Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఐటీ నోటీసులు...గట్టిగా తగులుకున్న అనీల్!

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీశాఖ జారీ చేసిన నోటీసులపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   5 Sep 2023 7:20 AM GMT
చంద్రబాబుకు ఐటీ నోటీసులు...గట్టిగా తగులుకున్న అనీల్!
X

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఐటీశాఖ జారీ చేసిన నోటీసులపై రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఒక వర్గం మీడియా మౌనాన్నే తమ భాషగా చేసుకుంటే... మరో వర్గం మీడియా మాత్రం ఫుల్ కవరేజ్ ఇస్తున్న పరిస్థితి. ఈసమయంలో తాజాగా ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

అవును... చంద్రబాబు నాయుడు - 118 కోట్ల రూపాయల వ్యవహారం - ఐటీ నోటీసులపై ఇప్పటికే వైసీపీ నేతలు, మంత్రులూ వాయించి వదులుతున్న సంగతి తెలిసిందే. సమాధానం చెప్పాలని.. స్పందించాలని కొంతమంది కోరుతుంటే... ఈడీ ఎంటర్ అవ్వాలని మరికొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో అనిల్ కుమార్ మైకులముందుకు వచ్చారు.

తాజాగా ఈ విషయంపై స్పందించిన అనిల్... తాను సత్యహరిశ్చంద్రుడునని చెప్పుకునే చంద్రబాబు తన పీఏ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారని.. అసలు ఈ నోటీసులపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ప్రధాని మోడీ వన్ టు వన్ కూర్చుని మాట్లాడుకున్న విషయాలు ఇవి అంటూ కథనాలు రాసే మీడియా... ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అవినీతిపై ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్‌.. చంద్రబాబు కు ఐటీ ఇచ్చిన నోటీసులపై కనీసం ట్వీట్ కూడా ఎందుకు చేయలేదని అడిగారు!

ఈ 118 కోట్ల రూపాయలల్లోనూ పవన్ కల్యాణ్ వాటా ఎంతో కొంత ఉండే ఉంటుందని.. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడని, దత్తపుత్రుడు అనిపించుకున్నాడన్నట్లుగా అనీల్ కుమార్ ఫైరయ్యారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వ అప్పులపై మాట్లాడుతున్న ఏపీబీజేపీ చీఫ్ పురందేశ్వరి ఈ నోటీసులపై ఎందుకు స్పందించడంలేదో చెప్పాలని అడిగారు.

ఇదే సమయంలో పసుపురంగు పులుముకోవడానికి ఉత్సాహం చూపించే ఎర్రపార్టీ నేతలుగా పేరుసంపాదించుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న నేతలపైనా అనిల్ స్పందించారు. చంద్రబాబుకు జారీ అయిన నోటీసులపై సీపీఐ నారాయణ, రామకృష్ణ కూడా ఎందుకు స్పందించడంలేదో తెలియడం లేదని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఒక విన్నపం అని చెప్పిన అనిల్... ఈ నోటీసులు జగన్ ప్రభుత్వం ఇచ్చినవి కావని, ఏపీ ప్రభుత్వం ఏదో కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతుందనే అభిప్రాయాలు తెచ్చుకోవద్దని... ఇది పూర్తిగా దత్తపుత్రుడు మద్దతు తెలిపిన బీజేపీ ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నోటీస్ అని అన్నారు!

అనంతరం... చంద్రబాబుకు శక్తి, వయసు అయిపోయిందని చెప్పిన మాజీమంత్రి... చంద్రబాబు చేసిన పాపానికి పరిహారం చెల్లించాల్సిన సమయం మాత్రమే ఇక మిగిలి ఉందని అన్నారు. అమరావతి పేరుతో కొల్లకొట్టిన నిధుల్లో ఇది కొంత మాత్రమే అని.. ఐటీ నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా కప్పను తిన్న పాములాగా కూర్చున్నారని ఎద్దేవా చేశారు.