Begin typing your search above and press return to search.

వృద్ధులు మహిళలూ ప్లస్ యువత...పోటెత్తిన ఓటు !

ఏపీలో ఈసారి పోలింగ్ లో కొత్త కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. వృద్ధులు సాధారణంగా ఓటింగుకు రారు

By:  Tupaki Desk   |   13 May 2024 9:02 AM GMT
వృద్ధులు మహిళలూ ప్లస్ యువత...పోటెత్తిన ఓటు !
X

ఏపీలో ఈసారి పోలింగ్ లో కొత్త కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. వృద్ధులు సాధారణంగా ఓటింగుకు రారు. అరాకొరా వచ్చిన వారినే ఎపుడూ పోలింగ్ కేంద్రాల వద్ద ఫొటోలు తీసి హైలెట్ చేస్తూ ఉంటారు. కానీ చిత్రంగా మండే మే ఎండలను సైతం లెక్క చేయకుండా వృద్ధులు ఈసారి పోలింగ్ కేంద్రాల వద్దకు క్యూ కట్టారు.

దాంతో పాటు మహిళలు కూడా ఈసారి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇది కూడా ఒక రికార్డు గానే చూస్తున్నారు. 2019లో మహిళలే రాత్రి పది గంటల వరకూ క్యూ లైన్లలో ఉంటూ ఓటేశారు. ఈసారి అంతకు మించి రెట్టింపు ఉత్సాహంతో మహిళలు పోలింగ్ బూతుల ముందు ఉదయాన్నే తరలి రావడం మరో విశేషంగా చూస్తున్నారు.

ఇక యువత పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద మోహరించడం. సాధారణంగా యువతరం పోలింగ్ కి కడు దూరంగా ఉంటుంది. సెలవు వస్తే దానిని వేరే వ్యాపకాలకు వెచ్చించే యువత ఈసారి మాత్రం పట్టుబట్టి గంటల తరబడి క్యూ లైన్లలో కాపు కాసి ఓటేసి విజయగర్వంతో బయటకు వెళ్ళడం అంతా చూస్తున్నారు.

ఈ మూడు రకాల వర్గాలు వాటి కాంబినేషన్ ని ఏ విధంగా చూస్తారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. వచ్చిన ఓట్లు అన్నీ మాకే అని ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పుకుంటున్నాయి. సంక్షేమ పధకాలు తాము అమలు చేశాం కాబట్టి ఈ స్పందన అని వైసీపీ అంటూంటే ఇంత పెద్ద ఎత్తున జనాలు పోలింగ్ కేంద్రానికి సూర్యుడు ఉదయించకముందే క్యూ కట్టడం అంటే అది కచ్చితంగా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతకు కారణం అని టీడీపీ అంటోంది.

ఇంకో వైపు చూస్తే యువత ఓటెత్తడం చాలా కొత్త సమీకరణగా ఉంది. ఏపీ రాజకీయాల్లో యువతకు ఆకట్టుకునే అంశాలు ఏమి ఉన్నాయి అన్నది చర్చగా ఉంది. అయితే యువత ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతోందని వారిలో ఆవేదన ఆక్రోశానికి ఇది ఒక జవాబుగా చూడాలని అంటున్న వారు ఉన్నారు. ఏపీలో మంచి ప్రభుత్వాన్ని ఎంచుకోవడం తమ బాధ్యత అని భావించి ఈసారి యువత వచ్చింది అని కూడా అంటున్నారు.

వీటికి మించి ఈసారి కొత్తగా ఓట్లు వేసే వారు కూడా ఉన్నారు. 18 ఏళ్ళు నిండిన వారు అంతా ఈసారి ఓటెత్తారు. వారు ఎంతో ఉత్సాహంగా మే 13వ తేదీ కోసం ఎదురు చూశారు. ఈ బిగ్ డేని వారు ఉపయోగించుకుని తాము ఓటేసి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా కావాలని భావిస్తున్నారు.

దీంతో ఆ సెక్షన్ కూడా ఈసారి పోలింగ్ బూతులలో కనిపించడంతో కళకళలాడింది. ఇక నడి వయసు వారు, మధ్య తరగతి వర్గాలు ప్రత్యేకించి అర్బన్ ఓటర్లు ఈసారి రావడంతో ఎవరికి ఈ పోలింగ్ అనుకూలం ఎవరికి ప్రతికూలం అన్న చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. అయితే సాయంత్రం ఆరు దాటేవరకూ పోలింగ్ సాగుతుంది కాబట్టి పూర్తి పోలింగ్ శాతం వస్తే ఎంతో కొంత అంచనాకు చిక్కుతుందని అంతా అంటున్నారు.