ఎర్రకోట వద్ద ఖాళీ కుర్చీ... ఇప్పుడిదే హాట్ టాపిక్!
యావత్తు భారతావని 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది.
By: Tupaki Desk | 15 Aug 2023 6:24 AM GMTయావత్తు భారతావని 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన రిజర్వ్ చేసిన ఖాళీ కుర్చీ హాట్ టాపిక్ గా మారింది.
అవును... ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానితోపాటు... సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సమయంలో రిజర్వ్ చేసిన ఒక ఖాళీ కుర్చీ దర్శనమిచ్చింది. అది ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేది కావడం గమనార్హం.
ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మల్లికార్జున ఖర్గే దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోసం వేసిన కుర్చీ ఖాళీగా ఉంది. అయితే అనారోగ్యం కారణంగా తాను హాజరుకాలేకపోయినట్టు ఖర్గే వివరణ ఇచ్చారు. అనంతరం కీలక అంశాలను ప్రస్థవిస్తూ ఒక వీడియో సందేశం పంపించారు.
ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో... భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక భూమిక పోషించిన మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలాజా అబుల్ కలామ్ ఆజాద్, బాబు రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి మహాత్ములకు నివాళులర్పించారు.
అనంతరం.. దేశ ప్రగతిలో స్వాతంత్ర భారత తొలి ప్రధాని నెహ్రూ.. ఇతర కాంగ్రెస్ నేతలు ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ లతోపాటు బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయిల పాత్రను మల్లిఖార్జున ఖర్గే కొనియాడారు.
ఈ సందర్భంగా... "ఇప్పటివరకూ దేశాన్ని పరిపాలించిన ప్రతి ప్రధానమంత్రి దేశ ప్రగతికి దోహదపడ్డారు.. గత కొన్నేళ్లలోనే భారత్ పురోగమిస్తుందని ఈ రోజు కొందరు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు" అని మోడీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అంటే... ఏ ఒక్కరివల్లో దేశం ఈ రోజు ఇలాలేదు... అందరి సమిష్టి కృషి ఉందని చెప్పడం ఆయన ఉద్దేశ్యం అయ్యి ఉండొచ్చు!
ఇదే క్రమంలో ఈ రోజు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు తీవ్రమైన ముప్పులో ఉన్నాయని చెప్పడానికి చింతిస్తున్నట్లు చెప్పిన ఖర్గే... ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతుకను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందులో భాగంగా... సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, ఆదాయపు పన్ను అధికారుల దాడులే కాదు.. ఎన్నికల కమిషన్ ను కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు.. మైక్ లు కట్ చేస్తున్నారు.. ప్రసంగాలు తొలగిస్తున్నారు.. అని ఆరోపించారు.
ఇక, మహానాయకులు కొత్త చరిత్ర సృష్టించడానికి గత చరిత్రను చెరిపివేయరని తెలిపిన ఖర్గే... ఇప్పుడున్నవారు మాత్రం ప్రతిదానికీ పేరు మార్చడానికి మత్రమే ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. గత పథకాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పేరు మార్చేస్తూ.. తమ నియంతృత్వ మార్గాలతో ప్రజాస్వామ్యాన్ని చీల్చుతున్నారని చెండాడారు!