Begin typing your search above and press return to search.

'అన్న క్యాంటీన్ లలో అపరిశుభ్రత' వీడియోపై ఫ్యాక్ట్ చెక్!

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినవాటిలో అన్నక్యాంటీన్లు ఒకటనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2024 6:49 AM GMT
అన్న క్యాంటీన్ లలో అపరిశుభ్రత వీడియోపై ఫ్యాక్ట్ చెక్!
X

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినవాటిలో అన్నక్యాంటీన్లు ఒకటనే సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన అనంతరం పెన్షన్ ను రూ.4,000 పెంచడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసింది.

త్వరలో మరో 70 అన్నక్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. వీటి నిర్వహణకు విరాళాలు కోరుతున్నారు. ఇప్పటికే పలువురు వీటి నిర్వహణకు భారీగా విరాళాలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అన్న క్యాంటిన్ల నిర్వహణకు సంబంధించినట్లు చెబుతున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

అన్న క్యాంటిన్లలో ఉపయోగించే ప్లేట్ లను చేతులు కడిగే స్థలంలో పేరుకుపోయిన మురికి నీటిలో కడుగుతున్నారని.. ఐదు రూపాయలకు అన్నం పెట్టి పేదలను అనారోగ్యాలపాలు చేస్తున్నారంటూ నెట్టింట రచ్చ మొదలైంది. ఈ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా ఈ నిర్వహణపై దుమ్మెత్తిపోసింది. దీంతో ప్రభుత్వం స్పందించింది!

తణుకు అన్నక్యాంటిన్లో తినడానికి ఉపయోగించే ప్లేట్లను మురుగు నీటితో కడుగుతున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగంగా సీరియస్ గా స్పందించింది. త్వరితగతిన ఈ విషయాన్ని ఛేదించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా టీడీపీ అఫీషియల్ ఎక్స్ పేజ్ లో దీనికి సంబంధించిన వివరణ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... అక్కడ స్పష్టంగా "చేతులు కడుగు స్థలము" అని రాసి ఉందని.. కావాలనే బురద చల్లటానికి.. చేతులు కడిగే సింక్ లో అన్నం తిన్న ప్లేట్లు పడేసింది ఓ బ్యాచ్ అని తెలిపింది. సరిగ్గా అదే సమయంలో చేతులు కడిగే సింక్ బ్లాక్ అవ్వడంతో సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లు, చెత్త తీస్తున్న సమయంలో ఓ 40 సెకండ్ల వీడియో తీసి, ప్రచారం చేస్తున్న వెల్లడించింది.

ఇదే సమయంలో ప్రతీ అన్న క్యాంటిన్ల లోనూ ప్లేట్లు కడిగే స్థలం వేరేగా ఉంటుందని.. వేడి నీటిలో, సోప్ వాటర్ లో పరిశుభ్రమైన ప్రాంతంలో ప్లేట్లు శుభ్రం చేస్తారని వెల్లడించింది. అన్నక్యాంటిన్లపై ఎవరు ఎంత విషప్రచారం చేసినా మరో 70 క్యాంటీన్లు వచ్చే నెలలో తమ ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు.