ఎంతమంది ఉన్నారన్నది కాదు మేటర్.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్!
సినిమాలో ఒక డైలాగ్ బాగా ఫేమస్! అది అటు సినిమాలతోపాటు ఇటు రాజకీయాలకూ అప్లై చేస్తూ ఉంటారు.
By: Tupaki Desk | 9 Jan 2024 5:00 AM GMTసినిమాలో ఒక డైలాగ్ బాగా ఫేమస్! అది అటు సినిమాలతోపాటు ఇటు రాజకీయాలకూ అప్లై చేస్తూ ఉంటారు. అదే... "నాన్నా.. పందులే గుంపుగా వస్తాయి - సింహం సింగిల్ గా వస్తుంది" అని! ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఈ డైలాగ్ బలంగా వినిపిస్తుంది. కాస్త సమకాలీన రాజకీయాలపై అవగాహన ఉన్న వారెవరికైనా ఈ డైలాగ్ వెనుక ఉన్న ఆంతర్యం అత్యంత సులువుగా అర్ధమవుతుంది. ఒక్కన్ని కొట్టడానికి మంది మొత్తం ఏకమవుతున్నారంటే... ఆ ఒక్కడూ ఎంత బలవంతుడనేది ఆ మంది మొత్తం చెప్పకనే చెబుతుందని భావించొచ్చు!
అవును... అవతలివైపు అంతమంది గుంపు కడుతున్నారు అంటే.. ఇవతలివైపు ప్రత్యర్థి అంత బలంగా ఉన్నట్లు వాళ్ళు అంగీకరించినట్లే కదా! విలన్ గ్యాంగ్ ఎంత ఎక్కువమంది ఉంటే.. హీరో అంత బలవంతుడు అని చెబుతున్నట్లే కదా! ఈ నేపథ్యంలోనే... ఆంధ్రాలో కనిపిస్తున్న ఈ రాజకీయ చిత్రం ఒక సారి గతానికి తీసుకెళ్తుంది. గతంలో ఎప్పుడో చూసిన పరిస్థితులను స్ఫూరణకు తెస్తుంది. నాడు 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు టీడీపీ + టీఆరెస్స్ + సీపీఐ + సీపీఎం పార్టీలు కలిసి ఏర్పాటూ చేసిన మహాకూటమి ఇప్పుడు మరోసారి చర్చకు వస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 ఎన్నికలు అత్యంత కీలకమైనవిగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికల్లో మహాకూటమి అని అంటూ అప్పటికే ఏకమైన నాలుగు పార్టీలు ఒకవైపు.. చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు మరోవైపు. అప్పట్లో చిరంజీవి దాదాపుగా ముఖ్యమంత్రి అయినట్లే అనే ప్రచారం కూడా నడిచింది. చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్ కు కాపులు దూరం అవుతారనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే వీటన్నిటినీ అడ్డుకుని వైఎస్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ రెండోసారి విజయపతాకం ఎగరేసింది.
అలా ఉమ్మడి రాష్ట్రంలో రెండు బలమైన ప్రత్యర్థి పక్షాలను ఎదుర్కొని వైఎస్సార్ సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాదు.. నాడు రెండోసారి కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో 33 సీట్లు అందించింది. ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు! దాంతో 2004 కంటే మరెన్నో రెట్లు ఎక్కువగా వైఎస్సార్ లెవెల్ హస్తినలో పెరిగిపోయింది!
ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే... ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 294 స్థానాలకుగాను వైఎస్సార్ సారధ్యంలోని కాంగ్రెస్ - 157, టీడీపీ + టీఆరెస్స్ + సీపీఐ + సీపీఎం కలిసివచ్చిన మహాకూటమి - 106 స్థానాల్లో గెలవగా ప్రజారాజ్యం - 18, ఇతరులు 13 సీట్లు గెలుపొందారు. అంతిమంగా వైఎస్సార్ రెండోసారి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో... ఇటు సమర్ధుడైన నాయకుడు నిలబడితే అటు ఎంతమంది నిలబడినా ముందుగా అరుపులు కేకలు వినిపిస్తాయి.. ఒక్కసారి రాజు కత్తి దూస్తే ఆనక వినిపించేవి ఆర్తనాదాలే అనే కామెంట్లు వినిపించేవి!
హిస్టరీ రిపీట్స్!:
అది గతం... అయితే, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అటువంటి పరిస్థితే నెలకొంది. అవును... చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు. అంటే గతంలో జరిగిన సంఘటనలు.. సన్నివేశాలు మళ్ళీ జరుగుతూ ఉంటాయి అని! ఆ సిద్ధాంతం ప్రకారం 2009 లో జరిగినట్లుగానే రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ + జనసేన ప్రస్తుతం పొత్తులో ఉండగా బీజేపీని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితోపాటు బీజేపీలో ఉండే టీడీపీ శ్రేయోభిలాషులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు!
ఇందులో భాగంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి తమతో కలవాల్సిందిగా కోరుతున్నారు. బీజేపీని తమతో కలుపుకునేందుకు ఎన్నోరకాలుగా చంద్రబాబు & కో పరితపిస్తున్నారు.. ప్రయత్నిస్తున్నారు. ఇక కమ్యునిష్టులను సైతం తమతో తీసుకుపోయేందుకు కూడా వెనుకాడని పరిస్థితి! అంటే... కుదిరితే, టీడీపీ + జనసేన + బీజేపీ... లేదా, టీడీపీ + జనసేన + సీపీఐ + సీపీఎం (కుదిరితే కాంగ్రెస్ కూడా - 2018 తెలంగాణ ఎన్నికల టైపులో అన్నమాట!) కలిసి పోటీచేసే అవకాశం ఉందన్నమాట!
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు వద్దని.. తనకు ప్రజలతో మాత్రమే పొత్తు అని, వారే తమకు మద్దతుదారులు అని చెబుతూ తన అంతర్గత సర్వేలు, నివేదికలు, కార్యకర్తల సూచనలు, ప్రజానికం అభిప్రాయాలు, సామాజిక సమీకరణలు వేసుకుంటూ ఒక్కో నియోజకవర్గాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఈ సమయంలో జగన్ మార్పులకు ప్రజల నుంచి మద్దతు వస్తుందని కూడా అంటున్నారు.
మరోపక్క ఇటు చంద్రబాబు + జనసేన ఎవరికీ ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలని పరిస్థితి. జనసేనకు పరకో పాతికో సీట్లు ఇస్తే కాపుల మద్దతు టీడీపీకి ఎంతమేరకు ఉంటుంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్న పరిస్థితి. ఏది ఏమైనా... ఒకవైపు గుంపుగా వస్తుండగా మరోవైపు జగన్ మాత్రం సంక్షేమం, అభివృద్ధి, తన నిజాయితీ పాలన, మాట తప్పని నైజం, మేనిఫెస్టోని 100శాతం అమలు చేసిన విధానమే తనను గెలిపిస్తాయి అంటూ సింగిల్ గా వెళ్తున్నారు.
కాగా... ఉద్దేశ్యం మంచిది అయినప్పుడు, లక్ష్యం సరైంది అయినప్పుడు, ఆలోచన లోక కళ్యాణం కోసం అయినప్పుడు, ప్రజలతో పాటు ప్రకృతి కూడా అన్ కండిషనల్ గా సహకరిస్తుంది అనేది తెలిసిన విషయమే! చరిత్ర ఎన్నో సందర్భాల్లో చెప్పింది కూడా అదేగా!!