Begin typing your search above and press return to search.

మంత్రులు అతిగా ఆలోచించేస్తున్నారా ?

ముఖ్యమంత్రిగా చంద్రబాబు వర్కింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తాను కష్టపడి పనిచేస్తారు.

By:  Tupaki Desk   |   8 Feb 2025 4:06 AM GMT
మంత్రులు అతిగా ఆలోచించేస్తున్నారా ?
X

ముఖ్యమంత్రిగా చంద్రబాబు వర్కింగ్ స్టైల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన తాను కష్టపడి పనిచేస్తారు. అలాగే అందరినీ అలెర్ట్ గా ఉంచుతారు. అందరినీ గమనిస్తున్నాను అని ప్రతీ మంత్రివర్గ సమావేశంలో చెబుతూ దిశా నిర్దేశం చేస్తూ వచ్చిన చంద్రబాబు ఎనిమిది నెలల పాలన పూర్తి అయింది అని భావించారో లేక ఇపుడు కాకపోతే మరెప్పుడు అని అనుకున్నారో తెలియదు కానీ మంత్రుల ర్యాంకులు ఇవిగో అని ప్రకటించేశారు.

నిజానికి ఇదొక మంచి ప్రయత్నంగానే చూడాల్సి ఉంది. ఎవరేమిటి అన్నది వారి పనితీరు ఎలా ఉంది అన్నది జనాలకు కూడా తెలియచేసేలా చంద్రబాబు ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో ఆయన కూడా తనకు ఆరవ ప్లేస్ ని ఇచ్చుకున్నారు. మరి చంద్రబాబు ఎటువంటి వివక్ష లేకుండా పారదర్శకంగా ఈ ర్యాంకులను ప్రకటించారని అర్ధమవుతోంది.

జవాబుదారీతనం పెరగాలని అలాగే మంత్రులు అలెర్ట్ కావాలనే ఆయన ఇదంతా చేశారు. కానీ తక్కువ ర్యాంకులు వచ్చిన వారిలో టెన్షన్ పెరిగిపోతోంది. మేము బాగా పనిచేయడం లేదా ఇలాగైతే మాకు జనంలో పార్టీ జనంలో ఇబ్బందులే అని వాపోతున్నారుట. తక్కువ ర్యాంక్ వచ్చిన విద్యార్థులు బాధగా కొంతమంది ఫీల్ అవుతున్నారుట.

తాము కష్టపడి పనిచేస్తున్నామని కానీ ర్యాంకులు చూస్తే చాలా వెనకబడిపోయామని పలువురు అంటున్నారు. నిజానికి ఈ ర్యాంకులు ఇచ్చినది ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో. ఆఫీసులో ప్రతీ రోజూ ఫైల్స్ ఎక్కువగా వస్తాయి. వాటిని మంత్రులు తమ పేషీలలో కూర్చుని క్లియర్ చేయాలి. అలా చేస్తేనే పాలన పరుగులు తీస్తుంది. తొందరగా నిర్ణయాలు అమలులోకి వస్తాయి.

విషయం ఇది అని ఆలోచించడం వల్లనే ముఖ్యమంత్రి ఇలా ర్యాంకులను రిలీజ్ చేసారు. కానీ తక్కువ ర్యాంకులు వచ్చాయని కొంతమంది మంత్రుల అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పదవ ర్యాంక్ రావడం పట్ల ఆ పార్టీలోనూ అసంతృప్తిగా ఉంది అని అంటున్నారు.

నిజానికి చూస్తే ఫైళ్ళ క్లియరెన్స్ చాలా క్లిష్టమైన వ్యవహారంగా చెబుతున్నారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినపుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని అంటున్నారు. అలాగే కొన్ని ఫైళ్ళు వచ్చేటపుడు వాటిని క్లియర్ చేసే విషయంలో అనేక రిస్కులు ఉంటాయి. సంతకం కనుక పెట్టేస్తే ఇబ్బందులూ వెంటనే వస్తాయి. దాంతో టైం కచ్చితంగా తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు.

కొన్ని ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. వాటిలో పని ఒత్తిడి ఉంటుంది. అలాగే మంత్రులు కొంతమంది ఫీల్డ్ మీద ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. అలాంటపుడు పేషీలలో కూర్చుని ఫైల్స్ ని తొందరగా క్లియర్ చేయలేక గుట్టలుగా పేరుకుని పోతాయి. అదే విధంగా పెద్ద శాఖలు ఉంటాయి. కొందరి చేతిలో మూడు నాలుగు శాఖలు ఉంటాయి. అందువల్ల వారు క్లియర్ చేయడం ఒకింత ఆలస్యం అవుతుంది.

అంత మాత్రం చేత వారు పనిమంతులు కారని భావించడం తగదని అంటున్నారు. ఫైళ్ళు క్లియర్ చేయాలంటే ఆఫీసుకే పరిమితం అవుతారని అపుడు నియోజకవర్గంలో సమస్యలు అలాగే క్షేత్ర స్థాయి పర్యటనలు కూడా పెద్దగా పెట్టుకోవడం కుదరదని అంటున్నారు.

ఏది ఏమైనా మంత్రులలో అయితే ఈ ర్యాంకులు టెన్షన్ పెంచుతున్నాయట. వీటిని చూస్తి మంత్రివర్గంలో చేసే మార్పు చేర్పులలో తమ పదవులకు ఇబ్బంది తెస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా ఈ ర్యాంకింగ్ విధానం మంచిదే కానీ అది అంతర్గంగా ఉండాలని ఆయా మంత్రులకే తెలిసేలా ఉంటే వారి పనితీరు మారుతుందని ర్యాంకులకు ఫలితమూ దక్కుతుందని అంటున్నారు. బాహాటం చేయడం వల్ల ప్రత్యర్ధులకు ప్రతిపక్షానికి చాన్స్ ఇచ్చినట్లే అని అంటున్నారు. చూడాలి మరి వచ్చేసారికి ర్యాంకులను బాహాటంగా ప్రకటిస్తారా లేదా అన్నది.