లోకేశ్ రెడ్‌బుక్.. అనిత యాక్షన్!
ఆ బాధ్యతలను హోం మినిస్టర్ అనిత తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ పేర్లు రాకుండా అనిత ఈ పని పూర్తి చేస్తారని అంటున్నారు.
By: Tupaki Desk | 18 Jun 2024 8:01 AM GMTలోకేశ్ రెడ్‌బుక్ ప్లాన్‌ను హోం మినిస్టర్ అనిత అమలు చేయబోతున్నారా? అవినీతి అధికారులకు ఇబ్బందులు తప్పవా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా అనిత మరోసారి పోలీసు శాఖను ఉద్దేశించి వార్నింగ్ ఇవ్వడమే అందుకు నిదర్శనమని చెప్పాలి. జగన్ అండ చూసుకుని గత ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీసు అధికారులు టీడీపీపై కక్ష్య సాధింపు చర్యలకు పూనుకున్నారనే ఆరోపణలున్నాయి. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని అంటున్నారు.
ఇలా చట్టాలకు విరుద్ధంగా టీడీపీ నాయకులపై దౌర్జన్యంగా వ్యవహరించిన పోలీసు అధికారుల పేర్లను రెడ్‌బుక్‌లో లోకేశ్ రాసుకున్న సంగతి తెలిసిందే. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేశ్ ఈ రెడ్‌బుక్ గురించి వెల్లడించారు.
టీడీపీకి వ్యతిరేకంగా పని చేస్తున్న పోలీసు అధికారులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేశ్ హెచ్చరించారు. ఇప్పుడు ఎన్నికల్లో అఖండ విజయంతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీంతో లోకేశ్ రెడ్‌బుక్‌లో పేర్లున్న అధికారులపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది.
ఆ బాధ్యతలను హోం మినిస్టర్ అనిత తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ పేర్లు రాకుండా అనిత ఈ పని పూర్తి చేస్తారని అంటున్నారు. అనిత చేస్తున్న వ్యాఖ్యలు కూడా అలాగే ఉన్నాయని చెప్పాలి. వైసీపీ సర్కారులో కొందరు పోలీసు అధికారులు ఆ పార్టీ తొత్తులుగా పని చేశారని, ఇప్పటికీ వారిలో వైసీపీ రక్తమే ప్రవహిస్తోందని అనిత అన్నారు. అలాంటి అధికారులకు ఇంకా జగన్‌పై ప్రేమ ఉంటే ఉద్యోగానికి రాజీనామా చేయాలని అనిత వార్నింగ్ ఇచ్చారు. అలాంటి అధికారులు తమ ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ కోసం పని చేయాలని ఆమె పేర్కొనడం గమనార్హం. అలాగే శాంతి భద్రతల విషయంలో ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని అనిత అన్నారు.