Begin typing your search above and press return to search.

ఏపీ విద్యార్థిని.. తెలంగాణ ధ్రువపత్రం.. కోర్టు ఆగ్రహం

జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ కు చెందిన సింగోటం వెన్నెల ఒకటి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో, ఇంటర్మీడియట్ క్రిష్ణా జిల్లాలో చదివారు.

By:  Tupaki Desk   |   11 Nov 2023 8:53 AM GMT
ఏపీ విద్యార్థిని.. తెలంగాణ ధ్రువపత్రం.. కోర్టు ఆగ్రహం
X

స్థానికత ఆధారంగానే విద్య, ఉద్యోగాల భర్తీని ప్రభుత్వాలు చేపడుతున్నాయి. సొంత రాష్ట్రంలో ఉన్నవాళ్లకే విద్యాసంస్థల్లో సీట్ల పరంగా, ఉద్యోగాల్లో భర్తీ పరంగా రిజర్వేషన్లు కేటాయిస్తున్నాయి. తెలంగాణ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. ఇక్కడ జోన్ల వారీగా జిల్లాలను విభజించి మరీ ఎక్కడ స్థానికులకు అక్కడే అవకాశాలిస్తున్నారు. అందుకు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానిక ప్రాంతంగా గుర్తిస్తున్నారు. అయితే తాజాగా ఏపీలో చదివిన విద్యార్థినికి 18 ఏళ్లుగా తెలంగాణలో నివాసం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం జారీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ కు చెందిన సింగోటం వెన్నెల ఒకటి నుంచి 10వ తరగతి వరకు కర్నూలులో, ఇంటర్మీడియట్ క్రిష్ణా జిల్లాలో చదివారు. కానీ 18 ఏళ్లుగా ఆమె తెలంగాణలో నివాసం ఉన్నట్లు ఆలంపూర్ తహసీల్దారు ధ్రువపత్రం జారీ చేశారు.

ఇప్పుడు మెడికల్ ఆడ్మిషన్లపై హైకోర్టు నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. నివాస ధ్రువీకరణ పత్రం సమర్పించినా తనకు అడ్మిషన్ నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఆమె కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టినా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీలో చదివిన విద్యార్థినికి 18 ఏళ్లుగా తెలంగాణలో నివాసం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఎలా జారీ చేశారని ఆలంపూర్ తహసీల్దారును హైకోర్టు ప్రశ్నించింది. ఏపీలో చదివినట్లు విద్యార్థినే స్వయంగా చెబుతుంటే ఆలంపూర్ లో నివాసం ఉన్నట్లు ధ్రువీకరించడంపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

అయితే విద్యార్థిని నివాసాన్ని తనిఖీ చేసి రెవెన్యూ ఇన్ స్పెక్టర్ (ఆర్ఐ) ధ్రువీకరించడంతోనే సంతకం చేసినట్లు తహసీల్దారు తరపు న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. పొరపాటు జరిగిందని చెప్పకుండా ఆర్ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ధ్రువపత్రం జారీ చేశామని చెప్పడమేంటని ప్రశ్నించింది. ఆర్ఐ, తహసీల్దారుతో కలిసి డిసెంబర్ 4న హాజరు కావాలని ఆదేశించింది.