Begin typing your search above and press return to search.

వికెట్ నం. 6.. బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

By:  Tupaki Desk   |   28 Jun 2024 10:24 AM GMT
వికెట్ నం. 6.. బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్
X

మాజీ సీఎం, అధినేత కేసీఆర్ వద్దంటున్నా.. మంచి రోజులు వస్తాయని నచ్చజెబుతున్నా.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు వినిపించుకోవడం లేదు. మొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. నిన్న డాక్టర్ సంజయ్ కుమార్.. నేడు ఆ పార్టీకి చెందిన మరొక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో 39 మంది ఎమ్మెల్యేలను గెలిచి.. ఉప ఎన్నికలో ఒక సీటును కోల్పోయి.. అధికారికంగా 38కి తగ్గిన కారు పార్టీకి, అనధికారికంగా ఆరుగురు ఎమ్మెల్యేలు జలక్ ఇచ్చారు.

పదేళ్ల కిందట అటు జంప్..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన మూడు రంగుల కండువా కప్పుకొన్నారు. 2014లో కాంగ్రెస్ తరపున చేవెళ్ల నుంచి తొలిసారి గెలిచిన కాలె యాదయ్య.. అనంతరం ఆ పార్టీకి షాక్ ఇస్తూ నాటి టీఆర్ఎస్ లో చేరారు. 2018లో టీఆర్ఎస్ తరఫున, 2023లో బీఆర్ఎస్ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ నియోజకవర్గంగా నిలిచింది చేవెళ్ల. అలాంటిచోట 1999 నుంచి 2014 వరకు కాంగ్రెస్ దే గెలుపు. 2009లో రిజర్వుడ్ గా మారినా ఇదే ఫలితం వచ్చింది. కానీ, కాలె యాదయ్య కాంగ్రెస్ నుంచి జంప్ కొట్టాక రెండుసార్లుగా బీఆర్ఎస్ జెండా ఎగిరింది.

ఎమ్మెల్యే వికెట్ నంబర్ 6

రాష్ట్రంలో బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఆరో ఎమ్మెల్యే కాలె యాదయ్య. తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్),సంజయ్‌ కుమార్‌ (జగిత్యాల), పోచారం శ్రీనివాస్‌ రెడ్డి (బాన్స్ వాడ) ఇప్పటికే హస్తం గూటికి చేరారు.