హైదరాబాద్ పోలింగ్ కు షాకివ్వనున్న ఆంధ్రా ఓటర్లు!
ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్న వారంతా ఇప్పుడు ఏపీ ఎన్నికలకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి.
By: Tupaki Desk | 3 May 2024 4:03 AM GMTసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న పోలింగ్ దశల వారీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే రోజున పోలింగ్ జరగనుంది. ఇదే తెలంగాణలోని హైదరాబాద్ మహానగరం పరిధిలోని రెండు ఎంపీ స్థానాల్లోని అభ్యర్థులకు దడగా మారింది. ఏపీలో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో.. రెండు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్న వారంతా ఇప్పుడు ఏపీ ఎన్నికలకే ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి.
దీంతో.. హైదరాబాద్ మహానగరం పరిధిలోని ఎంపీ ఎన్నికల పోలింగ్ మీద ప్రభావం చూపటం ఖాయమంటున్నారు. హైదరాబాద్ మహానగర పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లే ఎంపీ స్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికం పాతబస్తీకి చెందినవే కావటం.. ఇక్కడ ఆంధ్రా ఓటర్లు పెద్దగా లేకపోవటంతో ఈ స్థానంలోని పోలింగ్ మీద పెద్ద ప్రభావం ఉండదు.
చేవెళ్ల ఎంపీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికం తెలంగాణ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం.. చాలా తక్కువ మొత్తంలోనే ఆంధ్రాప్రాంతానికి చెందిన వారుంటారు. ఇక.. మిగిలిన రెండు ఎంపీ స్థానాలైన సికింద్రాబాద్.. మల్కాజ్ గిరి స్థానాల్లో మాత్రం ఆంధ్రా ఎన్నికల ప్రభావం పక్కాగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడి ఓటర్లలో చాలామందికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్న పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో జరిగే ఎన్నికలకు పెద్ద ఎత్తున వెళ్లి ఓటేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఏపీలో అధికార.. విపక్షాలకు చెందిన ఓటర్లు తాజా అసెంబ్లీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవటం.. తమ ఓటుతో ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.
దీంతో తమ ఓటును ఏపీకి వెళ్లి వినియోగించుకోవటానికి వీలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల పోలింగ్ ఎప్పుడూ తక్కువే. గడిచిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన తెలంగాణ ప్రాంతాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగర పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నమోదు తక్కువగా ఉండటం తెలిసిందే.
తాజా ఎన్నికల్లో ఏపీ ఓటర్లు వేలాది మంది ఆంధ్రాకు తరలి వెళ్లి.. తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపటంతో హైదరాబాద్ సిటీలోని రెండు ఎంపీస్థానాల పోలింగ్ మీద తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఈ వ్యవహారం.. అభ్యర్థుల గుండెల్లో గుబులు రేపుతుంది. అసలే తక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే వేళలో.. తమకు అండగా నిలిచే ఓటర్లు.. ఆంధ్రాకు వెళ్లిపోతే తమ పరిస్థితేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.