Begin typing your search above and press return to search.

కూటమిలో బీజేపీకి అన్యాయం జరుగుతోందా ?

ఏపీలో టీడీపీ కూటమిలో పెద్దన్న పాత్ర టీడీపీదే. నో డౌట్. ఆ తరువాత ప్లేస్ లో పవన్ కళ్యాణ్ జనసేన ఉంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 3:17 AM GMT
కూటమిలో బీజేపీకి అన్యాయం జరుగుతోందా ?
X

ఏపీలో టీడీపీ కూటమిలో పెద్దన్న పాత్ర టీడీపీదే. నో డౌట్. ఆ తరువాత ప్లేస్ లో పవన్ కళ్యాణ్ జనసేన ఉంది. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ప్లస్ బలమైన సామాజిక నేపథ్యం కలిగిన నేత. దాంతో ఆయనను సీట్లూ ఓట్లూ చూసి తగ్గించాలనుకుంటే చిక్కు. అందుకే పవన్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత అధికంగా ఉంటుంది.

ఇక మిగిలింది బీజేపీ. కూటమిలో బీజేపీది జూనియర్ పాత్రనా లేక సబ్ జూనియర్ పాత్రనా అన్నది కూడా అర్ధం కాని పరిస్థితి. నిజానికి దేశాన్ని ఏలే జాతీయ పార్టీ బీజేపీ. ఏపీలో కూడా ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి ఉన్నారు

బీజేపీకి అగ్ర వర్ణాలలో పట్టు ఉంది. ఎంత చెడ్డా బీజేపీ ఏపీ కూటమికి ఇరుసు లాంటిది. పవన్ చంద్రబాబులతో నడిచే కూటమి రధానికి బీజేపీ ఇంధనం కూడా. అలాంటి బీజేపీకి మంత్రి పదవుల విషయంలోనే అన్యాయం జరిగింది అని మాట వినిపించింది. కేవలం ఒక్కరితోనే సరిపెట్టారు.

కనీసం డిప్యూటీ స్పీకర్ అయినా ఇస్తారని బీజేపీ ఆశపడుతోంది. ఇదిలా ఉంటే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా బీజేపీకి అన్యాయం జరిగింది అని ఇపుడు ఆ పార్టీలో కలకలం రేగుతోంది. చంద్రబాబు తాజాగా ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్ పదవులు ప్రకటించారు. అయితే అందులో బీజేపీకి దక్కింది కేవలం ఒకే ఒక్క పదవి.

దాంతో కమలం పార్టీలో నేతలు రగిలిపోతున్నారు. ఇక ఈ ఇరవై నామినేటెడ్ చైర్మన్ పోస్టులలో టీడీపీ పదహారు పోస్టులను తీసుకుంది. జనసేనకు మూడు దక్కాయి. బీజేపీకే ఒకే ఒక్కటి ఇచ్చి సరిపుచ్చారు. ఇదేమిటి అని బీజేపీ నేతలు గళమెత్తుతున్నారు.

నామినేటెడ్ పదవుల విషయంలో కనీసం ఆరు చైర్మన్ పదవులు అయినా తమకు ఇవ్వాలని బీజేపీ కోరుతోంది. అలాగే విజయవాడ దుర్గగుడి చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని కూడా విన్నవించినట్లుగా చెబుతున్నారు. మొత్తం వంద దాకా పోస్టులు ఉంటే అందులో ఆరు నుంచి పది దాకా తమకు దక్కుతాయని బీజేపీ ఆశలు పెంచుకుంటే ఒకే ఒక్క పదవిని ఇచ్చారని అది కూడా మొదటి నుంచి బీజేపీలో ఉన్న వారికి కాకుండా సుజనా చౌదరికి సన్నిహితుడైన లంక దినకర్ కి ఇచ్చారని అంటున్నారు.

అయితే సార్వత్రిక ఎన్నికల్లో అన్యాయం జరిగిందని భావించిన పురంధేశ్వరి ఏపీ మాజీ ప్రెసిడెంట్ సోము వీర్రాజును కాపుల కోటాలో గోదావరి జిల్లాల నుంచి అదే విధంగా రాయలసీమ నుంచి బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి విష్ణు వర్ధన్ రెడ్డి పేర్లను ఆమె ప్రతిపాదించారు అని అంటున్నారు. కానీ ఈ ఇద్దరు నేతలు గత ఐదేళ్ళలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు అని టీడీపీలో కొందరు నేతలు అంటున్నారని తెలుస్తోంది.

అలాగే బీజేపీలో కూడా ఒక సెక్షన్ కి వీరికి పదవులు ఇవ్వడం ఇష్టం లేదని అంటున్నారు. దాంతో వీరి విషయంలో బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. ఆ విధంగా మరికొంత మంది నేతలకు కూడా నామినేటెడ్ పదవులు ఇప్పించాలని పురంధేశ్వరి చూస్తున్నారు. అయితే బాబు మాత్రం తొలి విడతలో బీజేపీకి షాక్ ఇచ్చారని అంటున్నారు.

దాంతో బీజేపీలో పదవుల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు మాత్రం కలవరపడుతున్నారు. పురంధేశ్వరికి చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. అయితే పురందేశ్వరి మాత్రం తరువాత విడతలో మరిన్ని పదవులు వస్తాయని నచ్చచెబుతున్నారుట. అయితే మరి ఆ విధంగా పదవులు ఇస్తారా అన్నదే కమల దళంలో కలుగుతున్న సందేహం. ఒకవేళ ఇవ్వకపోయినా అడిగేందుకు సాహసించేవారు ఎవరూ లేరని అంటున్నారు.

ఎందుకంటే ఏపీలో టీడీపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషిస్తోంది. దాంతో బీజేపీ పెద్దలు కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి. బాబు ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాల్సిందే అని అంటున్నారు. అదే విధంగా కేంద్రంలో అధికారం ముఖ్యం. బాబు లాంటి మిత్రుడు ఇంకా ముఖ్యం. అందువల్ల ఆయనను ఇబ్బంది పెట్టరాదు అన్నది కేంద్ర బీజేపీ పెద్దల ఆలోచన. దాంతో జనసేన టీడీపీ ఇద్దరూ సర్దుకుని బీజేపీకి ఇవ్వాల్సినవి మాత్రమే ఇస్తున్నారు అని కమల దళంలో ఆక్రోశం కనిపిస్తోంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయతలో ఏపీ బీజేపీ ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో .