Begin typing your search above and press return to search.

అన్నదాతా సుఖీభవ...కూటమి సర్కార్ మెలిక అక్కడే ?

అన్నదాతా సుఖీభవ. పేరు బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆచరణలో అన్న దాత అయితే సుఖంగా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఆర్థిక సంవత్సరంలో పది నెలలు పూర్తి అవుతాయి.

By:  Tupaki Desk   |   26 Feb 2025 10:30 AM GMT
అన్నదాతా సుఖీభవ...కూటమి సర్కార్ మెలిక అక్కడే ?
X

అన్నదాతా సుఖీభవ. పేరు బ్రహ్మాండంగా ఉంది. కానీ ఆచరణలో అన్న దాత అయితే సుఖంగా లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ ఆర్థిక సంవత్సరంలో పది నెలలు పూర్తి అవుతాయి. అన్న దాతకు సూపర్ సిక్స్ హామీల మేరకు తొలి ఏడాది ఇస్తామన్న ఇరవై వేల రూపాయలు జమ చేయకుండానే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిపోతోంది.

సో కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పినట్లుగా కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచే ఈ పధకం అమలు చేస్తారు అన్న మాట. అయితే ఏప్రిల్ నుంచి ఆమలు చేస్తామని కూటమి పెద్దలు చెబుతున్నా అది అయ్యేది కాదని అంటున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో దీని మీద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో కలిపి ఇస్తామని చెప్పారు.

అంటే పీఎం కిసాన్ నిధులకు వీటిని జోడించి రిలీజ్ చేస్తారన్న మాట. ఆ విధంగా చూస్తే 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి చివరి క్వార్టర్ నిధులను కూడా ఫిబ్రవరిలో కేంద్రం రిలీజ్ చేసింది. సో కేంద్రం మళ్ళీ ఇచ్చేది జూన్ లేదా జూలై మాసంలోనే. అపుడు కేంద్రం తొలి విడతగా రెండు వేల రూపాయల నిధులు విడుదల చేస్తుంది.

దాంతో పాటు కూటమి ప్రభుత్వం కూడా నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తుంది అని అంటున్నారు. అంటే ఈ రెండు మొత్తాలు కలిపి రైతుల ఖాతాలో ఆరు వేల రూపాయలుగా జమ అవుతాయన్న మాట. అప్పటికి ఖరీఫ్ సీజన్ వస్తుంది. అలా ఖరీఫ్ సీజన్ లో కూటమి సర్కార్ అన్నదాతా సుఖీభవ పధకం హామీలో తొలి విడతను నిలబెట్టుకుంటుంది అని అంటున్నారు.

ఇక రెండవ విడతగా నవంబర్ లో కేంద్రం రిలీజ్ చేసే పీఎం కిసాన్ నిధులకు కలిపి అన్న దాతా సుఖీభవ నిధులు జమ చేస్తారు. చివరి లేదా మూడో విడతగా 2026 ఫిబ్రవరిలో రిలీజ్ చేసే కేంద్ర నిధులతో కలిపి అన్నదాత ఆఖరి విడతను కూటమి ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది అని అంటున్నారు.

ఇక్కడ మరో విషయం కూడా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం పీఎం కిసాన్ యోజన నిధులను ఏకంగా ఎనిమిది వేలకు పెంచుతోంది. అంటే మరో రెండు వేలు ఎక్కువ అన్న మాట. దాంతో జత చేసి అన్నదాత సుఖీభవ నిధులను ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నందువల్ల ఆ ఎనిమిది వేలూ కేంద్రం చెల్లిస్తే కూటమి ప్రభుత్వం తాను సొంతంగా చెల్లించేది కేవలం 12 వేల రూపాయలే అని అంటున్నారు. అంటే ఆర్థిక భారం ఇంకా తగ్గుతుంది అని లెక్క వేస్తున్నారు.

ఇక ఏపీలో దాదాపుగా 60 లక్షల రైతులు ఉన్నారని ఒక అంచనా. అందులో కూడా అర్హతలు నిబంధనలు అన్నీ చూసుకుని రైతులకు ఈ పధకం ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని చూస్తోంది అని అంటున్నారు. అంతే కాదు కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ యోజనలో రాష్ట్రంలో ఉన్న రైతుల సంఖ్య కంటే తక్కువ మందే లబ్దిదారులు ఉన్నారని అంటున్నారు. మరి కిసాన్ యోజన లబ్దిదారులనే ప్రమాణికంగా తీసుకుంటే అపుడు మరింతమంది తగ్గుతారు అని అంటున్నారు. ఏది ఏమైనా అన్నదాతా సుఖీభవ పధకం అమలులో మెలికలు బోలెడు ఉంటాయని ప్రచారం అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.