ఈసారి సభ అరవై రోజులు...జగన్ మాజీ ఎమ్మెల్యే నేనా ?
ఇదిలా ఉంటే జగన్ విషయం ప్రస్తావనకు వచ్చి చర్చ సాగుతోంది కాబట్టి ఈ అంశం ఇపుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
By: Tupaki Desk | 20 Nov 2024 3:45 AMఏపీ అసెంబ్లీ మొత్తం ఏడాదితో సమావేశం అయ్యేది ముప్పయి నుంచి నలభై రోజులుగా ఉంటుంది. ఉమ్మడి ఏపీలో అయితే అరవై నుంచి డెబ్బై రోజుల పాటు సభలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది ఎలా అంటే బడ్జెట్ సెషన్ నెల రోజులు పైగా సాగితే సమ్మర్ సెషన్, రైనీ సెషన్, వింటర్ సెషన్ ఇలా మూడూ మరో ముప్పయి నుంచి నలభై రోజులు సాగిన సందర్భాలు ఉన్నాయి.
అయితే రెండుగా ఏపీ విడిపోయింది. దాంతో అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గాయి. ఇక పని దినాలూ తగ్గాయని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈసారి అసెంబ్లీకి వైసీపీ మొత్తం గైర్ హాజరు అయింది. దాంతో కూటమిలో చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలు పది రోజులకు పైగా సాగినా వైసీపీ రాకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలే సభలో ఉన్నట్లు అయింది.
ఇవన్నీ పక్కన పెడితే జగన్ సహా మిగిలిన పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని ఒత్తిడి వస్తోంది.ఇక జగన్ మీడియా సమావేశం పెడితే మీడియా ప్రతినిధి ఒకరు ఇదే విషయం మీద ప్రశ్నించారు. వైసీపీ మీద అనర్హత వేటు వేయమనండి చూద్దామని జగన్ సవాల్ కూడా చేశారు.
ఈ క్రమంలో సభకు రాని వారి మీద అనర్హత వేటు వేస్తే సరిపోతుంది కదా అని మేధావుల నుంచి కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే జగన్ మీద కానీ ఏ ఎమ్మెల్యే మీద కానీ వేటు వేయడం అంత సులువు కాదని అంటున్నారు.
ఏ సభ్యుడు సభ్యత్వం రద్దు కావాలీ అంటే ఒక పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడాలి. అలా కాదు అంటే ఆయన విప్ ని ధిక్కరించినా సభ్యత్వం పోతుంది. కానీ సభకు రాకపోతే సభ్యత్వం పోయేది ఉండదని అంటున్నారు.
అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190ని చాలా మంది ఇపుడు ప్రస్తావిస్తున్నారు. దాని ప్రకారం సభను నిరాటంకంగా అరవై రోజుల పాటు నిర్వహించాలి. అలా నిర్వహించినపుడు ఒక సభ్యుడు సభకు సభకు గైర్ హాజరు అయితే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది. అయితే ఇది చాలా పెద్ద ప్రయత్నం.
దేశంలో ఏ సభ కూడా ఇన్నేసి రోజులు ఏకబిగిన సాగిన దాఖలాలు లేవు. ఆఖరుకు 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ కూడా రెండు విడతలుగా బడ్జెట్ సెషన్ నిర్వహిస్తుంది కానీ ఏక బిగిన కాదు. మరి ఏపీ అసెంబ్లీ అలా రెండు నెలల పాటు సమావేశం జరుపుకుంటుంది అంటే చూడాలని అంటున్నారు. జగన్ సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు చేయించాలి. అంటే అలా సభ జరపాల్సిందే అని అంటున్నారు.
కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. మొత్తం అరవై రోజుల పాటు సభ జరిగితే ఆ మొత్తం రోజులలో ఏదో ఒక రోజు జగన్ సభకు వచ్చినా ఆయన ఎమ్మెల్యేలు వచ్చినా వారి సభ్యత్వం పోయేది ఉండదు. మరి దాని కోసం ఏక బిగిన అరవై రోజులు సభ జరుపుతారా అన్నది ఒక చర్చ.
ఇదిలా ఉంటే జగన్ విషయం ప్రస్తావనకు వచ్చి చర్చ సాగుతోంది కాబట్టి ఈ అంశం ఇపుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే రాజ్యాంగంలోనే దీనికి ఒక పరిష్కారం ఉంది అని అంటున్నారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోనూ సవరణలు తేవాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు ఫలా నా సభ్యులు ఇన్ని రోజులు సభకు హాజరు కావాలని నిబంధన అక్కడ పెడితే తప్ప ఈ తరహా గైర్ హాజరులను ఎవరూ ఏమీ చేయలేరు అని అంటున్నారు. మరి చట్ట సవరణ జరుగుతుందా అన్నది చూడాల్సి ఉంది.