అంగన్వాడీ నిరసన సరే.. తెరవెనుక ఏదో జరుగుతోంది.. ఏపీ సర్కారు అలెర్ట్!
ఈ క్రమంలోనే వైసీపీ సర్కారు రావడంతోనే వారికి వేతనాలు కొంత వరకు సవరించింది.
By: Tupaki Desk | 27 Dec 2023 10:15 AM GMTఏపీలో గత 15 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు వేతనం పెంచాలని.. పర్మినెంట్ చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ డిమాండ్లతో గతంలోనూ అంగన్వాడీలు ధర్నా నిరసన చేశారు. అప్పట్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తమ ప్రభుత్వ పరిష్కరిస్తుందని పేర్కొంటూ.. వైసీపీ అప్పట్లో హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ సర్కారు రావడంతోనే వారికి వేతనాలు కొంత వరకు సవరించింది.
అయితే.. ఇప్పుడు మరింత వేతనం పొంపు కోరుతున్నారు. సరే.. ఇది ఎలా ఉన్నా.. అనూహ్యంగా చెప్పాపె ట్టకుండానే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు.. ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించడం సంచలనంగా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ తమకు అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎంపీల ఇళ్లను అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. శ్రీకాకుళం జిల్లాలోని రెవెన్యు మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటిని అంగన్వాడీలు ముట్టించారు. తమ సమష్యలు పరిస్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్మాన ప్రసాధరావు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి ధర్మాన ప్రసాద్ ఇంటి వద్ద బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు.. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటిని కూడా ముట్టడించారు.
జగ్గయ్యపేటలో వైసిపి ఎమ్మెల్యే ఇంటి ముందు మోకాళ్ళ మీద కూర్చొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు అందోళన చేశారు. గత 16 రోజులుగా శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి మార్గం చూపటం లేదని అన్నారు. అదేవిధంగా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ టీచర్లు న్యాయపరమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
అయితే.. సాధారణంగా నిరసనలు, ఆందోళనలు అనేవి ఏ ప్రభుత్వంలో అయినా కామన్‌గానే ఉంటాయి. కానీ, ఇప్పుడు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ నిరసనలు జరుగుతున్నాయని వైసీపీ భావిస్తోంది. తెరవెనుక ఏవో వ్యతిరేక శక్తులు ఈ ఉద్యమాలను ప్రోత్సహించి.. ఎన్నికల వేళ వైసీపీని బద్నాం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు తెరవెనుక ఏం జరుగుతోందో తేల్చాలంటూ.. క్షేత్రస్థాయిలో మంత్రులకు ఆదేశాలు వచ్చినట్టు సమాచారం.