Begin typing your search above and press return to search.

కశ్మీర్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా.. తొలిదశలో 61శాతం పోలింగ్

ఆసక్తికర అంశం ఏమంటే.. తొలిదశ పోలింగ్ లో ఏకంగా 61 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

By:  Tupaki Desk   |   19 Sep 2024 4:46 AM GMT
కశ్మీర్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా.. తొలిదశలో 61శాతం పోలింగ్
X

ఆసక్తికర పరిణామం కశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కనిపిస్తోంది. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయటం.. ఓటేయటం నేరంగా భావించేవారు. ఎంత ప్రయత్నం చేసినా ఎన్నికల పోలింగ్ మొత్తంగా పాతిక శాతానికి కూడా మించేది కాదు. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో తొలిదశ పోలింగ్ బుధవారం ముగిసింది. ఆసక్తికర అంశం ఏమంటే.. తొలిదశ పోలింగ్ లో ఏకంగా 61 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ఈ ఒక్క అంశం చాలు.. కశ్మీర్ లో మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పాలి. ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత జరుగుతున్న మొట్టమొదటి అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకు తగ్గట్లే తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు మినహా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదని చెబుతున్నారు.

తాజాగా నమోదైన పోలింగ్ శాతం గడిచిన 35 ఏళ్లలో ఇదే అత్యధికంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పీకే పోలె మీడియాకు వెల్లడించారు. కిశ్త్ వాద్ జిల్లాలో అత్యధికంగా 77 శాతం పోలింగ్ నమోదు అయితే.. పుల్వామాలో అత్యల్పంగా 46 శాతం ఓటింగ్ నమోదైంది. తాజాగా వెలువడిన పోలింగ్ శాతం కంటే ఎక్కువగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం బ్యాలెట్ల వివరాలు మారుమూల ప్రాంతాల నుంచి తుదినివేదికలు రావాలని చెబుతున్నారు.

తొలి దశలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా.. మిగిలిన 66 నియోజకవర్గాల్లో పోలింగ్ సెప్టెంబరు 25న, అక్టోబరు ఒకటిన రెండు.. మూడుదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ ను చూసినప్పుడు కశ్మీర్ లోమార్పు కొట్టొచ్చినట్లు కనిపించటమే కదు.. ఓట్లు వేయటానికి గతంలో జనమే వచ్చే వారుకాదు. ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. గతంలో మాదిరి జనం రాక.. పోలింగ్ ను నిర్వహించేందుకు ఉద్యోగులు ఏ మాత్రం ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేకపోవటమే కాదు.. పోలింగ్ శాతం కూడా భారీగా నమోదైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.