Begin typing your search above and press return to search.

బాబుకు కొత్త టెన్షన్... మరో ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా!

స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Sep 2023 7:16 AM GMT
బాబుకు  కొత్త  టెన్షన్... మరో ముందస్తు బెయిల్  పిటిషన్  వాయిదా!
X

స్కిల్ డవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఇంటి నుంచి వస్తోన్న భోజనం తింటూ, మెడిసిన్స్ వాడుతూ... వరుస ములాకత్ లతో బాబు కాలం గడుపుతున్నారని తెలుస్తుంది. లోపల సంగతి అలా ఉంటే బయట... వరుసగా కోర్టుల్లో పిటిషన్లు, వాటి వాయిదాల సందడి నెలకొంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏ1 గా ఉన్న మరో కీలక కేసు అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసు వ్యవహారం కూడా ఆందోళన కలిగిస్తుందని అంటున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం.. మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన కేసు.. ఇంకో పక్క త్వరలో ఏపీ ఫైబర్ గ్రిడ్ మొదలవ్వబోతుందనే కథనాలొస్తున్న తరుణంలో... ఇప్పుడు అంగళ్ల అల్లర్ల కేసు బాబుని వెంటాడుతుందని అంటున్నారు.

అవును... అంగుళ్లు, పుంగనూరు అల్లర్ల కేసులో చంద్రబాబును ఏ1 గా చేర్చ్తూ చాలా మంది టీడీపీ నేతలపైనా, కార్యకర్తలపైనా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుల్లో ఇప్పటికే చాలామందికి బెయిల్‌ దొరికింది. అయితే ఇంతకాలం ఈ కేసును లైట్ తీసుకున్నారో ఏమో కానీ... ఇప్పుడు ఈ కేసులో కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు.

ఇప్పటికే స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబుకి ఇప్పుడు ఈ కేసు కూడా టెన్షన్‌ పెడుతోందని అంటున్నారు. దీంతో ఇన్ని రోజులూ ఈ కేసు విషయంలో హైకోర్టుకి వెళ్లినట్లు కనిపించని బాబు... ఇప్పుడు తాజాగా దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని, ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదని, తనకు మాత్రం బెయిల్‌ మంజూరు చేయాలని చంద్రబాబు న్యాయస్థానాన్ని కోరారని తెలుస్తుంది.

ఈ రోజు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది. అనంతరం చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ వాయిదా వేసింది. ఇందులో భాగంగా ఈ కేసు విచారణను ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసినట్లు ఏపీ హైకోర్టు తెలిపింది. దీంతో... ఇప్పటికే క్వాష్ పిటిషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు ముందస్తు బెయిల్ పిటిషన్ లతో పాటు పుంగనూరు అల్లర్ల కేసుకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా వాయిదాపడినట్లయ్యింది.

మరోపక్క జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు వెళ్లారు.. అప్పటికే క్యాంపు ఆఫీసు నుంచి అక్కడికి వచ్చిన బాలకృష్ణ, లోకేష్‌ లు పవన్‌ కంటే ముందే జైల్లోకి వెళ్లారు. ముగ్గురూ చంద్రబాబుతో ములాఖత్‌ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సుమారు 40 నిమిషాలు వీళ్లు చంద్రబాబుతో ములాఖత్‌ లో ఉంటారు.

దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబుతో ములాకత్ అనంతరం ఈ ముగ్గురు ప్రత్యేకంగా సమావేశమై.. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో ములాఖత్‌ ముగిసిన తర్వాత పవన్‌ కల్యాణ్ ఏం మాట్లాడుతారనే దానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.