Begin typing your search above and press return to search.

సినీ నిర్మాత హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు!

డీమార్ట్‌ బేస్‌ మెంట్‌ పార్కింగ్‌–3లో జరిగిన ప్రమాదంలో అంజిరెడ్డి మరణించారని సమాచారమిచ్చాడు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 9:34 AM GMT
సినీ నిర్మాత హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు!
X

హైదరాబాద్‌ లో సినీ నిర్మాత అంజిరెడ్డి (71) దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఆయన ఇంటిని కొంటానని నమ్మించిన జీఆర్‌ కన్వెన్షన్‌ యజమాని రాజేష్‌.. మరికొందరితో కలిసి ఆయనను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అంజిరెడ్డిని హత్య చేసి దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారని తేలింది. ఆయనను హత్య చేసి సెల్లార్‌ లో పడేసి ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించినట్టు వెల్లడైంది. అయితే సీసీ కెమెరా పుటేజీలతో ఆయన హత్య విషయం బయటపడింది.

కాగా ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌ లోని పద్మారావు నగర్‌కు చెందిన జి.అంజిరెడ్డి (71) గతంలో సినీ నిర్మాత. గతంలో దొంగ అల్లుడు, చెలికాడు తదితర సినిమాలను ఆయన నిర్మించారు. అంజిరెడ్డికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఓ కుమారుడు నగరం పరిధిలోనే మోకిలాలో ఉంటుండగా.. మరో కుమారుడు, కుమార్తె అమెరికాలో జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే అంజిరెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా అమెరికా పౌరసత్వాలు వచ్చాయి. దీంతో అక్కడే స్థిరపడాలని భావించిన ఆయన నగరంలోని తన స్థిరాస్తులు విక్రయించాలని భావించారు.

ఈ క్రమంలో అంజిరెడ్డి నిర్మాతగా ఉండగా పరిచయమైన సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌ రవి కాట్రగడ్డతో ఆయనకు స్నేహం ఉంది. ఈ నేపథ్యంలో అంజిరెడ్డి తన ఆస్తులను విక్రయిస్తానని.. ఎవరైనా ఉంటే చెప్పాలని ఎనిమిది నెలల క్రితం రవికి తెలిపారు. ఆ తర్వాత అంజిరెడ్డి అమెరికా వెళ్లారు. అంజిరెడ్డి సూచన మేరకు ఫొటోగ్రాఫర్‌ రవి ఈ విషయాన్ని రియల్టర్లతో కూడిన వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేశారు.

ఈ క్రమంలో నెల రోజుల క్రితం భార్యతో హైదరాబాద్‌ వచ్చిన అంజిరెడ్డి వద్దకు రవి తన వెంట జీఆర్‌ కన్వెన్షన్‌ యజమాని రాజేష్‌ ను తీసుకువచ్చారు. జీఎఆర్‌ కన్వెన్షన్‌ సరోజినిదేవి రోడ్‌ లో ఉంది. అంజిరెడ్డికి అలా పరిచయమైన రాజేష్‌ నమ్మకంగా, సన్నిహితంగా మెలిగాడు. పద్మారావునగర్‌ లోని ఇల్లు తనకు నచ్చిందని, తానే కొంటానని అంజిరెడ్డికి చెప్పాడు. అలాగే తమకు సైదాబాద్‌ లో ఉన్న మరో ఆస్తిని విక్రయించాలని అంజిరెడ్డి భావించారు. ఈ విషయం తెలుసుకున్న రాజేష్‌.. దాన్ని కొనడానికి ఒకరు సిద్ధంగా ఉన్నారని అంజిరెడ్డికి చెప్పాడు.

వాస్తవానికి అంజిరెడ్డి, ఆయన భార్య గత నెల 22న అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే సెప్టెంబర్‌ 29న రెండు ఆస్తుల లావాదేవీలు పూర్తవుతాయని రాజేష్‌ వారితో చెప్పడంతో అంజిరెడ్డి హైదరాబాద్‌ లోనే ఉండిపోయాడు. ఆయన భార్య విదేశానికి వెళ్లింది.

ఈ క్రమంలో ఎలాంటి నగదు చెల్లించకుండా అంజిరెడ్డికి పద్మారావునగర్‌ లో ఇంటిని సొంతం చేసుకోవాలని రాజేష్‌ ప్రణాళిక రచించాడు. దీనికోసం రెండు విడతల్లో అంజిరెడ్డికి రూ.2.1 కోట్లు నగదు రూపంలో చెల్లించినట్లు, వృద్ధుడు కావడంతో ఆయనకు ఏమైనా అయితే మరో రూ.50 లక్షలు ఆయన భార్యకు ఇచ్చి ఇంటిని రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా నమూనా డ్రాఫ్ట్‌ సిద్ధం చేశాడు.

ఈ క్రమంలో అంజిరెడ్డి మేడ్చల్‌ లోని అద్వైత్‌ గేటెడ్‌ కమ్యూనిటీలో విల్లా కొనాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్‌ 29 ఉదయం పద్మారావునగర్‌ కు వెళ్లిన రాజేష్‌... అంజిరెడ్డిని తీసుకుని విల్లా చూడటానికి మేడ్చల్‌ వెళ్లారు. అక్కడ ఉండగా అమెరికా నుంచి ఫోన్‌ చేసిన భార్యతో అంజిరెడ్డి తాను మేడ్చల్‌ లో ఉన్నట్టు చెప్పారు. ఆ తర్వాత రాజేష్, తదితరులు అంజిరెడ్డిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. తాము చెప్పినట్టు సంతకాలు చేయాలన్నారు. అయితే ఆయన వినలేదు. దీంతో ఆయనను సెప్టెంబర్‌ 29 సాయంత్రం 5.30 గంటలకు రాజేష్‌ కు చెందిన జీఆర్‌ కన్వెన్షన్‌ కు తీసుకువచ్చారు.

అక్కడ కార్యాలయంలోకి వెళ్లేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. అక్కడ జరిగిన గొడవలో ముగ్గురు వ్యక్తులు అంజిరెడ్డిపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని డీమార్ట్‌ భవనంలోని మూడో సెల్లార్‌కు తీసుకెళ్లారు. ఆయన కారుతో సెల్లార్‌ లోని పిల్లర్‌ ను ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రణాళిక రచించారు. కారు తీస్తుండగా జరిగిన ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించారు.

ఘటన జరిగిన సెప్టెంబర్‌ 29 రాత్రి 9.15 గంటలకు అంజిరెడ్డి కుమారుడు చరణ్‌ రెడ్డికి రవి ఫోన్‌ చేశాడు. డీమార్ట్‌ బేస్‌ మెంట్‌ పార్కింగ్‌–3లో జరిగిన ప్రమాదంలో అంజిరెడ్డి మరణించారని సమాచారమిచ్చాడు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న చరణ్‌రెడ్డి తండ్రి అనుమానాస్పద మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబరు 30న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ద్వారా సేకరించిన ఆధారాలతో అంజిరెడ్డి హత్య పక్కా పథకం ప్రకారమే జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. ప్రధాన నిందితుడు రాజేష్, మరో నలుగురిని అదుపులోకి తీసుకొన్నారు. హత్యకు సహకరించిన ఇద్దరు బిహారీయులు రాజేష్‌ వద్ద పనిచేస్తున్నారని, ఎటువంటి సుపారీ తీసుకోలేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది.