Begin typing your search above and press return to search.

రామోజీకి మరో అరుదైన గౌరవం... ప్రెస్ అకాడమీ పేరు మార్పు?

అవును... రామోజీరావుకు అత్యున్నత గౌరవం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 9:43 AM GMT
రామోజీకి మరో అరుదైన గౌరవం... ప్రెస్  అకాడమీ పేరు మార్పు?
X

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్కరణ సభకు ఏపీ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం ఈ నెల 27న విజయవాడ శివార్లలోని అనుమోలు గార్డెన్స్ లో సంస్మరణ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి సమీక్షించారు.

ఇందులో భాగంగా... రామోజీరావు జీవిత విశేషాలు, పత్రికా రంగానికి ఆయన చేసిన సేవలపై ఫోటో ఎగ్జిబిషన్, షార్ట్ ఫిలిం ప్రదర్శన నిర్వహించనున్నారని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సహా పలువురు పాత్రికేయులు హారవుతారు.

ఇదే క్రమంలో... ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రామోజీరావు కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఈ ఏర్పాట్లకు రూ.5 కోట్లు విడుదల చేసింది. రామోజీ జ్ఞాపకాలు తెలుగువారితో చిరస్థాయిగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమయంలో మరో విషయం తెరపైకి వచ్చింది!

అవును... రామోజీరావుకు అత్యున్నత గౌరవం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సమయంలో... ఏపీ ప్రెస్ అకాడమీ పేరును "రామోజీ ప్రెస్ అకాడమీ"గా మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెల్లుస్తుంది. ఈ మేరకు ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో ఏపీ రాజధానికి అమరావతి అనే పేరును ఆయనే సూచించిన నేపథ్యంలో... రాజధాని ప్రాంతంలోనూ రామోజీ విగ్రహానికి స్థలాన్ని కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై చంద్రబాబు ఇప్పటికే ప్రకటన చేశారు! ఇందులో భాగంగా... అమరావతిలో రామోజీ స్మారకం నిర్మిస్తామని అన్నారు.

అయితే... ఈ రెండు విషయాలనూ అధికారికంగా ఈ నెల 27న జరగనున్న రామోజీ సంస్మరణ సభలో ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో... ఇది రామోజీకి దక్కే మరో అరుదైన గౌరవం అని అంటున్నారు పరిశీలకులు!