పల్లెల్లోనూ అన్నా క్యాంటీన్లు.. బడ్జెట్లో ఏం చెప్పారంటే
తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
By: Tupaki Desk | 11 Nov 2024 11:10 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిని తర్వాత.. పేదలకు పట్టెడన్న రూ.5కే పెట్టే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 123 ప్రాంతాల్లో 230 చొప్పున క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. హరేకృష్ణ సంస్థ.. ఈ క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేస్తోంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం సమకూరుస్తున్నారు. ప్రతి పూటా రూ.5కే వీటిని అందిస్తున్నారు. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు విషయం తరచుగా చర్చకు వస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇప్పుడు కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నాయి. రహదారుల నిర్మాణం, ఇతర పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితికి, ఇప్పటికి తేడా ఉంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే మంచిదన్న అభిప్రాయం ఎమ్మెల్యేల నుంచి కూడా వినిపిస్తోంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లోనూ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
తాజాగా ప్రకటించిన 2024-25 స్వల్ప కాలిక బడ్జెట్‌లో గ్రామీణ అన్నా క్యాంటీన్లను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటిన్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళిక లు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. మొత్తంగా 158 క్యాంటీన్లను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అయితే.. ఈ క్యాంటీన్లను స్వచ్ఛంద సంస్థలకు, లేదా స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేయాలని భావించే వారికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటు కోసం బడ్జెట్‌లో ఎంత ఖర్చు పెడుతుందో మాత్రం చెప్పలేదు. ఇక, టీడీపీ ఎన్నారై విభాగం నాయకులు గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి కొసం భారీగానే ఖర్చు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆధ్వర్యంలోనే అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయించే అవకాశం ఉందని తెలుస్తోంది.