Begin typing your search above and press return to search.

రూ.కోటి తీసుకుంటే కోటు వేసుకోవాలా? సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న చర్చ

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ వైరల్ అవుతుందో.. ఏది వివాదమవుతుందో ఊహించడం కష్టం.

By:  Tupaki Desk   |   2 Feb 2025 5:06 PM GMT
రూ.కోటి తీసుకుంటే కోటు వేసుకోవాలా? సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న చర్చ
X

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ టాపిక్ వైరల్ అవుతుందో.. ఏది వివాదమవుతుందో ఊహించడం కష్టం. ఒక విషయాన్ని నెటిజన్లు పట్టుకున్నారంటే.. ఇక ఆ అంశంపై ఎంతో పెద్ద చర్చ జరుగుతుంటుంది. ఇప్పుడు కూడా ఏపీలో ఒక టాపిక్ పై రెండు రోజులుగా నెట్టింట అతిపెద్ద వార్ జరుగుతోంది. సెటైర్లు, మీమ్స్ తో నెటిజన్లు స్పందిస్తుండటంతో ఆ టాపిక్ పై విపరీతమైన డిబేట్ కొనసాగుతోంది. ఇంతకీ విషయమేంటంటే ఫిబ్రవరి 1న అన్నమయ్య జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. అక్కడ ఐటీ ఇంజనీర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తాను ఏడాదికి రూ.93 లక్షలు గడిస్తున్నట్లు చెప్పడం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టవిస్టులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడంతో ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దిమ్మతిరిగేలా ఆన్సర్ ఇచ్చాడు. ఇలా రెండు రోజులుగా సోషల్ మీడియాను ఈ ఇష్యూ ఊపేస్తోంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన ముఖాముఖిలో యువరాజు యాదవ్ అనే యువకుడు పాల్గొన్నాడు. తాను ఐటీ ఇంజనీర్ గా బెంగళూరులో పనిచేస్తున్నానని, ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంలా ఉన్నానని చెప్పాడు. తన జీతం ఏడాదికి రూ.93 లక్షలు అంటూ గొప్పగా చెప్పుకున్నాడు. అంతేకాకుండా చంద్రబాబు ప్రోత్సాహం వల్లే తాను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాడని చెప్పాడు. దీంతో వైసీపీ సోషల్ మీడియా స్పందించింది. రూ.93 లక్షలు జీతం చెల్లించే కంపెనీ ఎక్కడుందో చెప్పాలంటూ ప్రశ్నించింది. బెంగళూరులో అంత వేతనాలు ఇస్తున్నారా? అంటూ సెటైర్లు వేసింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తన గొప్ప కోసం ఇలా ఆర్గనైజడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని విమర్శలు గుప్పించింది. అంతేకాకుండా యువరాజు యాదవ్ వీడియోను షేర్ చేస్తూ నవ్వి నవ్వి చస్తే తమ బాధ్యత కాదంటూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ట్రోలింగ్ చేశారు. ఇలా యువరాజు యాదవ్ మాట్లాడాడో లేదో గంటల వ్యవధిలో ఆ వీడియో వైరల్ కావడంతో నెట్టింట పెద్ద చర్చే జరిగింది.

అయితే సాఫ్ట్ వేర్ రంగంలోనే పనిచేస్తున్న యువరాజు ఈ ట్రోలింగ్ పై దీటుగా స్పందించాడు. తాను నిజం చెప్పినా నమ్మకపోవడం, పైగా తనపై సెటైర్లు వేస్తుండటంతో ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. అందులో తాను పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్పకపోయినా.. తనకు వస్తున్న జీతం, ఏటా చెల్లిస్తున్న ఐటీ రిటర్న్స్, ఇతర ఆధారాలు సవివిరంగా చూపుతూ వీడియో షేర్ చేశాడు. అంతేకాకుండా తన జీతం వాస్తవానికి రూ.96 లక్షలని పొరపాటున రూ.93 లక్షలని చెప్పానని వైసీపీ యాక్టివిస్టులకు ఘాటైన రిప్లై ఇచ్చాడు. తన జీతంలో కటింగులు అన్నీ పోను ఏడాదికి రూ.83 లక్షలు తీసుకుంటున్నట్లు అన్ని ఆధారాలు చూపడంతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు తోక ముడవాల్సివచ్చిందని టీడీపీ కార్యకర్తలు పోస్టులు మొదలుపెట్టారు.

ఇక వీడియో పోస్టు చేసిన యువరాజు యాదవ్ ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేయడం కూడా వైరల్ అవుతోంది. ‘ఏడాదికి రూ.4 లక్షల తక్కువ కోటి తీసుకుంటున్న నాపై ఎడవడం ఎందుకు? వాస్తవాలు తెలుసుకోండి. చదువు ఎవడబ్బ సొత్తూ కాదు. కోటి జీతం తీసుకుంటే సూటు బూటు వేసుకుని రావాలా అంటూ విరుచుకుపడ్డాడు. తనను ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా యాక్టవిస్టులకు ఒక రేంజ్ లో యువరాజు యాదవ్ ఇచ్చిపడేయడంతో ఆ వీడియో కూడా వైరల్ గా మారింది. మొత్తానికి ఈ ఇష్యూను ప్రస్తావిస్తూ గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకోవడమంటే ఇదేనని నెట్టింట్ కామెంట్లు వినిపిస్తున్నాయి.