నంద్యాలలో ఘోరం..ఎనిమిదేళ్ల బాలికపై మైనర్ల హత్యాచారం
8 ఏళ్ళ బాలికపై 12 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు అత్యాచారం, హత్య చేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
By: Tupaki Desk | 11 July 2024 4:04 AM GMTఈ హైటెక్ జమానాలో స్మార్ట్ ఫోన్ లు అరచేతిలో అద్భుతాలు చూపిస్తున్నాయి. అయితే, అదే స్మార్ట్ ఫోన్ల ద్వారా చాలామంది యువతకు అరచేతిలోకి పోర్న్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే మైనర్ బాలురు అత్యాచారాలకు పాల్పడుతున్న వైనం సంచలనం రేపుతోంది. ఇటీవల ఏలూరులో పదో తరగతి విద్యార్థినిపై సహ విద్యార్థి అత్యాచారానికి పాల్పడిన ఘటన షాకింగ్ గా మారింది. ఆ ఘటన మరువక ముందే తాజాగా నంద్యాల జిల్లాలో మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ళ బాలికపై 12 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు అత్యాచారం, హత్య చేసిన వైనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
జిల్లాలోని ఓ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న సదరు బాలిక 3 రోజులుగా కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. బాలిక వాడిన డ్రెస్ వాసనను పోలీస్ జాగిలాలకు చూపించి వదలడంతో ఆ శునకాలు గ్రామ శివార్లలోని కాల్వ ఒడ్డుకు వెళ్లాయి. ఆ తర్వాత ఆ ముగ్గురు బాలుర ఇంటి వద్దకు పోలీసులను జాగిలాలు తీసుకెళ్లాయి. ఆ ముగ్గురు బాలురు సదరు బాలిక చదివే పాఠశాలలోనే ఆరు, ఏడో తరగతి చదువుతున్నారు. వారిని విచారణ చేయగా వారు షాకింగ్ విషయాలు వెల్లడించారు.
బాలికపై తాము అత్యాచారం చేశామని, భయపడి చంపి కాల్వలో పడేశామని పోలీసులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. వారిని అదుపులోకి తీసుకొని జువనైల్ హోమ్ కు తరలించిన పోలీసులు కాల్వలో బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు. పట్టుమని పదమూడేళ్లు లేని ఆ ముగ్గురు బాలురు ఈ ఘోరానికి ఒడిగట్టినట్టుగా తేలడంతో పోలీసులతో పాటు స్థానికులు కూడా షాకయ్యారు. మైనర్ బాలికపై మైనర్ బాలురు హత్యాచారం చేసిన ఈ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది.