Begin typing your search above and press return to search.

ఫిబ్రవరి 15 - 21... యాంటీ వేలైంటైన్స్ డే ప్రత్యేకతలివే!

డిశెంబర్ నెలను క్రిస్మస్ నెల అని, జనవరిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మంత్ అని అన్నట్లుగానే... ఫిబ్రవరిని లవ్ మంత్ అని అంటుంటారు

By:  Tupaki Desk   |   21 Feb 2024 3:24 PM GMT
ఫిబ్రవరి 15 - 21... యాంటీ వేలైంటైన్స్ డే ప్రత్యేకతలివే!
X

డిశెంబర్ నెలను క్రిస్మస్ నెల అని, జనవరిని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మంత్ అని అన్నట్లుగానే... ఫిబ్రవరిని లవ్ మంత్ అని అంటుంటారు. ఈ నెలలోనే చాలా మంది తమ జీవితంలో కొత్తగా పార్ట్నర్ ని సంపాదించుకుంటారు. కొన్ని సందర్భాల్లో విడిపోయిన జంటలు కూడా కలుస్తుంటాయి. అయితే ఫిబ్రవరి 14వరకూ జరిగే వేలంటైన్ సంగతి ఒకెత్తు అయితే... ఫిబ్రవరి 15 నుంచి 21 వరకూ జరిగే యాంటీ వేలంటైన్ మరొకెత్తు.

అవును... వాలంటైన్స్ వీక్ లో చివరి రోజు ఫిబ్రవరి 14.. రెండు హృదయాల కలయికతో ముగిస్తే... యాంటీ వేలంటైన్స్ వీక్ చివరి రోజు ఫిబ్రవరి 21.. అబద్ధాల పునాదులపై, మోసపు గోడలపై ఏర్పడిన ప్రేమకు బ్రేకప్ చెప్పడంతో ముగుస్తుంది. ఈ క్రమంలో స్లాప్ డే గా ప్రారంభమై బ్రేకప్ డే గా ముగిసే ఈ యాంటీ వేలంటైన్స్ వీక్ స్పెషాలిటీ ఇప్పుడు చూద్దాం...!

ఫిబ్రవరి 15 - స్లాప్ డే!

వాలెంటైన్స్ డే తర్వాత మొదటి రోజు ఫిబ్రవరి 15ని స్లాప్ డే గా జరుపుకుంటారు. ఈ రోజున తమను మోసం చేసిన వారిని.. లేదా ప్రేమ పేరుతో మానసిక క్షోభకు గురిచేసిన వారిని చెప్పుతో కొట్టడానికి ఇష్టపడే రోజన్న మాట. అటువంటి వ్యక్తులకు ఈ రోజు అంకితం. అయితే ఇక్కడ భౌతికంగా చెంప దెబ్బకొట్టడం అన్నది కేవలం ప్రతీకాత్మకమే కానీ... వారిని, వారు కలిగించిన చేడుని పూర్తిగా జీవితం నుండి తొలగించాలనేది ప్రధాన ఉద్దేశ్యం.

ఫిబ్రవరి 16 – కిక్ డే!

ఈ యాంటీ వేలంటైన్స్ డే లో రెండవ రోజు కిక్ డే! తమను మోసం చేసిన వారిని.. అలా మోసం చేసి ఇప్పటికే మాజీలుగా మారిన వారిని తన్నాలనేది ఈ రోజు అర్ధం! ఈ రోజు తమ "ఎక్స్" లు ఇచ్చిన బహుమతులను కూడా ఎగరేసి తన్నొచ్చని అర్ధం!! జీవితంలో ఎటువంటి అదనపు భారాన్నీ మోయకుండా ముందుకు సాగడానికి ప్రయత్నించడం ఈ రోజు ఉద్దేశ్యమన్నమాట!

ఫిబ్రవరి 17 – పెర్ఫ్యూమ్ డే!

యాంటీ వాలెంటైన్స్ వారంలో మూడవ రోజు పెర్ఫ్యూమ్ డే! అంటే... గతాన్ని మరిచిపోయి మీపై మీరు దృష్టి పెట్టడం ఈ రోజు ఉద్దేశ్యం అన్నమాట. ఈ రోజు ఎవరికి వారే బలంగా మారుతూ, ఎవరికి వారే మానసికంగా చికిత్స చేసుకుంటూ.. బలంగా, స్వతంత్రంగా ఉండాలని గుర్తుచేసుకోవడం. ఈ రోజు మీ స్నేహితులకు పెర్ఫ్యూమ్‌ లను బహుమతిగా ఇవ్వవచ్చు!

ఫిబ్రవరి 18 - ఫ్లర్ట్ డే!

ఈ రోజు జీవితంలో కొత్తగా వికసించే అద్భుతాల కోసం ఆశగా ఎదురుచూడటం దీని ప్రత్యేకతగా చెబుతారు. ఈ రోజు గతన్ని మరిచిపోయి ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయడం దీని ఉద్దేశ్యం అన్నమాట.

ఫిబ్రవరి 19 – కన్ఫెషన్ డే!

కన్ఫెషన్ డే అనేది సింగిల్స్ అందరూ తమ ప్రేమ కోసం వారి వారి అంతర్గత, శృంగార భరిత భావాలను నెమరువేసుకునే రోజని చెప్పుకోవచ్చు! ఇదే సమయంలో గతంలో జరిగిన వాటిలో నిజాలు చెప్పుకుంటూ, అసత్యాలను వదిలేస్తూ ముందుకు సాగాల్సిన రోజన్న మాట!

ఫిబ్రవరి 20 - మిస్సింగ్ డే!

యాంటీ వాలెంటైన్స్ వారంలోని ఆరవ రోజు అయిన మిస్సింగ్ డే... జీవితంలో మిస్సయిన వారి భావోద్వేగాలను వెదజల్లుతుంది. ఈ సమయంలో అవకాశం ఉంటే... ఈ విషయాలను, దాగి ఉన్న భావాలను గురించి వారికి తెలియజేయడానికి అవకాశం ఇచ్చే రోజన్నమాట.

ఫిబ్రవరి 21 – బ్రేకప్ డే!

ఇక ఫైనల్ గా బ్రేకప్ డే.. ఫిబ్రవరి 21న వస్తుంది! జీవితంలో ఎదురైన విషపూరిత సంబంధం నుండి బయటపడే అవకాశాన్ని ఇది అందిస్తుంది. దీనివల్ల స్వేచ్ఛ సంపాదించడంతోపాటు మోసాన్ని, అబద్ధాన్ని పూర్తిగా వదిలించుకునే రోజుగా భావిస్తారు!!