Begin typing your search above and press return to search.

శ్రీలంకకు కొత్త ‘దిశ’.. తొలి లెఫ్టిస్ట్ అధ్యక్షుడి గతం తెలుసా?

లంక చరిత్రలో తొలిసారి ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించగా.. 42.31 శాతం ఓట్లు సాధించి అనుర కుమార గెలుపొందారు. ఆ వెంటనే సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.

By:  Tupaki Desk   |   23 Sep 2024 7:11 AM GMT
శ్రీలంకకు కొత్త ‘దిశ’.. తొలి లెఫ్టిస్ట్ అధ్యక్షుడి గతం తెలుసా?
X

గత ఎన్నికల్లో కేవలం 3 శాతం ఓట్లు.. ఈసారి ఏకంగా 43 శాతం ఓట్లు.. కార్మికుల ఇంట పుట్టి.. అధ్యక్ష భవనంలోకి.. వారసత్వ పాలన నుంచి విముక్తమైన దేశంలో.. అధినేత అయిన తొలి వామపక్ష నాయకుడు.. ఇదీ శ్రీలంక కొత్త అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (56) ప్రస్థానం. ఈయన పార్టీ మార్క్సిస్ట్‌ జనతా విముక్తి పెరమున. ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో దిసనాయకేకు అత్యధిక మెజారిటీ దక్కింది. లంక చరిత్రలో తొలిసారి ద్వితీయ ప్రాధాన్య ఓట్లను లెక్కించగా.. 42.31 శాతం ఓట్లు సాధించి అనుర కుమార గెలుపొందారు. ఆ వెంటనే సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు.

కల్లోల లంకను గట్టెక్కిస్తారా?

శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొన్న సంగతి తెలిసిందే. విపరీతమైన వ్యక్తిగత ప్రయోజనాలు అందించడంతో ఆ దేశం కుప్పకూలింది. దీంతో అధ్యక్షుడిగా ఉన్న గొటబాయ రాజపక్సే ప్రజాగ్రహానికి గురై దేశాన్ని వీడి పారిపోయారు. దీంతో రణిల్‌ విక్రమసింఘే అధ్యక్షుడు అయ్యారు. అయితే, నాయకత్వ లోపం మాత్రం తొలగలేదు. తాజా ఎన్నికల్లో రణిల్ తొలి రౌండ్ లోనే చేతులెత్తేయడం దీనికి నిదర్శనం. లంకలో ప్రస్తుతం ఓ విధమైన నిరుత్సాహం అలముకుంది. ఇలాంటి సమయంలో వ్యవస్థలో మార్పు రావాలని యువత గట్టిగా కోరుకుంటగోంది. ఇదే అదనుగా అవినీతిపై పోరాటం నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు దిసనాయకే. వారిని ఆకట్టుకున్నారు. 42.31 శాతం ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థి సాజిత్ ప్రేమదాస సమగి జన బలవేగయ (ఎస్‌జెబి)పై సంచలన విజయం సాధించారు. వాస్తవానికి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ శనివారం పూర్తయింది. ఆ వెంటనే ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలి ప్రాధాన్య ఓట్లలో ఎవరికీ విజయానికి అవసరమైన 50 శాతానికి పైగా ఓట్లు రాలేదు. దీంతో ఆ దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా రెండో రౌండ్‌ కౌంటింగ్‌ చేపట్టారు. దిసనాయకేకు 42 శాతంపైగా ఓట్లు దక్కాయి. లంకలో మొత్తం 1.7 కోట్ల మంది నమోదిత ఓటర్లలో 75 శాతానికి పైగా ప్రజలు ఓటు వేశారు. దిసనాయకే, విక్రమసింఘె, విపక్షనేత సజిత్‌ ప్రేమదాస మధ్య ఈసారి త్రిముఖ పోరు నెలకొంది. అయితే, ప్రేమదాస (సమగి జన బలవేగాయా/ఎస్‌జేబీ)కు 32.76శాతం ఓట్లు వచ్చాయి. రణిల్‌ విక్రమసింఘే తొలి రౌండ్ లోనే తప్పుకొన్నారు.

స్టూడెంట్ యూనియన్ నుంచి..

దిసనాయకే విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలుపెట్టారు. 1968లో కొలంబోకు 100 కిలోమీటర్ల దూరంలోని తంబుట్టెగామలో కార్మిక కుటుంబంలో పుట్టిన ఆయన యూనివర్సిటీలో చేరాక విద్యార్థి నేత అయ్యారు. వారి ఊరి నుంచి తొలి యూనివర్శిటీ విద్యార్థి దిసనాయకేనే కావడం గమనార్హం. బీఎస్సీ చదివిన దిసనాయకే.. సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్ లో చేరి విద్యార్థి రాజకీయాల్లో ఎదిగారు. 1987లో మార్క్సిస్టు ప్రభావిత జనతా విముక్తి పెరమున (జేవీపీ)లో చేరారు. 1998లో కీలకమైన పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. 2000లో ఎంపీ, 2004లో శ్రీలంక ఫ్రీడమ్‌ పార్టీతో కలిసి జేఎన్‌పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. చంద్రికా కుమారతుంగ ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఇప్పుడు నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పీపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

3 శాతం ఓట్ల నుంచి..

గత ఎన్నికల్లో దిసనాయకే సాధించిన ఓట్లు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆయనకు కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, రాజపక్సే కుటుంబ, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి దిసనాయకే తమ దశ మారుస్తారని ఆశించారు. దీనికితగ్గట్లే మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం నినాదాలతో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎత్తిచూపుతూనే.. జవాబుదారీతనం తెస్తానని ప్రకటించారు. మరి దిసనాయకే.. తనదైన దిశలో వెళ్లి మార్పు తెస్తారేమో చూద్దాం.