టీడీపీ డీలా...ముందు పోయేది ఎలా...?
అలాంటి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లారు. పార్టీకి దూరంగా కూడా ఆయన జరిగి వెళ్లడం అదే మొదటిసారి
By: Tupaki Desk | 12 Sep 2023 2:01 AM GMTతెలుగుదేశం పార్టీ ఎంటీయార్ పెట్టినది. అందులో కీలక నేతగా ఎదిగారు చంద్రబాబు నంబర్ టూ గా పేరు తెచ్చుకున్నారు. ఎన్టీయార్ 1985 నుంచి 1989 మధ్య సీఎం గా ఉన్నా చంద్రబాబుదే రాజ్యం అనుకునేంతలా ఆయన హవా నడచింది. అయితే ఎన్టీయార్ ఓడిపోయిన తరువాత బాబు పార్టీలో మరింత పట్టు సాధించారు. 1989 నుంచి 1994 మధ్య కాలంలో ఎన్టీయార్ అసెంబ్లీకి రాకుండా సినిమాలు చేసుకుంటే పార్టీని నడిపించారు బాబు. అలాగే అసెంబ్లీలో ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినా అసలైన అపొజిషన్ లీడర్ గా తన సత్తా చాటారు.
ఇక 1995 ఎపిసోడ్ తెలిసిందే. ఎన్టీయార్ నుంచి అధికారం తీసుకుని అటు ముఖ్యమంత్రిగా ఇటు పార్టీ అధినేతగా చంద్రబాబు నాలుగున్నర పదుల వయసులో గొప్పగా నిభాయించారు. ఇపుడు ఏడున్నర పదుల వయసులో బాబు ఉన్నారు. అయినా దాదాపుగా ముప్పయ్యేళ్ల పాటు టీడీపీని బాబు అదే బాధ్యతతో మోస్తున్నారు.
అలాంటి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లారు. పార్టీకి దూరంగా కూడా ఆయన జరిగి వెళ్లడం అదే మొదటిసారి. దాంతో టీడీపీ బాబు ఎడబాటుని అసలు తట్టుకోలేకపోతోంది. తెల్లారి లేస్తే టెలి కాన్ఫరెన్స్ లు , వర్చువల్ మీటింగ్స్ డైరెక్ట్ మీటింగ్స్ ఇలా బాబు పరుగులు పెట్టించే వారు పార్టీని.
ఏ చిన్న ఇష్యూ అయినా దాన్ని ఎలా పెద్దది చేసి భం భాట్ చేయాలో బాబుకు మాత్రమే తెలిసిన విద్య. అటువంటి బాబు జైలు గోడల మధ్య ఉండిపోయారు. బాబు లేకుండా టీడీపీ నాయకులు ఇచ్చిన తొలి పిలుపు బంద్. అది. అయితే అది సక్సెస్ ఎంతవరకూ అయింది అని చూస్తే పాక్షికం అని చెప్పాలి. దానికి కారణం ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహిరించి ఎక్కడికక్కడ టీడీపీ లీడర్లను హౌస్ అరెస్ట్ చేయడం. మరో వైపు తీసుకుంటే టీడీపీ నుంచి సరైన డైరెక్షన్స్ లేవు.
బాబు లేని టీడీపీలో అందరూ లీడర్లే అన్నట్లుగా ఉంది. పైగా వ్యూహాలు లేవు. అచ్చెన్నాయుడు ఆడియో లీక్ లో అదే విషయం స్పష్టం అయింది నేతలు రోడ్ల మీదకు రావాలని ఆయన కోరుతున్నారు. మరో వైపు మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ మోస్ట్ నేత యనమల రామక్రిష్ణుడు ఇతర నేతలు సమావేశం అయి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అన్నది చర్చించారు.
ఇక రాజమండ్రిలో లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి టీడీపీని అంతా తాను అయి ఇంకా చురుకుగా నడిపిస్తామని చెప్పారు. విశాఖలో అయితే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు గవర్నర్ ని కలసి బయటకు వచ్చి ఏపీ టీడీపీ ఎవరికీ భయపడేది లేదని తాము పోరాడుతామని ప్రకటించారు. ఇలా చూసుకుంటే కనుక టీడీపీలో లీడర్స్ ఉన్నారు.సీనియర్ నేతలు ఉన్నారు. బలమైన క్యాడర్ ఉంది.
కానీ దిశా నిర్దేశం చేసే వారే కరవు అయ్యారు. లోకేష్ అయితే తన తండ్రి ఉన్న సెంట్రల్ జైలు వద్ద రాజమండ్రిలోనే ఉండిపోయారు. లోకేష్ ఈ టైం లో పార్టీని హ్యాండిల్ చేసి క్యాడర్ ని ముందుకు నడిపించే విధంగా వ్యూహ రచన చేయాలి. అయితే టీడీపీలో సీనియర్లు తామే అంతా అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు తొందరగా బెయిల్ వస్తే టీడీపీకి అది ఎంతో ప్లస్ అవుతుంది అని అంటున్నారు.
అలా కాకుండా బెయిల్ రాకుండా బాబు ఎక్కువ రోజులు జైలులో ఉన్నా సింపతీ ఏ మేరకు వస్తుందో తెలియదు కానీ పార్టీ మాత్రం ఇబ్బందులలో పడిపోతుంది అని అంటున్నారు. చంద్రబాబు లీడర్ షిప్ ని అందుకోవడం కష్టమే అంటున్నారు. కానీ అందులో సగమో పావు వంతో దక్షత ఈ కీలక టైం లో చూపించకపోతే మాత్రం ఈ గందరగోళం అయోమయం కచ్చితంగా అధికార వైసీపీ క్యాష్ చేసుకుని దూసుకుని పోతుంది అంటున్నారు.