బడ్జెట్ సెషన్... అదే చేస్తారా జగన్ ?
2025-2026 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎంత బడ్జెట్ పెడుతుంది అన్నది ఆసక్తికరంగా ఉంది.
By: Tupaki Desk | 16 Feb 2025 3:56 AM GMTబడ్జెట్ సెషన్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నెల 24 నుంచి ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ ని పెడుతున్న సందర్భం ఇది. 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎంత బడ్జెట్ పెడుతుంది అన్నది ఆసక్తికరంగా ఉంది.
ఇదిలా ఉంటే ఈసారి బడ్జెట్ సెషన్ కి వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ వస్తారా అన్నది మరో చర్చగా ఉంది. జగన్ హాజరు కావాలని ఒక వైపు స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరో వైపు డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు పిలుస్తున్నారు అదే టైం లో వైసీపీ ఎమ్మెల్యేలు కనుక స్పీకర్ అనుమతి తీసుకోకుండా సభకు అరవై రోజుల పాటు గైర్ హాజరు అయితే కచ్చితంగా వారి మీద అనర్హత వేటు పడుతుందని స్పష్టంగా చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ఏ విధంగా ఆలోచిస్తుంది అన్నది కూడా ఒక హాట్ టాపిక్ గానే ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ నెల 24న ఏపీ బడ్జెట్ సెషన్ గవర్నర్ స్పీచ్ తో మొదలవుతుంది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆయన ప్రభుత్వం గత ఎనింది నెలలలో చేసిన కార్యక్రమాలను చెబుతారు.
ఆ విధంగా సంప్రదాయం ప్రకారం గవర్నర్ చేసే ప్రసంగానికి అంతా హాజరు కావాల్సి ఉంటుంది. దాంతో మొదటి రోజు గవర్నర్ ప్రసంగం తరువాత సభ వాయిదా పడుతుంది. ఆ తరువాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఉంటుంది. అక్కడ ఎన్ని రోజులు సభను జరపాలని నిర్ణయం తీసుకుంటారు.
అలా పూర్తి స్థాయి సమావేశాలు మొదలవుతాయి. ఇకపోతే గవర్నర్ ప్రసంగానికి వైసీపీ హాజరవుతుంది అని అంటున్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మొదటి అసెంబ్లీ సెషన్ కి గవర్నర్ వచ్చి ప్రసంగం చేసారు. అపుడు కూడా వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. ఈసారి కూడా అదే విధానం జగన్ పాటించే వీలు ఉంది అని అంటున్నారు
ఆ తరువాత సభకు రాకపోయినా ఇబ్బంది ఉండదని అంటున్నారు. మళ్ళీ శీతాకాల సమావేశాల వరకూ అసెంబ్లీ సెషన్ కి రాకపోయినా అనర్హత వేటు అన్న ప్రసక్తి ఉండదని అంటున్నారు. వయా మీడియాగా ఉన్న ఈ మార్గాన్ని వైసీపీ ఎంచుకుంటుందని అంటున్నారు.
అదే సమయంలో బడ్జెట్ సెషన్ కి తాను రాకుండా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పంపించే ఆలోచన కూడా జగన్ చేసే అవకాశాలు ఉన్నాయని మరో చర్చ సాగుతోంది. ఇక చూస్తే బడ్జెట్ సెషన్ కి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోతే వైసీపీ ఎమ్మెల్యే మీద సీరియస్ యాక్షన్ దిశగా కూటమి ప్రభుత్వం ఆలోచించే చాన్స్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.