టీడీపీ వ్యతిరేక ఓటు ఏ పార్టీకి...?
ప్రజాస్వామ్యంలో వేసే ఒక్క ఓటులో ఎన్నో కోణాలు ఉంటాయి. ఒకరికి అనుకూలంగా ఓటు వేశారు అంటే అదే ఓటు మరొకరికి యాంటీ అని అర్ధం. అంటే ఒకే ఓటుతో రెండు యాక్షన్స్ ఉంటాయన్న మాట.
By: Tupaki Desk | 30 July 2023 3:30 PM GMTప్రజాస్వామ్యంలో వేసే ఒక్క ఓటులో ఎన్నో కోణాలు ఉంటాయి. ఒకరికి అనుకూలంగా ఓటు వేశారు అంటే అదే ఓటు మరొకరికి యాంటీ అని అర్ధం. అంటే ఒకే ఓటుతో రెండు యాక్షన్స్ ఉంటాయన్న మాట. అలాగే ప్రజాస్వామ్యంలో మ్యాజిక్ ఏంటి అంటే అధికార పక్షం నచ్చకపోతే వెంటనే ప్రతిపక్షాన్ని భుజాన ఎత్తుకునే అవసరం లేకపోవడం. తమకు నచ్చిన వారిని వెనకన ఉన్నా ముందుకు తెచ్చి కూర్చోబెట్టడం.
అలాంటి అవకాశాన్ని ప్రజలు ప్రతీ సందర్భంలోనూ వినియోగించుకుంటారు. అయితే ఆ ప్రజలకు మాత్రం చాయిస్ గా ఆయా పక్షాలు కనిపించాలి. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీనే అంతా చూస్తూంటారు. వ్యతిరేకత పెరిగింది అంటారు. పెర్ఫార్మెన్స్ ని కొలుస్తారు.
అదే టైం లో ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షం పాత్ర కూడా సమానమే. అధికార పార్టీ వైఫల్యాలను ధీటుగా విపక్షం ఎండగట్టిందా అన్నది కూడా ప్రజలు ఎంచి మార్కులు వేస్తారు. అదే విపక్షం అంతకు ముందు పాలక పక్షం అయి ఉంటే ఆ నెగిటివ్ పాజిటివ్ మార్కులు ఇంకా తీవ్రంగా ఆలోచించి వేస్తారు.
అలా కనుక చూసుకుంటే ఏపీలో టీడీపీ పలు మార్లు అధికారంలోనూ ఉంది, విపక్షంలోనూ ఉంది. అలా ఆ పార్టీ పట్ల మోజు అయితే ప్రజలకు ఉధృతంగా ఉండే అవకాశాలు అయితే ఉండవు. ఆ చాన్స్ ని ఆ రాజకీయ శూన్యతను సొంతం చేసుకునే పార్టీ ఏపీలో ఏది అన్నదే చర్చకు వస్తున్న విషయం.
కరెక్ట్ గా ఉన్నట్లు అయితే అంటే ఇప్పటికే మొత్తానికి మొత్తం 175 సీట్లలో ఇంచార్జిలను పెట్టి తన అభ్యర్ధులను రెడీ చేసుకునే దిశగా జనసేన వర్కౌట్ చేసి ఉంటే కనుక వైసీపీ వ్యతిరేక ఓటుతో పాటు టీడీపీ వ్యతిరేక ఓటు కూడా ఆ పార్టీకి షిఫ్ట్ అయి ఉందేవి. కానీ ఆ ఉద్దేశ్యం జనసేనకు లేదనే అంటున్నారు. పొత్తులతో వెళ్తామని ఆ నాయకులు చెప్పుకొచ్చారు
వారు ఎంతసేపూ వైసీపీ వ్యతిరేక ఓటునే చూస్తున్నారు కానీ టీడీపీ వ్యతిరేక ఓటుని చూడడంలేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో అధికార ప్రధాన పక్షాల పట్ల వ్యతిరేకత ఉంటే అది కచ్చితంగా మరో పక్షానికి అడ్వాంటేజ్ అవుతుంది. అలా జరగాలంటే కూటములు కడితే కుదరదు. కానీ ఏపీలో విపక్షాలు అన్నీ కూడా పొత్తుల వైపే అడుగులు వేస్తున్నాయి.
బీజేపీ విషయం తీసుకున్నా పాత అధ్యక్షుడు సోము వీర్రాజు మారి కొత్తగా పురంధేశ్వరి వచ్చారు. ఆమె సైతం వైసీపీ వ్యతిరేక ఓటు మీదనే దృష్టి నిలుపుతున్నారు. నిజానికి వైసీపీ వ్యతిరేక ఓటు ఎప్పటికీ బీజేపీకి బదిలీ కాదు. అక్కడ ఉన్న ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్ ఇతర వర్గాలు బీజేపీని ఓన్ చేసుకోవడం చాలా కష్టం. అది ఇప్పటప్పట్లో కుదరదు అని అంటున్నారు.
ఇక టీడీపీ ఓటు బ్యాంక్ కి బీజేపీ ఓటు బ్యాంక్ కి సారూప్యతలు ఉన్నాయి. అందువల్ల బీజేపీ టీడీపీ వైసీపీ రెండింటినీ వ్యతిరేకించే వ్యూహానికి పదును పెడితే ఏపీలో ఎంతో కొంత స్పేస్ వారికి ఉండవచ్చు అని అంటున్నారు. అయితే పురంధేశ్వరి మాత్రం ఒకే వైపు చూస్తున్నారు అని అంటున్నారు.
దీంతోనే ఆ పార్టీ కూడా టీడీపీ వ్యతిరేక ఓటు మీద ఫోకస్ పెట్టడంలేదు అని చెప్పాల్సి ఉంది. ఇక ఏపీలో ఎన్నికల వేళకు కొత్త పార్టీలు ఏమి వస్తాయి అన్న దాని బట్టి టీడీపీ వ్యతిరేక ఓటు ఆ వైపుగా బదిలీ అయ్యే చాన్స్ ఉండొచ్చు. ఉదాహరణకు బీయారెస్ ఏపీలో పోటీ చేస్తే అది కొంత వైసీపీ టీడీపీ వ్యతిరేక ఓటుని పట్టుకోగలదు అన్న మాట ఉంది.
అదే విధంగా పొత్తుల ఎత్తులతో కూటములు కట్టినా టీడీపీ వ్యతిరేక ఓటర్లు అలాగే వైసీపీ వ్యతిరేక ఓటర్లు నిరాసక్తతతో ఓటు వారికి వేయకుండా ఏ నోటాకో వేసినా వేయవచ్చు అన్న మాట కూడా ఉంది. మొత్తానికి చూస్తే ప్రజాస్వామ్యంలో ఓటుని పట్టుకోవడానికి పార్టీలు ఒకే వైపు చూస్తే మాత్రం వారు అనుకున్న లక్ష్యాలను అందుకోలేరు అన్నది చరిత్ర చెబుతున్న మాట.