Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రేర్ సీన్

రోటీన్ కు భిన్నమైన సీన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో నెలకొందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   22 Oct 2024 9:30 AM GMT
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రేర్ సీన్
X

రోటీన్ కు భిన్నమైన సీన్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో నెలకొందని చెప్పాలి. కారణం ఏమైనా కానీ తెలుగు రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు ఇద్దరు అసెంబ్లీకి హాజరుకాకపోవటం చర్చగా మారింది. తెలంగాణలో రేవంత్ సర్కారు కొలువు తీరి దగ్గర దగ్గర ఏడాది కానుంది. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరైన సందర్భం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ముఖ్యమంత్రి సభలో ఉండాలని.. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాల్నివినాలని.. సమస్యలకు పరిష్కారాలు చెప్పాలన్న డిమాండ్ తరచూ వినిపిస్తూ ఉంటుంది.

అందుకు భిన్నంగా ముఖ్యమంత్రే.. ప్రతిపక్ష నేతను అసెంబ్లీకి రావాలని.. ఆయన చర్చల్లో పాల్గొనాలంటూ తరచూ వ్యాఖ్యలు చేయటం రోటీన్ కు భిన్నం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ.. విపక్ష నేత కం గులాబీ బాస్ కేసీఆర్ ను అసెంబ్లీకి హాజరు కావాలని కోరటం తెలిసిందే. అసెంబ్లీ వేదికగానే కాదు.. విడి సందర్భాల్లోనూ ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి హాజరైతే బాగుంటుందన్న మాటను తరచూ చెప్పటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీకి ప్రతిపక్ష నేత (ప్రధాన ప్రతిపక్ష నేతగా జగన్ కు గుర్తింపు లేకపోవటం తెలిసిందే. అసెంబ్లీలో ఉన్న బలానికి అనుగుణంగా ఈ హోదా దక్కలేదు. దీనిపై ఆయన ఇప్పటికే పోరాటం చేస్తున్నారు) జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి హాజరు కాకపోవటం తెలిసిందే. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాలకు అయినా అసెంబ్లీకి వస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇలాంటి వేళ.. ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అనకాపల్లి జిల్లా పెదగొలుగొండపేట గ్రామంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అనూహ్య రీతిలో జగన్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘జగన్ అసెంబ్లీకి వచ్చి నాకు నమస్కారం పెడితే చూద్దామని ఉంది. కానీ.. రాలేదు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ సమావేశాలకైనా మాజీ సీఎంజగన్ రావాలి’’ అంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తే.. రోటీన్ కు భిన్నంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని విపక్ష నేతలు వ్యవహరిస్తున్నారని చెప్పాలి. తెలంగాణలో విపక్ష నేత రావాలని సీఎం రేవంత్ అదే పనిగా అడుగుతుంటే.. తాజాగా ఏపీలో అసెంబ్లీ స్పీకరే స్వయంగా ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీకి వస్తే చూడాలని ఉందని చెప్పటం చూస్తే.. ఇదో రేర్ సీన్ గా చెప్పక తప్పదు.