ఇద్దరికి ఇద్దరు.. రూల్స్ కర్రతో స్పీకర్ జోడి విజృంభణ
ప్రతిపక్ష వైసీపీ, ఆ పార్టీ నేత మాజీ సీఎం జగన్ టార్గెట్ గా ఈ ఇద్దరూ పొలిటికల్ పంచులు వేస్తున్నారు.
By: Tupaki Desk | 11 Feb 2025 8:30 PM GMTఒకటే మాట.. ఒకటే బాటలా సాగుతోంది ఏపీలో శాసన సభాపతి, ఉప సభాపతి జోడి. ప్రతిపక్ష వైసీపీ, ఆ పార్టీ నేత మాజీ సీఎం జగన్ టార్గెట్ గా ఈ ఇద్దరూ పొలిటికల్ పంచులు వేస్తున్నారు. వేటు కత్తి పట్టుకుని సిద్ధంగా ఉన్నామంటున్నారు. అయితే వీరి బెదిరింపులు, అదిరింపులకు వైసీపీ భయపడుతుందా? లేక ఏం చేస్తారో చూస్తామంటూ మరింత మంట పుట్టిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఏ స్పీకర్ జోడి కూడా వీరిలా ఇంత చక్కటి సమన్వయంతో పనిచేయకపోవడం, ఇద్దరూ ఒకటే టార్గెట్ తో రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తుండటం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చకు దారితీస్తోంది.
60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని, పులివెందుల ఉప ఎన్నిక వస్తుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ ఎప్పటి నుంచో చెబుతున్నారు. అయితే ఆయన లేవనెత్తిన అంశంపై ఇంతవరకు అధికార పక్షం పెద్దగా పట్టించుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లే వ్యవహరిస్తోంది. సభకు రావడం లేదన్న కారణంతో వేటు వేయడం అంటే చిన్నవిషయం కాదు. అదీ ఓ మాజీ ముఖ్యమంత్రిపై అనర్హత వేటు వేస్తే అదో రాజకీయ సంచలనమే అవుతోంది. అందుకే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. కానీ, ఉప సభాపతి వ్యాఖ్యలకు మద్దతుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా శ్రుతి కలుపుతుండటమే రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.
వాస్తవానికి వైసీపీని ఇలాంటి రాజకీయ సమస్యలో ఇరికించే ఉద్దేశంతోనే కూటమి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై ఆచితూచి నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి తీరు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు సరైన నిర్ణయమే తీసుకున్నారని కూటమి కార్యకర్తలు సంబరపడుతున్నారు. గతంలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఇప్పుడున్నంత క్రేజ్ లేదు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న ఇద్దరూ గత ప్రభుత్వంలో తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొవడంతో వారు ఇప్పుడు రివేంజ్ పాలిటిక్స్ ప్రదర్శిస్తుండటమే రాజకీయంగా ఆసక్తి పుట్టిస్తోంది.
గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ పై ప్రతిరోజూ రచ్చబండ పేరిట రచ్చ చేసిన రఘురామ ఇప్పుడు కూడా నిన్ను వదలను జగన్ అంటూ వెంటపడుతున్నారు. అదేవిధంగా గతంలో తనపై నమోదైన కేసులను ఎదురొడ్డి ఎన్నికల్లో గెలిచిన అయ్యన్న కూడా తనదైన అధికారంతో వైసీపీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. ఈ ఇద్దరితో సయోధ్య చేసుకుని మెలిగితే వైసీపీకి సభలో కొంతమేర ప్రయోజనం దక్కే వీలుంటదని అంటున్నారు. కానీ, మాజీ సీఎంకు సభాపతులు ఇద్దరితోనూ పేచీ ఉండటమే వైసీపీని మరింత ఇబ్బంది పెడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీంతో సభాపతులు ఇద్దరు రూల్స్ కర్ర పట్టుకుని ప్రతిపక్షాన్ని వెంబడించడం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ ఇద్దరూ ఎవరి మాట వినే రకం కాదని, నిజంగా 60 రోజుల గైర్హాజరుకు అనర్హత వేటు వేసే అవకాశం ఉంటే వారి యాక్షన్ ఎలా ఉంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. నిజంగా రూల్స్ అలా ఉంటే ఈ ఇద్దరూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలను కూడా పాటించే రకాలు కాదంటున్నారు. దీంతో వీరి రాజకీయ కక్ష ఏమైనా ఉంటే.. ప్రభుత్వం జోక్యం లేకుండానే ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.