కంపెనీ సీఏ చనిపోతే.. కనీసం కంపెనీ నుంచి ఒక్కరు రారా?
26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణం ఇప్పుడు దేశ కార్పొరేట్ ప్రపంచంలో కలకలాన్ని రేపటమే కాదు..
By: Tupaki Desk | 21 Sep 2024 4:39 AM GMT26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణం ఇప్పుడు దేశ కార్పొరేట్ ప్రపంచంలో కలకలాన్ని రేపటమే కాదు.. పెద్ద చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఆమె చిన్న వయసులో తనువు చాలించటం.. అది కూడా తాను పని చేస్తున్న కంపెనీలోని పని ఒత్తిడి కారణంగా ఆమె మరణమన్న ఆరోపణను ఆమె తల్లి ఆరోపించటం. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె మరణం తర్వాత అంత్యక్రియలకు కంపెనీ తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాకపోవటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేయింబవళ్లు పని భారం మోపటం వల్లే తన కుమార్తె మరణించినట్లుగా బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.
ఈ ఏడాది మార్చిలో ఆమె మరణిస్తే.. పని ఒత్తిడి కారణంగా ఆమె మరణించినట్లుగా ఆమె తల్లి అనితా అగస్టిన్ కంపెనీకి ఒక బహిరంగ లేఖ రాశారు. ఆమె అంత్యక్రియల తర్వాత తాను తన కుమార్తె పని చేసే కంపెనీ నిర్వాహకుల్ని సంప్రదిస్తే.. వారి నుంచి ఎలాంటి సమాధానం తనకురాలేదన్నారు. విలువలు.. మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక సంస్థ.. తన దగ్గర పని చేసే ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియలకు పాల్గొనకపోవటం దుర్మార్గంగా పేర్కొన్నారు.
పని ఒత్తిడి కారణంగా అన్నా మరణించిందంటూ ఆమె తల్లి చేస్తున్న ఆరోపణలపై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ ఖండిస్తున్నారు. అయితే.. ఆయన మాటల్ని ఆ సంస్థలో పని చేసిన మాజీ ఉద్యోగులు తప్పుపడుతున్నారు. మోయలేని పని భారంతోనే తాము ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లుగా కామెంట్లు చేయటం గమనార్హం. దీనిపై మెమానీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అన్నా మరణం.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం సైతం ఈ అంశంపై ఫోకస్ చేసింది.
ఉద్యోగులపై సంస్థల కఠిన వైఖరితో పాటు పని భారం లాంటి అంశాలు కొత్త చర్చకు తెర తీస్తున్నాయి. పని వాతావరణంలో శ్రమ దోపిడీకి గురి అవుతున్నారనే ఆరోపణలపై కేంద్ర కార్మిక శాఖ సమగ్ర దర్యాప్తు జరుగుుతందని చెబుతున్నారు. మరోవైపు.. అన్నాఅంత్యక్రియలకు హాజరు కాని వైనంపై ఆలస్యంగా సంస్థ స్పందించింది. తన ఉద్యోగి అంత్యక్రియలకు హాజరు కాకపోవటంపై రాజీవ్ మెమానీ లింక్డిన్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. అన్నా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా పేర్కొంటూ.. ‘‘వారి జీవితంలో అన్నా లేని వెలితిని ఎవరూ తీర్చలేరు. ఆమె అంత్యక్రియలకు మేం హాజరు కాలేనందుకు చింతిస్తున్నా.. ఇది మన కల్చర్ కు పూర్తి విరుద్ధం. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇంకెప్పుడు జరగదు’’ అని వ్యాఖ్యానించారు. ఏమైనా.. అన్నా మరణం కార్పొరేట్ ప్రపంచంలోని కర్కసత్వాన్ని బట్టబయలు చేసిందని చెప్పక తప్పదు.