Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి రానంటే అనర్హత వేటు : స్పష్టం చేసిన అయ్యన్న

ఎమ్మెల్యేలు సహేతుక కారణం లేకుండా 60 రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకునే అధికారం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 1:32 PM GMT
అసెంబ్లీకి రానంటే అనర్హత వేటు : స్పష్టం చేసిన అయ్యన్న
X

ఎమ్మెల్యేలు సహేతుక కారణం లేకుండా 60 రోజులు వరుసగా అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకునే అధికారం ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ స్పష్టం చేశారు. ''ఫలానా కారణంతో రాలేకపోతున్నామని ఎమ్మెల్యేలు స్పీకరుకు లేఖ ఇవ్వాల్సివుంటుంది. సభ్యుల లేఖలో చెప్పిన కారణం సరైనదేనని అనిపిస్తే స్పీకర్ అనుమతి ఇస్తారు. సభకు రాని సభ్యులు వ్యక్తిగతంగా లేఖలు ఇవ్వాల్సివుంటుంది'' అని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అసెంబ్లీ హాజరు పట్టికలో నకిలీ సంతకాలు పెట్టేందుకు కుదరదని స్పీకర్ తేల్చిచెప్పారు.

వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరుపై ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాని సభ్యుడిపై అనర్హత వేటు వేసేలా చట్టాలు ఉన్నాయని రఘురామ తెలిపారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా వాడివేడి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా డిప్యూటీ స్పీకర్ వాదనను బలపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదనే కారణంతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఆయనతోపాటు ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరు అవుతున్న విషయం తెలిసిందే.

ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తాము ఎలా ఇస్తామని, ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించినందున ఆ పదవికి న్యాయం చేయాలని రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా ఈ రోజు ఢిల్లీలో అయ్యన్న ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం వైరల్ అవుతోంది. ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు జరిగే ఎమ్మెల్యేల శిక్షణ ముఖ్య అతిథిగా హాజరుకావాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను ఆహ్వానించేందుకు ఢిల్లీ వెళ్లిన అయ్యన్నపాత్రుడు మాజీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు.

అసెంబ్లీకి రాకుండా ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడితే ప్రభుత్వం, మంత్రులు సమాధానం చెప్పాలని వైసీపీ డిమాండ్ చేయడం వింతగా ఉందని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి పద్ధతి ఉందా? అంటూ నిలదీశారు. చట్టాలపై అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? లేదా? అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఇచ్చినంత సమయం తనకూ ఇవ్వాలని జగన్ కోరుతున్నారని, ఏ రూల్ ప్రకారం ఆయన అలా అడుగుతున్నారో చెప్పాలని కోరారు. జగన్ ప్రతిపక్ష నేత కాదు. ఆ హోదాకు తగిన సంఖ్యా బలం వైసీపీకి లేదనేది జగమెరిగిన సత్యమంటూ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అనర్హత వేటుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ఈ బడ్జెట్ సమావేశాలకు జగన్ హాజరవుతారని వైసీపీ ఓ పక్క లీకులిస్తోంది. అయితే గతంలో తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేగాని అసెంబ్లీలో అడుగుపెట్టనంటూ జగన్ తేల్చిచెప్పారు. ఈ పరిస్థితుల్లో జగన్ ను రెచ్చగొట్టేలా జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందంటూ రఘురామ చెప్పారు. ఆయనను సమర్థిస్తూ ఇప్పుడు అయ్యన్నపాత్రుడు కూడా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఏదైనా సంచలన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది.