పవన్ కు హరిరామజోగయ్య మరో లేఖ
టీడీపీతో పొత్తు నేపథ్యంలో సీఎం అభ్యర్థి వ్యవహారంపై జనసైనికులు అసంతృప్తితో ఉన్నారని పవన్ దృష్టికి జోగయ్య తీసుకువెళుతూ రాసిన లేఖ సంచలనం రేపింది.
By: Tupaki Desk | 5 Jan 2024 10:03 AM GMTజనేసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య గతంలో రాసిన లేఖ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. టీడీపీతో పొత్తు నేపథ్యంలో సీఎం అభ్యర్థి వ్యవహారంపై జనసైనికులు అసంతృప్తితో ఉన్నారని పవన్ దృష్టికి జోగయ్య తీసుకువెళుతూ రాసిన లేఖ సంచలనం రేపింది. ఆ తర్వాత పవన్ ను దూషిస్తూ జోగయ్య పేరుతో ఓ ఫేక్ లేఖ కూడా సర్క్కులేట్ అయింది. దీంతో, అది ఫేక్ లెటర్ అని జోగయ్య మరో లెటర్ విడుదల చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా పవన్ కు జోగయ్య మరో లేఖ రాశారు.
కొన్ని పథకాలను పరిశీలించాలని కోరుతూ పవన్ కు ఆయన లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, అందుకే జనసేన-టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి నెలకు రూ.2 వేల చొప్పున ఇవ్వాలని సూచించారు. అలాగే, విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యుత్ బిల్లులపై 20 శాతం సబ్సిడీ, డ్వాక్రా మహిళలకు 25 వేల రుణమాఫీ ప్రకటించాలని సూచించారు. ఇక, ఇంట్లో వృద్ధులు ఒకరుంటే 3 వేలు, అంతకు మించి ఉంటే 4 వేలు పెన్షన్ ఇవ్వాలని సూచించారు.
అయితే, జోగయ్య..పవన్ ను కలిసి తన అభిప్రాయాలను, అసంతృప్తులను వెళ్లగక్కే అవకాశమున్నప్పటికీ బహిరంగ లేఖ ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదని జనసేన నేతలు, కార్యకర్తలు వాపోతున్నారు. ఇలా చేయడం వల్ల పది మందిలో పవన్ కల్యాణ్ పలుచన అవుతారని అంటున్నారు. జోగయ్య వంటి పెద్దాయన పవన్ కు సలహాలు, సూచనలు ఇవ్వడంలో తప్పులేదని, కానీ, ఇలా పబ్లిక్ గా చెప్పడం వల్ల వైసీపీ నేతలకు పవన్ చులకలన అవుతారని అంటున్నారు. మరోవైపు, కొందరు వైసీపీ నేతలు కుట్రపూరితంగానే తనపై కాపు పెద్దలతో లేఖలు రాయిస్తున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.