యూత్ అంటున్న టీడీపీ...వారికే టికెట్ల గండం...?
అదే విధంగా ఈ యూత్ అంతా లోకేష్ కి విధేయులుగా ఉంటారు. వారే లోకేష్ టీం గా ఉంటారు.
By: Tupaki Desk | 9 Aug 2023 4:33 AM GMTతెలుగుదేశం పార్టీ వయసు నలభై రెండేళ్ళు. ఆ పార్టీ లో మొదట నుంచి చేరిన వారి వయసు ఎంతో లెక్కలతో సంబంధం లేకుండా ఇట్టే ఊహించవచ్చు. అందరూ సగటున అరున్నర పదుల వయసు పై దాటిన వారే. 2024 ఎన్నికల్లో వీరికే టికెట్ల గండం ఉంది అని అంటున్నారు. ఈసారి తెలుగుదేశం పార్టీ యూత్ అంటోంది.
మొత్తం 175 సీట్లలో పొత్తులు ఉంటే పోయిన సీట్లను పక్కన పెడితే మిగిలిన వాటిలో నలభై శాతం సీట్లు యువతకు అని చెబుతోంది. ఆ లెక్కన కచ్చితంగా ఒక అరవై డెబ్బై సీట్లు యువతకే వస్తాయని అంటున్నారు. మరి సీనియర్లు ఉన్న చోట్ల సీన్ ఏంటి అంటే వారు సర్దుకుపోవాల్సిందే అని అంటున్నారు. టీడీపీకి ఈ ఎన్నికలు ఒక విధంగా డూ ఆర్ డై అన్న లెక్క.
ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మరో నలభై ఏళ్లు బతికేస్తుంది. ఒక వేళ ఓడితే ఏమవుతుంది అన్నది తెలియదు కానీ అలా జరిగినా పార్టీని నిలబెట్టుకోవాలీ అంటే యూత్ కే టికెట్లు ఇవ్వాలన్నది టీడీపీలో జరుగుతున్న అంతర్మధనం. ఆ మేరకే టికెట్ల పంపిణీ ఉంటుందని డిసైడ్ చేస్తున్నారు.
నిజానికి లోకేష్ ని జనంలోకి పంపినదీ అందుకే. చంద్రబాబు తరువాత లోకేష్ నాయకత్వం అన్నది అటు జనానికీ ఇటు సీనియర్లకు చెప్పడానికే. చంద్రబాబు సారధ్యం 2024 ఎన్నికల దాకా ఉంటుంది. 2029 ఎన్నికలలో పార్టీని నడిపించేది లోకేష్ బాబే అని అంటున్నారు. అప్పటికి ఆయనకు పార్టీలో అందుకొచ్చిన నాయకులు కావాలంటే ఇప్పటి నుంచే తయారు కావాలి. అందుకే చంద్రబాబు ముందుగానే అంతా సర్దుబాటు చేస్తున్నారు అని అంటున్నారు.
ఆ విధంగా కీలక నియోజకవర్గాలతో పాటు ప్రతీ జిల్లాలో యువతకు పెద్ద ఎత్తున సీట్లు ఇస్తరని అంటున్నారు. అదే విధంగా ఈ యూత్ అంతా లోకేష్ కి విధేయులుగా ఉంటారు. వారే లోకేష్ టీం గా ఉంటారు. ఆరు నూరు అయినా లోకేష్ నాయకత్వాన్ని వారు బలపరుస్తూ సాగుతారు. వీరిలో సీనియర్ల వారసులు కూడా ఉండవచ్చు.
ఈ విధంగా మాస్టర్ ప్లాన్ తోనే టీడీపీ యువ మంత్రం జపిస్తోంది అని అంటున్నారు. అయితే పార్టీని నాలుగున్నర దశాబ్దాలుగా నమ్ముకుని పార్టీలో అనేక ఎన్నికలను చూసిన సీనియర్లు తాము తప్పుకుని యూత్ కి చాన్స్ ఇవ్వమంటే అంగీకరిస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. వారసులను వారు ముందు పెడుతున్నా వారికి టాలెంట్ లేకపోతే టికెట్ దక్కదు.
పార్టీ గెలుపు చాలా ముఖ్యం. అందువల్ల ఆలోచిస్తే పార్టీ ఇన్నాళ్ళూ తమకు ఎంతో ఇచ్చింది కాబట్టి పార్టీకి సీనియర్లు ఇపుడు చేదోడు వాదోడుగా ఉండి తాము త్యాగాలు చేయాల్సిన సమయం అని అంటున్నారు. సో జూనియర్లకు సీనియర్లు తోవ ఇస్తూ వాలంటరీ రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉండాలి. మరి టీడీపీలో ఈసారి ఎంతమంది ప్రముఖ నాయకులు తెర మరుగు అవుతారు అన్నది 2024 ఎన్నికల ముందర తెలుస్తుంది అని అంటున్నారు.