Begin typing your search above and press return to search.

టమాటా ధరలు పెరగడం వర్సెస్ బాబు అధికారం !

ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో ఒక్కసారిగా అన్ని రకాలైన కూరగాయల ధరలు పెరిగాయి. ప్రత్యేకించి టమాటా ధరలు భారీ షాక్ నే ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 Jun 2024 8:36 AM GMT
టమాటా ధరలు పెరగడం వర్సెస్ బాబు అధికారం !
X

ఏపీలో చూస్తే ఒక్కసారిగా కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. ఏమి తినేటట్టు లేదు కొనేట్టు లేదు అన్న పరిస్థితి ఉంది. ఏపీలో చూస్తే గత కొన్ని రోజులుగా కూరగాయల ధరలు నింగిని అంటేసాయి. సంచి నిండా డబ్బులు తీసుకెళ్ళి జేబుకు సరిపడా కూరలు తెచ్చుకోవడం జరుగుతోంది అంటే అర్ధం చేసుకోవాల్సిందే.

మరి ఒక్కసారిగా పెరిగిన ఈ కూరగాయల ధరలు ఏమిటి ఈ మాయాజాలం ఏమిటి అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. వాస్తవానికి మార్కెట్ లో ఏ ధర పెరిగినా ముఖ్యమంత్రి మీద అధికారంలో ఉన్న పార్టీ మీద పడి ఏడవడం అలవాటుగా మారింది. మార్కెట్ లో ఏమి జరుగుతోంది అన్నది తెలుసుకోకుండా పైసా ఖర్చు లేని నాలుక కాబట్టి ఏమన్నా సరిపోతుంది అనే బాపతే ఎక్కువగా ఉన్నారు.

అయితే సడెన్ గా నిత్యావసరాలు కానీ కూరగాయల ధరలు కానీ పెరిగితే ఇబ్బంది పడేది పేదలు,మధ్యతరగతి వర్గాల వారే అని చెప్పక తప్పదు. ఈ ధరలు నేరుగా వెళ్ళి ప్రజలకు ధరాఘాతం గా మారుతాయి. దాంతో వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దాంతో వారు తమను ఏలే పాలకుల మీదే ఆగ్రహం పెంచుకుంటారు.

అంతే కాదు తమను ఇలా ధరలతో గాయాలు చేయిస్తూ చోద్యం చూస్తున్నారు అని కూడా మండిపోతారు. ఆ ఆగ్రహం ఎన్నికల్లో చూపిస్తారు. దానికి నిలువెత్తు ఉదాహరణ చూస్తే 2019 నుంచి 2024 మధ్య కాలంలో పెరిగిన ధరల వల్లనే కేంద్రంలో మోడీ పార్టీ అయిన బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు అని కూడా విశ్లేషిస్తారు.

ఇవన్నీ పక్కన పెడితే ఏపీలో ఒక్కసారిగా అన్ని రకాలైన కూరగాయల ధరలు పెరిగాయి. ప్రత్యేకించి టమాటా ధరలు భారీ షాక్ నే ఇస్తున్నారు. ఏకంగా పది రోజులనుంచి చూస్తే టమాటా ధర అంతకంతకు పెరిగిపోయింది.

మొన్నటి వరకు కిలో యాభై రూపాయల దాకా ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా ఎనభై రూపాయలు పై దాటిపోయింది

కాస్తా వివరంగా చెప్పాలీ అంటే ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం కిలో టమాటా ధర అత్యధికంగా ఎనభై రూపాయలు పలకడంతో కొనే వారు షాక్ తిన్నారు. సోమవారం బక్రీద్ పండుగ ఉంది. అయితే మార్కెట్ కి రైతులు తక్కువ పంటను తీసుకుని వచ్చిందంటున్నారు.

దాంతో ఒక్కసారిగా డిమాండ్ అండ్ సప్లై సూత్రం మేరకు రేటు పెరిగిపోయింది. ఇది అంతకు ముందు వారం రోజులుగా చూస్తే కిలో అరవై నాలుగు రూపాయలుగా ఉంది. కానీ సోమవారం మాత్రం దానికి మరో ఇరవై రూపాయలు జత కలిసింది.

ఇక అదే బీ గ్రేడ్ టమాటా అయితే కిలో యాభై నుంచి డెబ్బై రూపాయల దాకా పలికింది అని అంటున్నారు. ఇలా ధరలు పెరగడానికి మరో కారణం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం అని అంటున్నారు. దీని వల్లనే ఒక్కసారిగా పంట దిగుబడి తగ్గింది. దాంతో సరఫరాకు గిరాకీకీ మధ్య అంతరం బాగా పెరిగింది అని అంటున్నారు

అంతే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల పరిధిలో కూడా టమటా సరకు ఒక్క సారిగా తగ్గింది అని అంటున్నారు. ఇలానేక కారణాలు కలసి ఇపుడు ఏపీలో టమాటాకు ప్రసిద్ధి అయిన మదనపల్లె మార్కెట్‌లో ధర పెరుగుతోందని అధికారులు వివరిస్తున్నారు.

అయితే మదనపల్లె మార్కెట్‌కు ప్రతీ రోజూ 600 టన్నుల నుంచి 750 టన్నుల మేరకు టమాటా పంటను రైతులు తీసుకొస్తున్నారని లెక్కలు ఉన్నాయి.అయితే సోమవారం మదనపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లోని గ్రామాల నుంచి మార్కెట్‌కు కేవలం 396 టన్నులు టమాటాలు మాత్రమే తీసుకొచ్చారని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నరు.

దీని వల్లనే టమాటా ధర చూస్తే వాచిపోయేలా ఉందని అంటున్నారు. అలా రికార్డు స్థాయిలో టమాటా కిలో ధర రూ.80కి చేరింది అని అంటున్నారు. ఇక ఈ నేపధ్యంలో చూస్తే రైతుల నుంచి వ్యాపారులు సగటున 25 కిలోల బుట్ట ధర రూ.1600 నుంచి రూ.1900కు కొనుగోలు చేశారని చెబుతున్నరు. అలా వారు అంతా ఈ టమాటా పంటను బయటి మార్కెట్లకు ఎగుమతి చేశారు. ఇలా అనేక కారణాలతో టమాటా ధరలు బాగా పెరిగాయని చెబుతున్నారు.

ఇది కేవలం టమాటాకే పరిమితం కాలేదు. ఇతర కూరగాయలు అలాగే పెరిగిపోతున్నాయి. ఇక పప్పులు ఇతర నిత్యావసర ధరలు ప్రతీ నెలా పెరుగుతూనే ఉన్నాయి. తగ్గించాలన్న మధ్య తరగతి పేదల గోడు పాలకులు పట్టించుకోవాలని కోరుతున్నారు. అయితే డిమాండ్ అండ్ సప్లై సూత్రం మీద నడచే మార్కెట్ నియంత్రన అనేది పాలకుల చేతిలో ఎపుడూ లేదు అన్నది నిష్టురమైన సత్యం.

ఏపీలో చూస్తే గతంలో ధరలు భారీగా పెరిగిన వేళ జగన్ పాలన వల్లనే అని టీడీపీ ప్రచారం చేసింది. ఇపుడు దాన్నే పట్టుకుని వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఇది ధరల రాజకీయంగా మారుతోంది కానీ జనాలకు ఊరట దక్కడం లేదు అంటున్నారు.