తిరుపతి లడ్డు...రాజకీయానికి లేదా అడ్డు!
టీడీపీ అయితే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుని ఉపయోగించారని ఆరోపిస్తోంది. అంతే కాదు కల్తీ చేశారు అని అంటోంది.
By: Tupaki Desk | 19 Sep 2024 4:45 PM GMTతిరుపతి లడ్డూ అంటే వరల్డ్ ఫ్యామస్. లడ్డూ కోసమే చూసే వారు కోటాను కోట్ల మంది ఉంటారు. స్వామి వారి లడ్డూని తినకపోతే అంతకంటే మహా పాపం అని భక్తుల అత్యంత విశ్వాసం. అయితే దురదృష్టం ఏంటి అంటే రాజకీయం కోసం పన్నుతున్న వ్యూహాలు ప్రపంచ దేవుడు కలియుగ స్వామి అయిన శ్రీ వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఘనత వహించిన పెద్దలు గ్రహించలేకపోతున్నారు.
అపచారం జరిగితే దానిని మూడవ కంటి వారికి తెలియకుండా సరిదిద్దాలి. అంతే తప్ప ఊరంతా చాటకూడదు. దాని వల్ల ఫలితం హిందువుల మనోభావాలు తీవ్రంగా గాయపడతాయి. ఆ గాయాలకు లేపనం పూయడం ఎవరి వల్లా కాదు. అంతే కాదు శ్రీవారు ఎవరికీ రాజకీయ వస్తువు కాదు. ఆయన దేవదేవుడు.
కానీ గడచిన అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి ఆలయం మీదనే టీడీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అపచారం జరిగింది అని యాగీ చేస్తోంది. తప్పు జరిగితే దానిని ధార్మిక సంస్థలకు అప్పగించాలి. వారు చూసుకుంటారు. అంతే తప్ప రాజకీయం చేయడం తగునా అన్న చర్చ వస్తోంది.
అసలు టీటీడీ తో సహా దేవాలయాల పాలన అంతా ధార్మిక సంస్థలకు అప్పగిస్తే బాగుంటుంది అన్నది కూడా ఇపుడు కొత్తగా వస్తున్న డిమాండ్. ఎందుకంటే రాజకీయాలు ఎంతటి నీచ స్థాయిలోకి దిగజారాయో తిరుపతి లడ్డు సాక్షిగా అంతా చూస్తున్నారు.
టీడీపీ అయితే తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుని ఉపయోగించారని ఆరోపిస్తోంది. అంతే కాదు కల్తీ చేశారు అని అంటోంది. మరికొందరు అయితే వేర ఇతర పదార్ధాలు కలిపారు అని అంటున్నారు. వీటిని చూసిన వారు శ్రీవారి భక్తులు హిందువులు రగిలిపోతున్నారు వెంకటేశా ఎంతటి విపత్తు నీ కొండకు వచ్చింది స్వామీ అని ఆవేదన చెందుతున్నారు.
ఈ రకమైన ఆరోపణలు చేసిన వారి మీద కానీ ఎదుర్కొన్న వారి మీద కానీ ఆస్తిక జనులు అటు ప్రేమను ఇటు కోపాన్ని పెంచుకోవడం కంటే రాజకీయాల పట్ల జుగుప్స పెంచుకుంటారు అన్నది మరచిపోకూడదు. ఇదిలా ఉంటే ఒక వైపు తమ హయాంలో మంచి నాణ్యతతో కూడిన నేయిని వాడామని ఎటువంటి అపచారం జరగలేదని వైసీపీ చెబుతోంది.
అంతే కాదు టీడీపీ తిరుపతి లడ్డూని టెస్టింగ్ కి పంపిన డేట్ ని కూడా ఉదహరిస్తూ శ్రీవారి లడ్డూకి వాడుతున్న నెయ్యిని శాపిల్ గా తీసుకున్నది జూలై 17 అయితే రిపోర్టు వచ్చింది జూలై 24 అని దాని ప్రకారం కూటమి ప్రభుత్వంలోనే కల్తీ జరిగింది అని జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేశారు అన్న దాన్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తోంది.
ఇలా రెందు పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ చివరికి ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూని అపవిత్రం చేస్తున్నారు అని ఆస్తిక జనులు గగ్గోలు పెడుతున్నారు. ఇది నిజంగా స్వామికి చేస్తున్న మహాపచారం అని అంటున్నారు. తిరుమల మీద టీటీడీ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి రహదారులు ఇతర ఏర్పాట్లు చేసింది అనాటి బ్రిటిష్ ప్రభుత్వం.
అప్పట్లో వారు వేరే మతాన్ని ఆచరించినా శ్రీవారి ఆలయ మర్యాదలకు ఎలాంటి అపచారం జరగలేదు. వారి కంటే ముందు ముస్లింల ఏలుబడిలో కూడా ఎలాంటి విమర్శలు రాలేదు. కానీ మనకు మనమే పాలించుకుంటూ వస్తున్న ఈ వ్యవస్థలో అందులో ఇటీవల కాలంలో ప్రతీ దానికీ తిరుమల శ్రీవారిని లాగి రాజకీయాలు చేయడమేంటి అని ఆస్తిక సంఘాలు ప్రశ్నిస్తున్నారు.
మీరూ మీరూ రాజకీయాలు చూసుకోండి, మధ్యలో దేవదేవుడిని ఎందుకు తీసుకుని వస్తున్నారు అని అడుగుతున్నారు. తిరుమల పాలనను ప్రభుత్వ పగ్గాల నుంచి ధార్మిక సంస్థలకు అప్పగిస్తే అంతకంటే చేసే మేలు మరోటి లేదని కూడా అంటున్నారు. మొత్తానికి తిరుపతి లడ్డుని చూసినపుడు కాదేదీ రాజకీయానికి అనర్హం అన్నది గుర్తుకు వస్తుంది. ఇది ఎంత దూరం పోతుందో కూడా చూడాల్సిందే.