కోహ్లి ఫిట్ నెస్ రహస్యం ఏమిటి?
అంతకంటే కఠినమైన వ్యాయామాన్ని పాటించాడు.. సూపర్ ఫిట్ గా మారాడు.. ఇండియన్ క్రికెట్ లో సూపర్ మ్యాన్ గా ఎదిగాడు..
By: Tupaki Desk | 5 Dec 2024 5:30 PM GMT2008లో 19 ఏళ్ల కుర్రాడిగా.. బూరెల్లాంటి బుగ్గలతో కనిపించాడు అతడు.. 2012లో కాస్త బొద్దుగా సగటు క్రికెటర్ ను తలపించాడు అతడు.. కానీ, వరుస వైఫల్యాలు.. దీంతో అద్దం ముందు నిల్చుని తనతో తాను మాట్లాడుకున్నాడు.. ఇకమీదట ఇలాగైతే అంతర్జాతీయ క్రికెట్ లో రాణించడం కష్టమని తేల్చుకున్నాడు.. అంతే.. తన లైఫ్ స్టయిల్ మార్చేశాడు..కఠినమైన డైట్ ను ఎంచుకున్నాడు. అంతకంటే కఠినమైన వ్యాయామాన్ని పాటించాడు.. సూపర్ ఫిట్ గా మారాడు.. ఇండియన్ క్రికెట్ లో సూపర్ మ్యాన్ గా ఎదిగాడు..
ఫిట్ నెస్ ఐకాన్
ఆధునిక భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ తర్వాత అంతటి పాపులారిటీ విరాట్ కోహ్లికే సొంతం. అతడి బ్యాటింగ్ సామర్థ్యం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు కానీ.. ఫిట్ నెస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. 2014-15 సీజన్ తర్వాత తన పరిస్థితి ఏమిటో ఊహించుకున్న కోహ్లి పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడున్న కోహ్లి రూపానికి అప్పుడే పునాది పడింది. మొత్తమ్మీద కోహ్లి టీమ్ ఇండియాకు ఫిట్ నెస్ బెంచ్ మార్క్ నెలకొల్పాడు. అందుకే.. ఇండియన్ క్రికెట్ లో సచిన్, ధోనీ కంటే కంటే కోహ్లి స్థానం ప్రత్యేకం అనిచెప్పాలి.
ఫిట్ నెస్సే ప్రామాణికం
కెరీర్ మొదట్లో కోహ్లి అందరు కుర్రాళ్లలానే ఉండేవాడు. ఎంత పేరు వచ్చిందో అంతగా ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. దీంతో తన లైఫ్ స్టయిల్ మార్చాడు. అన్నిటినీ పక్కనపెట్టి ఫిట్ నెస్ ను చేర్చాడు. ఇందులో ఏమాత్రం రాజీపడకుండా ముందుకెళ్లి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కోహ్లి ఫిట్ నెస్ రహస్యాలను ఆయన భార్య అనుష్క శర్మ తెలిపింది. కఠిన ట్రైనింగ్, ఆరోగ్యకర ఆహార అలవాట్లతో కోహ్లి అద్భుత ప్రయాణానికి తోడ్పడ్డాయని పేర్కొంది. తన పద్ధతులు చుట్టుపక్కల వారిలోనూ స్ఫూర్తి నింపాయని తెలిపింది.
సినీ ఇండస్ట్రీకే స్ఫూర్తి..
బాలీవుడ్ హీరోయిన్ అయిన అనుష్క.. తన భర్త ఆరోగ్యం, ఫిట్ నెస్ విషయంలో తీసుకునే శ్రద్ధ సినీ పరిశ్రమకూ వ్యాపించిందని తెలిపింది. కోహ్లి తెల్లవారుజామున కచ్చితంగా నిద్ర లేస్తాడని.. కార్డియో లేదా హిట్ ట్రైయినింగ్ చేస్తాడని వివరించింది. కొద్దిసేపు తనతో క్రికెట్ ఆడతాడని పేర్కొంది.
డైట్ సూపర్ క్లీన్
తన భర్త కోహ్లి డైట్ చాలా క్లీన్ గా ఉంటుందని.. జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ అస్సలు దగ్గరకు రానీయడని అనుష్క పేర్కొంది. తనకు బటర్ చికెన్ అంటే ఎంతో ఇష్టమని.. కానీ, అది తిని పదేళ్లు అవుతోందని పేర్కొంది. నిద్ర పోవడంలోనూ విరాట్ అసలు తగ్గడని.. కావాల్సినంత విశ్రాంతి ఉండేలా చూసుకొంటాడని చెప్పింది. రెస్ట్ అనేది మన చేతుల్లోని అంశంగా కోహ్లి ఎప్పుడూ చెబుతుంటాడని అనుష్క పేర్కొంది. జీవితంలోని ప్రతి అంశానికి కట్టుబడి ఉండటమే కోహ్లిని ప్రపంచ క్రీడాకారుడిగా తీర్చిదిద్దిందని వివరించింది.