Begin typing your search above and press return to search.

అబ్బ‌ఛా! ఏం చెప్పారు.. కేంద్ర మంత్రిగారు!

ఎన్నిక‌ల వేళ నాయ‌కులు చేసే వ్యాఖ్య‌లు, చేసే ప్ర‌సంగాలు విన‌సొంపుగా కంటే.. అబ్బ‌ఛా! నిజ‌మేనా? అని అనిపించేలా ఉంటాయి

By:  Tupaki Desk   |   25 April 2024 12:30 AM GMT
అబ్బ‌ఛా!  ఏం చెప్పారు.. కేంద్ర మంత్రిగారు!
X

ఎన్నిక‌ల వేళ నాయ‌కులు చేసే వ్యాఖ్య‌లు, చేసే ప్ర‌సంగాలు విన‌సొంపుగా కంటే.. అబ్బ‌ఛా! నిజ‌మేనా? అని అనిపించేలా ఉంటాయి. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్య‌లు కూడా.. అచ్చంగా ఇలానే ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. హైద‌రాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి బీజేపీ నాయ‌కురాలు.. కొంపెల్లి మాధ‌వీ ల‌త పోటీ చేస్తున్న విష‌యం తెల‌సిందే. ఈమె ప్రచారాన్ని జోరుగా ముందుకు సాగిస్తున్నారు. గెలుస్తారా? ఓడు తారా? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌చారం మాత్రం బాగానే చేస్తున్నారు. మ‌ధ్య మ‌ధ్య‌లో వివాదాల‌కు తావిచ్చేలా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

స‌రే.. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే.. తాజాగా కేంద్ర మంత్రి ఇక్క‌డ జ‌రిగిన ప్ర‌చారంలో మాధ‌వీల‌త‌కు అనుకూలంగా ప్ర‌సంగిస్తూ.. అతిశ‌యోక్తులు ప్ర‌యోగించారు. ``మాధ‌వీల‌త దెబ్బ‌కు ఓవైసీ హైద‌రాబాద్ వ‌దిలి పారిపోయారు`` అని కేంద్ర మంత్రి అనురాగ్ ప్ర‌క‌టించారు. అంతేకాదు.. ఆయ‌న అక్క‌డితోనూ ఆగ‌లేదు. ``హైద‌రాబాద్ ముస్లింలు కూడా.. మోడీ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మాధ‌వీల‌త‌ను గెలిపించేందుకు ఎన్నిక‌ల కోసం ఎదురు చూస్తున్నారు`` అనేశారు. మ‌రి ఆయ‌న‌కు ఏ జ్యోతిష్యుడు చెప్పాడో కానీ.. ఇక్క‌డి నాడిని బాగానే ప‌ట్టుకున్నారే.. అని నెటిజ‌న్లు స‌టైర్లు వేస్తున్నారు.

ఇక‌, త‌న ప్ర‌సంగంలో మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ``హైదరాబాద్‌లోని ప్రతి గల్లీ మాధవీలత గెలుపు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. పాతబస్తీలో 40 ఏళ్ల జంగిల్ రాజ్(ఓవైసీ పాల‌న‌) నుంచి తమను విముక్తం చేయడానికి మాధవీలత, కమలం వచ్చాయని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో కమలం వికసిస్తుంది`` అని కూడా కేంద్ర మంత్రి ఠాకూర్ సెల‌విచ్చారు. కానీ, ఇవ‌న్నీ.. విన్నాక‌.. స్థానికులు అబ్బ‌ఛా! నిజ‌మేనా? ఔనా? అని బుగ్గ‌లు నొక్కుకుంటున్నారు. మ‌రి.. మ‌రోవైపు మోడీ ముస్లింల‌పై నిప్పులు చెరుగుతున్న విష‌యాన్ని ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేద‌ని.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదైనా చెబితే.. అతికిన‌ట్ట‌యినా ఉండాలి.. క‌నీసం గోడ‌కు సున్నం వేసిన‌ట్ట‌యినా.. ఉండాల‌ని.. మ‌రికొంద‌రు పెద‌వి విరుస్తున్నారు.