Begin typing your search above and press return to search.

ఏపీ అంతా రెడ్ జోన్...ఎందుకీ సంచలనం ?

ఈ ఎన్నికల్లో కనిపించినంత హోరాహోరీ పోరు మరే ఎన్నికల్లో లేదు అని చెప్పాల్సి ఉంటుంది

By:  Tupaki Desk   |   3 Jun 2024 2:53 PM GMT
ఏపీ అంతా రెడ్ జోన్...ఎందుకీ సంచలనం ?
X

ఏపీలో ఎన్నో ఎన్నికలు జరిగాయి. కానీ ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కనిపించినంత హోరాహోరీ పోరు మరే ఎన్నికల్లో లేదు అని చెప్పాల్సి ఉంటుంది. దాంతో పాటు పోలింగ్ రోజున తరువాత కూడా పల్నాడు జిల్లాతో పాటు తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి, జమ్మలమడుగు లో భారీ ఎత్తున అల్లర్లు జరిగాయి.

ఈ నేపధ్యంలో కౌంటింగ్ వేళ కూడా భారీ ఘర్షణలు చోటు చేసుకుంటాయన్న కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 20 వరకూ ఏపీ అంతా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. మరో వైపు చూస్తే కౌంటింగ్ వేళ అయితే కనీ వినీ ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్క ప్రాంతం ఒక్క పట్టణం అని కాదు ఏపీ మొత్తం రెడ్ జోన్ పరిధిలోకి వెళ్ళిపోయింది.

దాంతో ఏపీలో ఏమి జరుగుతోంది, ఎందుకు ఈ సంచలనం అన్న చర్చకు తెర లేచింది. ఇదిలా ఉంటే ఏపీలో చూస్తే ఇపుడు అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం అయితే అంతటా ఉంది. ఎటు చూసినా పోలీసులు మోహరింపు కంపిస్తోంది.

కౌంటింగ్ వేళ సాధారణంగా వ్యాపార సంస్థలు కూడా వాటి పని అవి చేసుకుంటాయి. కానీ ఈసారి బిజినెస్ ని సైతం బంద్ చేయమని పోలీసులు కోరుతున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు. అదే విధంగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోకి కొత్త వ్యక్తిని ఎవరినీ అడుగు పెట్ట నీయడంలేదు.

ఎవరైనా అలా లాడ్జీలలో దిగితే వారి ఆచూకీ చెప్పమని పోలీసులు కోరుతున్నారు. పొరపాటున కొత్త వ్యక్తి ఎవరైనా నియోజకవర్గంలో ఎంటర్ అయితే వెంటనే అరెస్ట్ చేసేలా యాక్షన్ ప్లాన్ ఉంటోంది. పోలీసులు అమలు చేస్తున్న ఈ కట్టుదిట్టమైన చర్యల వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళకుండా వాయిదా వేసుకోవడం మేలు అని అంటున్నారు.

ఈసారి కౌంటింగ్ తరువాత భారీ ఎత్తున ఘర్షణలు రాయలసీమ పల్నాడు ప్రాంతాలలో జరుగుతాయని అనుమానిస్తున్నారు. దాంతో అక్కడ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఏ చిన్న విషయాన్ని అసలు వదిలిపెట్టడం లేదు. అక్కడ దుకాణాలు తెరవద్దని ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. పరిస్థితీ ఎంతలా తయారైంది అంటే పాలు ఇతర అత్యవసరాలకే దుకాణాలు తెరచి వెంటనే మూసేయాలని కూడా ఆదేశాలు వెళ్ళాయి.

దీంతో బిజినెస్ డేస్ లో రష్ గా ఉంటూ కళకళలాడాల్సిన మార్కెట్లు మంగళవారం పూర్తిగా బంద్ అయ్యే సీన్ కనిపిస్తోంది. అదే విధంగా పెట్రోల్ బంకుల వద్ద గట్టి నిఘాను పెట్టారు. ఎవరికీ బాటిల్స్ ద్వారా పెట్రోల్ పట్టుకోనీయవద్దని ఆదేశిస్తునారు. అలా చేస్తే ముందు బంక్ యజమానికే శిక్ష విధించేలా రంగం సిద్ధం చేశారు.

రాయలసీమతో పాటు కొన్ని సున్నితమైన ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలలో గట్టి నిఘా ఉంది. అలాగే ఏపీ అంతటా 144 సెక్షన్ తో పాటు సెక్షన్ 30 అమలు చేస్తున్నారు. ప్రతీ చిన్న సెంటర్ లో కూడా పోలీసు బందోబస్తు ఒక లెవెల్ లో ఉంటోంది. దాంతో ఏపీ పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్ళిపోయింది.

అంతే కాదు విజయోత్సవాలు రద్దు చేశారు. ఎవరికి వారు ఇంట్లోనే సంబరాలు అయినా సంతోషాలు అయినా చేసుకోవాలి తప్ప రోడ్ల మీదకు రాకూడదు. ఈ ఆంక్షలు అన్నీ కూడా మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీలో ఎన్నడూ లేని విధంగా భద్రత ఉండడంతో ఏమిటీ సంచలనం అని ప్రతీ ఒక్కరూ చర్చించుకునే పరిస్థితి ఉంది.