓడేది ఎందరో వేచిచూడాల్సిందే.