300 అడుగుల లోయలో పడి ట్రావెల్ వ్లాగర్ మృతి
ఘటనా సమయంలో స్థానిక అధికారులను తన స్నేహితులు అప్రమత్తం చేయగలిగారు. అధికారులు త్వరగా రెస్క్యూ ఆపరేషన్ టీమ్‌ను సమీకరించారు.
By: Tupaki Desk | 18 July 2024 3:45 PM GMTముంబైకి చెందిన ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్, 27 ఏళ్ల ఆన్వీ కామ్‌దర్ మహారాష్ట్ర- రాయ్‌గఢ్ జిల్లాలోని ప్రసిద్ధ కుంభే జలపాతం వద్ద ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరిస్తున్నపుడు లోయలో పడి మరణించారు. @theglocaljournal ఇన్‌స్టాలో కామ్‌దర్ వీడియోలు చాలా పాపులర్. ఆమె ఒక చార్టర్డ్ అకౌంటెంట్.. తన ప్రయాణాలను 2.6 లక్షల మంది అనుచరులకు డాక్యుమెంట్ చేసింది.
కామ్ దార్ జూలై 16న ఏడుగురు స్నేహితుల బృందంతో జలపాతానికి విహారయాత్రకు బయలుదేరారు. ఈ పర్యటనలో వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఆమె జారిపడి 300 అడుగుల డెప్త్ ఉన్న లోయలో పడిపోయిందని మంగావ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఘటనా సమయంలో స్థానిక అధికారులను తన స్నేహితులు అప్రమత్తం చేయగలిగారు. అధికారులు త్వరగా రెస్క్యూ ఆపరేషన్ టీమ్‌ను సమీకరించారు. రెస్క్యూ టీమ్‌తో పాటు, కోస్ట్ గార్డ్, కోలాడ్ రెస్క్యూ టీమ్, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సిబ్బంది సహకారం అందించారు.
దీనిపై ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ-''మేం సంఘటనా స్థలానికి చేరుకోగానే ఆ బాలిక దాదాపు 300-350 అడుగుల లోయలో పడిపోయిందని గ్రహించాం. ఆమెను చేరుకున్న తర్వాత కూడా గాయపడి ఉంది. భారీ వర్షం కురుస్తున్నందున తనను పైకి లేపడం కష్టంగా మారింది'' అని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న మరొక వ్యక్తి వివరాల ప్రకారం కొండగట్టులో పెద్ద రాళ్లు పడటంతో రెస్క్యూ మరింత క్లిష్టంగా మారింది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, ఆరు గంటల ప్రయత్నం తర్వాత కామ్ దార్‌ను పగుళ్ల నుండి బయటకు తీశారు. ఆమెను రక్షించిన కొద్దిసేపటికే మంగావ్ తాలూకా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. జలపాతాలను సందర్శించేటప్పుడు, ముఖ్యంగా వర్షాకాలంలో పర్యాటకులు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.