తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి టికెట్ కోసం తండ్రీతనయుల పోరు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపు విషయం అన్ని పార్టీలకూ తలనొప్పిగా మారింది. ఏ ఒక్క పార్టీ కూడా దీనికి మినహాయింపుగా కనిపించడం లేదు.
By: Tupaki Desk | 27 Oct 2023 6:39 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ల కేటాయింపు విషయం అన్ని పార్టీలకూ తలనొప్పిగా మారింది. ఏ ఒక్క పార్టీ కూడా దీనికి మినహాయింపుగా కనిపించడం లేదు. బీఆర్ ఎస్‌లో టికెట్ల చిచ్చు.. అనేక మంది నాయకులను దూరం చేసింది. ఇక, కాంగ్రెస్‌లోనూ ఇదే తరహ రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. మరో వైపు ఇప్పటికే తొలి జాబితా ప్రకటించిన బీజేపీ విషయంలోనూ అసంతృప్తి సెగలు కక్కుతున్నాయి.
ఇదిలావుంటే.. ఒకే సీటు కోసం తండ్రీ కొడుకులు పట్టుబడుతున్న పరిస్థితి మాత్రం బీజేపీలో కనిపిస్తోంది అని అంటున్నారు . ఇది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. తెలుగురాష్ట్రాల రాజకీయాల్లోనే తొలిసారి చోటు చేసుకుంది. అదే ఆందోల్ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ టికెట్‌ను తనకు కేటాయించాలని తండ్రి కోరుతుండగా.. అయన కొడుకు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అని అంటున్నారు .
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం నుంచి గతంలో సినీ హాస్య నటుడు మోహన్‌బాబు విజయం దక్కించుకున్నారు. 1998లో ఒకసారి, తర్వాత మరోసారి మోహన్‌బాబు గెలుపు గుర్రం ఎక్కారు. కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అప్పట్లో ఆయన తెలుగు దేశం పార్టీలో ఉన్నారు. తర్వాత రాష్ట్ర విభజనతో పార్టీ మారి.. బీఆర్ ఎస్‌లో చేరారు. అయితే.. అక్కడ ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోవడంతో తిరిగి.. బీజేపీ గూటికి చేరారు.
అయితే.. ఎప్పుడూ కూడా కుటుంబాన్ని ఆయన రాజకీయాల్లోకి తీసుకురాలేదు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా మోహన్‌బాబు కుమారుడు ఉదయ్ కూడా టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. ప్రస్తుతం బీజేపీ 52 మంది అభ్యర్థులతో ప్రకటించిన జాబితాలో బాబూమోహన్ పేరు లేదు. దీంతో ఆయన రెండో జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఇంతలోనే.. ఆయన కుమారుడు ఉదయ్ పేరు తెరమీదికి వచ్చింది.
ఢిల్లీలో ఉదయ్‌కు ఉన్న సానుకూల పరిణామాల నేపథ్యంలో తానే పోటీకి రెడీ అవుతున్నారట. దీంతో బీజేపీ అధిష్టానం ఉదయ్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ఉదయ్ పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్టు పెద్ద ఎత్తున వార్తలు కూడా వస్తున్నాయి. వాస్తవానికి రెండు మాసాల కిందటే బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి ఉదయ్ పేరును ప్రస్తావించినట్టు తెలిసింది. అయితే.. ఈ సారి మాత్రం తనకే టికెట్ ఇవ్వాలని బాబూ మోహన్ కూడా కోరారని సమాచారం. అయితే.. యువకుడు, విద్యావంతుడు కావడంతో ఉదయ్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు బీజేపీ వర్గాలు సైతం చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.