Begin typing your search above and press return to search.

ఇదెక్కడి దారుణం.. హిందీలో మాట్లాడాడని..!

ఈ సమయం లో అనిల్‌ పక్కనే ఉన్న ఆయన సహోద్యోగి (అమెరికన్‌) అమెరికా రక్షణ రహస్యాల ను ఎవరికో చేరవేస్తున్నాడని పొరపడి కంపెనీ యాజమాన్యానికి అనిల్‌ పై ఫిర్యాదు చేశాడు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 8:17 AM GMT
ఇదెక్కడి దారుణం.. హిందీలో మాట్లాడాడని..!
X

హిందీ లో మాట్లాడిన పాపానికి ఒక ఉద్యోగి తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అయితే ఈ ఘటన జరిగింది మనదేశం లో కాదు.. అమెరికాలో. ఇండియాలో ఉన్న తన బావతో అమెరికా లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వీడియో కాల్‌ ద్వారా హిందీలో మాట్లాడాడు. దీంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. భారతీయ అమెరికన్‌ అనిల్‌ వర్షణే హంట్స్‌విల్‌ లోని పార్సన్స్‌ కార్పొరేషన్‌ లో సిస్టమ్స్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య నాసాలో ఇంజనీరుగా ఉన్నారు. 1968లోనే అమెరికా వెళ్లిన ఆ దంపతుల కు ఆ దేశ పౌరసత్వం కూడా ఉంది.

కాగా ఇటీవల అనిల్‌ వర్షణే ఇండియాలో ఉన్న తన బావతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు. భారత్‌ లో ఉంటున్న అనిల్‌ బావ కె.సి.గుప్తా అవసానదశలో ఉండటంతో ఆయన ను పలకరించడానికి గతేడాది సెప్టెంబరు 26న అనిల్‌ వీడియోకాల్‌ చేశారు. ఆ సమయం లో అనిల్‌ ఆఫీసు లో ఉన్నారు. తన బావకు ఇంగ్లిష్‌ కు రాకపోవడంతో ఆయన హిందీలో సంభాషించారు. ఈ సమయం లో అనిల్‌ పక్కనే ఉన్న ఆయన సహోద్యోగి (అమెరికన్‌) అమెరికా రక్షణ రహస్యాల ను ఎవరికో చేరవేస్తున్నాడని పొరపడి కంపెనీ యాజమాన్యానికి అనిల్‌ పై ఫిర్యాదు చేశాడు. దీంతో కంపెనీ అనిల్‌ ను ఉద్యోగం నుంచి తొలగించింది.

కంపెనీ తనను తొలగించడం పై అనిల్‌ కోర్టులో కేసు వేశాడు. దీంతో ఈ విషయం వెలుగుచూసింది. జాతివివక్ష వల్ల తాను గత అక్టోబరు నుంచి నిరుద్యోగిగా ఉన్నానని అనిల్‌ న్యాయస్థానం దృష్టికి తెచ్చాడు. జరిగిన అన్యాయానికి తాను పనిచేస్తున్న సంస్థ 'పార్సన్స్‌ కార్పొరేషన్‌' నష్టపరిహారం చెల్లించాలంటూ న్యాయమూర్తిని కోరారు.

అమెరికా ప్రభుత్వ క్షిపణి రక్షణ సంస్థ (ఎండీఏ)కు పార్సన్స్‌ కార్పొరేషన్‌ గగనతల రక్షణ సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో భూతలం పై క్షిపణి నిరోధక వ్యవస్థను రూపొందించి ఎండీఏకి 50 లక్షల డాలర్లు ఆదా చేసినందుకు అనిల్‌ కు గతం లో మేటి ఉద్యోగి అవార్డు కూడా లభించడం గమనార్హం.

అనిల్‌ తన బావతో రెండు నిమిషాలపాటు మాట్లాడారు. అయితే ఆయన హిందీ లో మాట్లాడటంతో సహోద్యోగికి అనుమానమొచ్చింది. అతడికి హిందీ రాదు. దీంతో అనిల్‌ దేశ రక్షణ రహస్యాల ను ఎవరికో చేరవేస్తున్నాడని భావించి కంపెనీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ కంపెనీ ఆయనకు ఉద్వాసన పలికింది.

అంతేకాకుండా.. అనిల్‌ ను గూఢచారిగా అనుమానించింది. అధికారులు ఆయన ఫైళ్లను, ఇతర సామగ్రినీ క్షుణ్నంగా శోధించినా నేరం చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఈ నేపథ్యంలో తనను మళ్లీ ఉద్యోగం లోకి తీసుకోవాలి లేదా నష్టపరిహారం చెల్లించాలని అనిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.