Begin typing your search above and press return to search.

సాలిడ్ గా మహిళా ఓట్లు ... ఏపీ తీర్పు ఎలా ఉండబోతోంది...?

2023 ముసాయిదా ఓటర్ల జాబితాను తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ లెక్కలు చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   28 Oct 2023 1:30 AM
సాలిడ్ గా  మహిళా ఓట్లు  ... ఏపీ తీర్పు ఎలా ఉండబోతోంది...?
X

ఏపీలో మహిళా ఓటర్లు ఎక్కువ అని ముసాయిదా ఓటర్ల జాబితా ధృవీకరించింది. 2023 ముసాయిదా ఓటర్ల జాబితాను తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ లెక్కలు చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల రెండు లక్షల 21 వేల 450 మంది ఓటర్లు ఉన్నారు.

ఇక ఇందులో మహిళా ఓటర్లు రెండు కోట్ల మూడు లక్షల 85 వేల 851 మంది అయితే పురుష ఓటర్లు ఒక కోటీ 98 లక్షల 31 వేల 791 మందిగా పేర్కొన్నారు. అంటే దాదాపుగా అయిదారు లక్షల ఓట్లకు పైగా ఎక్కువగా మహిళా ఓటర్లు ఉన్నారన్న మాట. మహిళా ఓటర్ల విశేషం ఏంటి అంటే వారు ఠంచనుగా ఓటు వేస్తారు. పైగా తాము అనుకున్న వారికే వేస్తారు. వారు మభ్యపెడితే కూడా మనసు మార్చుకోరు.

ఒక స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇక మహిళలు తలచుకుంటే ఎక్కడైనా ప్రభుత్వం మారుతుంది అనడానికి అనేకమైన ఉదాహరణలు ఇప్పటిదాకా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అంతదాకా ఎందుకు 2019 ఎన్నికల్లో మహిళలే పెద్ద ఎత్తున క్యూ లైన్లలో నిలబడి అర్ధరాత్రి దాటినా ఓటేశారు. ఆ తరువాతనే 151 సీట్లతో వైసీపీ ప్రభుత్వం ఒక ప్రభంజనంగా వచ్చింది.

ఇపుడు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగున్నరేళ్ళుగా అనేక పధకాలను అమలు చేస్తోంది. అందులో కూడా అన్నీ మహిళల పేరు మీదనే చేస్తోంది. వారినే లబ్దిదారులుగా చేసి ముందు పెడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి కోటిన్నరకు పైగా ఓట్లు వచ్చాయి. అందులో కూడా మహిళా ఓట్లు ఎక్కువగా ఆ పార్టీకే వచ్చాయని లెక్కలు చెబుతున్నాయి.

అపుడు ఏపీలో మూడున్నర కోట్ల మంది ఓటర్లు ఉంటే ఈసారి అది కాస్తా నాలుగు కోట్లకు చేరుకుంది. మరి నాలుగు కోట్ల మంది 2024 ఎన్నికల్లో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏమిటి అనేది డిసైడ్ చేయనున్నారు అన్న మాట. ఇక ఈ మొత్తం ఓటర్లలో అత్యధిక శాతం మహిళా ఓటర్లు ఉండడం ఎవరికి ప్లస్ పాయింట్ అన్నది ఇపుడు చర్చగా ఉంది.

అదే విధంగా సాలిడ్ గా పడే మహిళా ఓట్లు కనుక ఏ పార్టీ అయితే సొంతం చేసుకుంటుందో వారిదే తిరుగులేని ప్రభుత్వంగా ఏర్పడుతుంది అని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే మహిళా ఓటు బ్యాంక్ మీదనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. రానున్న కొద్ది నెలలలో సైతం వారి పేరు మీదనే మరిన్ని కార్యక్రమాలను ప్రకటించడానికి సిద్ధమవుతోంది అని అంటున్నారు

ఇక తెలుగుదేశం సైతం మహిళా ఓటు బ్యాంక్ నే టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీ విడుదల చేసిన మినీ మ్యానిఫేస్టోలో సైతం మహిళా ఓట్ల మీదనే గురి పెట్టింది. ఏ విధంగా చూసుకున్నా మహిళలే రేపటి ప్రభుత్వాన్ని ఏపాటు చేసే దిశగా తీర్పు ఇస్తారని అంటున్నారు. దాంతో ఇపుడు మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నేపధ్యం రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చకు తావిస్తోంది.

ఈ ఓటర్ల జాబితాను చూసిన మీదట మరింతంగా మహిళల కోసం పథకాలు అధికార విపక్షాలు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఈ విషయంలో వైసీపీ టీడీపీ దాదాపుగా పోటీయే పడనున్నాయని అంటున్నారు. అయితే మహిళలు తమ తీర్పుని మార్చుకోరు, మార్పుని వారే రాస్తారు. కాబట్టి మహిళా ఓటర్ల మద్దతు ఎవరికి అన్నది కొద్ది నెలలు ఆగితే కానీ తెలియని అంశం అని అంటున్నారు.