Begin typing your search above and press return to search.

హోదా రాకపోవడానికే ఆయనే కారణం...మాజీ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు!

అవును... ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంలో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:50 AM GMT
హోదా రాకపోవడానికే ఆయనే కారణం...మాజీ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు!
X

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా అంశం ఊహించని విధంగా తెరపైకి వచ్చింది. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తాజాగా ప్రత్యేక హోదా విషయంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి ఒక ఐఏఎస్ కారణం అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంలో రిటైర్డ్ ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను ప్రస్థావించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఒక ఐఏఎస్‌ అధికారే కారణమని.. ఆయన ఏపీలో ఇప్పటికీ పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

2014 ఫిబ్రవరి 20న హోదాపై నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారని.. మార్చి 1 న కేబినెట్ ఆమోదించిందని పీవీ రమేష్ తెలిపారు. అదే రోజున ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం నోటిఫికేషన్‌ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. మార్చి 5న రాష్ట్ర అపాయింటెడ్‌ డేట్‌ గా.. జూన్‌ 2న ప్రకటించారని తెలిపారు.

ఇదే క్రమంలో సరిగ్గా అదేరోజు ప్రత్యేక హోదాకు నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ కేంద్ర కేబినెట్‌ ప్రణాళికా సంఘాన్ని కోరిందని చెప్పిన ఆయన... దానిపై ప్లానింగ్‌ కమిషన్‌ తో తాను ఐదు సమావేశాలు పెట్టించినట్లు వివరించారు. అది ఎన్నికల సమయం కావడంతో తానే చొరవ తీసుకొని హోదా అంశాన్ని పూర్తి చేయాలని కోరినట్లు చెప్పుకొచ్చారు.

అయితే ఆ సమావేశాలకు ఆర్థిక శాఖకు సంబంధించిన కీలక అధికారి హాజరు కాలేదని రమేష్ తెలిపారు. ఆ అధికారి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నారని ఆయన వెల్లడించారు. ఆయన ఆ ఒక్క సమావేశానికి వచ్చి ఉంటే హోదా వచ్చేసి ఉండేది అంటూ పీవీ రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి!

అవును... నాడు ఆ సమావేశానికి ఆర్థిక శాఖ అధికారి రాకపోవడంతోనే హోదా రాలేదని పీవీ రమేష్ వివరించారు. ఆ అధికారి తెలంగాణ క్యాడర్ కోరుకున్నారని.. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడంతో అక్కడికి వెళ్లారని పీవీ రమేష్ చెప్పుకొచ్చారు. దీంతో పీవీ రమేష్ ప్రస్తావించిన ఆ ఐఏఎస్ ఎవరనేది చర్చ మొదలైంది!

మరోపక్క ఒక ఐఏఎస్ అధికారి సమావేశానికి హాజరు కాకపోవటం వలనే హోదా రాలేదంటూ పీవీ రమేష్ చెబుతున్న అంశాల పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తిగా రాజకీయ నిర్ణయమైన హోదా విషయంలో కేంద్రం ఇవ్వాలని భావిస్తే ఇవన్నీ కారణాలే కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.