బోరుగడ్డ అనిల్ కు మరో కేసు ... మేటర్ ఏంటంటే..?
సోషల్ మీడియా వేదికగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తెలుగుదేశం పార్టీ నేత తిలక్ ఫిర్యాదు చేశారు.
By: Tupaki Desk | 9 Nov 2024 7:05 AM GMTబోరుగడ్డ అనిల్ పై వరుస కేసులు నమోదవుతున్నాయని తెలుస్తోంది. ఇంతకాలం అతనిపై ఫిర్యాదులు అందినా కేసులు నమోదు చేయలేదని కొంతమంది చెబుతుంటే.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతడి బాధితులంతా పోలీస్ స్టేషన్లకు క్యూలు కట్టారని మరికొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ పై మరో కేసు నమోదైంది.
అవును.. 2021లో కర్లపూడి బాబుప్రకాష్ ను రూ.50 లక్షలు ఇవ్వాలంటూ బెదిరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ నేపథ్యంలో తాజాగా అతడిని పోలీసులు పీటీ వారెంట్ పై కర్నూలుకు తీసుకువచ్చారు.
సోషల్ మీడియా వేదికగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లపై అనిల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో తెలుగుదేశం పార్టీ నేత తిలక్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది.
కాగా.. గుంటూరు టౌన్ కు చెందిన బోరుగడ్డ అనిల్.. కేంద్రమంత్రిగా పనిచేసిన రాందాస్ అథవాలే అనుచరుడిగా చెప్పుకొంటూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణీ అయ్యాడు. నాటి ముఖ్యమంత్రి జగన్ ను "అన్నా" అంటూ సంబోధిస్తూ వైసీపీతో అంటకాగుతూ.. గత ప్రభుత్వ హయాంలో రెచ్చిపోయాడు!
ఇక నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలపై సభ్య సమాజం తలదించుకునేలా సోషల్ మీడియా లోనూ, టీవీ డిబేట్లలోనూ దూషణలు చేశాడు. జగన్ కు వ్యతిరేకంగా ఎవరి మాట్లాడినా వారిపై అసభ్యకర పదజాలంతో విరుచుకుపడేవాడు. ఒకానొక దశలో జగన్ ను వ్యతిరేకిస్తూ మాట్లాడితే చంపేస్తానంటూ కూడా బెదిరించిన పరిస్థితి!
ఇక చంద్రబాబు, పవన్, లోకేష్ లపైనా తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేశాడు బోరుగడ్డ అనిల్. ఈ క్రమంలోనే... జగన్ ఆదేశిస్తే చంద్రబాబు, పవన్ లను చంపుతానని గతంలో బహిరంగంగా ప్రకటించాడు కూడా! ఈ రేంజ్ లో చెలరేగిపోయిన అనిల్ పై నమోదైన కేసులపై వరుసగా చర్యలు తీసుకుంటున్నారు! ఈ నేపథ్యంలోనే తాజాగా కర్నూలు తీసుకెళ్లారని అంటున్నారు!