Begin typing your search above and press return to search.

బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం.. హోంమంత్రి అనిత

వీరి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపుడి అనిత స్పందించారు.

By:  Tupaki Desk   |   8 Sep 2024 10:40 AM GMT
బెంగళూరులో ఉండి పులిహోర కలుపుతున్న మాజీ సీఎం.. హోంమంత్రి అనిత
X

విజయవాడలో వచ్చిన వరదలపై వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. వరద బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా.. ఫీల్డ్‌కి వచ్చి చూడాలంటే టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బాధితులకు కనీసం ఆహారం, నీళ్లు కూడా ఇవ్వడం లేదని వైసీపీ మండిపడుతోంది. పునరావాసంలోనూ సరైన సదుపాయాలు లేవని అంటున్నారు. వీరి వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలపై హోం మంత్రి వంగలపుడి అనిత స్పందించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన పేటీఎం బ్యాచ్ కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ మేరకు ఆమె విజయవాడలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం విపత్తుపై అప్రమత్తం చేస్తూ కాలనీల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. బాధితుల్లో మనోధైర్యం కల్పిస్తున్నారని చెప్పారు. బాధితులకు సైతం ఆహారం, నీరు, పాలు అందిస్తున్నామని తెలిపారు. పులిహోర ప్యాకెట్లు సైతం ఇవ్వలేదని వైసీపీ అధినేత ఆరోపిస్తున్నారని.. బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు చెప్పడం కాదని, క్షేత్రస్థాయిలో వచ్చి చూడాలని సూచించారు. జగన్ పరామర్శకు వచ్చి కనీసం 20 నిమిషాలు కూడా బాధితులతోని గడపలేదని ఆరోపించారు.

ముంపు కాలనీల్లో 170 వాటర్ ట్యాంకులతో మంచినీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. వందల ట్రిప్పుల్లో నీరు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 27వేలకు పైగా ఇళ్లలో అధికారులు బురదను తొలగించారని తెలిపారు. డ్రోన్లతోనూ బాధితులకు ఆహారం అందిస్తున్నామని తెలిపారు. క్లోరినేషన్ కూడా చేపిస్తున్నామని చెప్పారు. డ్రోన్ల ద్వారా లక్ష ఆహార ప్యాకెట్లు అందించామన్నారు. చంద్రబాబు పండుగకు సైతం దూరంగా ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని అన్నారు.

మంత్రి నిమ్మల రామానాయుడు కూడా మూడు రోజులపాటు బుడమేరు వద్దే ఉండిపోయారని చెప్పారు. నిద్రాహారాలు మాని గండ్లు పూడ్చివేయించారన్నారు. వీటిని చూడకుండా వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కావాలనే వైసీపీ బ్యాచ్ విషప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అలాగే.. మీడియాలో ప్రచారం అవుతున్నట్లు గణేశ్ మండపాలకు ఎలాంటి చందాలను వసూలు చేయలేదన్నారు. మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవోను జగన్ ప్రభుత్వమే తీసుకొచ్చిందన్నారు. చంద్రబాబుకు ఈ విషయం తెలియగానే.. ఎక్కడ కూడా ఒక్క రూపాయి వసూలు చేయడానికి వీలులేదని ఆదేశించారని తెలిపారు.